యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఉట్నూర్ ఐటీడీఏ ఎదుట విద్యార్థుల ఆందోళన(ఫైల్)
ఉట్నూర్(ఖానాపూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు అవుతుందనే ఆశ ఇక కలగానే మిగిలిపోనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
కడియం శ్రీహరి జయశంకర్‌భూపాల్‌పల్లి జిల్లా ములుగు మండలం జాకారంలో వచ్చే జూన్‌లో గిరిజన యూనివర్సిటీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని గత గురువారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వర్సిటీ కోసం అవసరమైన భూమిని సేకరించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు లేఖ రాయాలనీ అధికారులకు సూచించారు. 2008లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి
ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సంవత్సరం నవంబర్ 17న జీవో నంబరు 797 విడుదల చేసింది.
అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంగిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 2011 ఆగస్టు 27న జీవో నంబరు 783 జారీ చేసింది. దీంతో జిల్లా, ఐటీడీఏ అధికార యంత్రాంగం ఆదివాసీలకు కేంద్ర స్థానమైన ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలవెనుకాల ప్రభుత్వ భూమి 470 ఎకరాల్లో పరంపోగు భూమి 300 ఎకరాలు గుర్తించింది. 7వ నంబరు జాతీయ రహదారికి 34 కిలోమీటర్ల దూరంలో రవాణా, హైటెన్షన్ విద్యుత్‌తోపాటు ఇతర సౌకర్యాలు=ఉన్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపించింది. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడంతో యూనివర్సిటీ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వాలు పక్కన పెట్టాయి. కేంద్రంలోని యూపీఏప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ కేంద్రమంత్రి వర్గం ఆమోదించిన బిల్లు పదకొండో అంశంలో తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుప్రస్తావన ఉంది. అప్పటికే జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు జారీ చేయడంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అవుతుందని అంతా ఆశించారు.
ప్రారంభానికి ఏర్పాట్లు
గిరిజన యూనివర్సిటీ పాత వరంగల్ జిల్లా(ప్రస్తుతం జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా)లో ఏర్పాటుకు గత ప్రభుత్వాల హయాంలోనే బీజం పడింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ
మంత్రిగా కిశోర్ చంద్రదేవ్, కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రిగా, పాత వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గానికి చెందిన బలరాంనాయక్ ఉండడంతో యూనివర్సిటీని ఆ జిల్లాకు తరలించేలా
ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. అదే సమయంలో రెండు రాష్ట్రాల్లో గిరిజన యూనివర్సిటీల ఏర్పాటుకు సూత్రపాయ అనుమతులు లభించాయి. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు
ఎక్కువగా ఉన్న పాత ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో అనువైన ప్రాంతంలో ఏర్పాటుకు నిర్ణయించారు.
మొదట ఖమ్మం జిల్లా భద్రాచలం కేంద్రంగా ప్రయత్నాలు జరిగినా.. పోలవరం ముంపు ప్రాంతాలైన
ఎనిమిది మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలుపడంతో అక్కడ సాధ్యం కాలేదు. అదే జిల్లాలోని ఇల్లందులో ఏర్పాటుకు అనుకున్నా.. అక్కడ బొగ్గు గనులు అడ్డంకిగా మారాయి. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ కేంద్రమైన
ఉట్నూర్‌లో ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగినా.. పరిస్థితులు ఆశాజనకంగా లేవని నిర్ధారించడంతో మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ నియోజకవర్గం ములుగులో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
అందుకు అనుగుణంగా ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటుకు అవకాశాలు సర్వే చేయాలని అప్పట్లో ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గతంలో
అనుకున్నట్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ములుగు మండలం జాకారంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల ఆశలపై ప్రభుత్వం పూర్తిగా నీళ్లు
చల్లినట్లయింది.
అనువైన పరిస్థితులు ఉన్నా..
ఉమ్మడి జిల్లా ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్‌లో యూనివర్సిటీ ఏర్పాటుకు అనువైన అవకాశాలు ఉన్నా.. రాజకీయ కారణాలు, ఒత్తిళ్లతోనే జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
2008లోనే ఉట్నూర్‌లో అవసరమైన ప్రభుత్వ పరంపోగు భూమిని అధికారులు గుర్తించారు. 4,95,794 గిరిజన జనాభాతో వివిధ గిరిజన తెగలకు అనువైన ప్రాంతంగా ఉందని, ఇతర సౌకర్యాల కల్పనకు
పూర్తి స్థాయిలో అవకాశాలు ఉన్నాయని నివేదికలు ప్రభుత్వాలకు పంపించినా ఫలితం లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో
విఫలం కావడంతోనే మొండి చేయి చూపిందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. తాము యూనివర్సిటీ కోసం ఎన్ని పోరాటాలు చేసినా ప్రజాప్రతినిధుల సహకారం లేకపోవడంతో యూనివర్సిటీ వేరే జిల్లాకు
తరలివెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment