సాక్షి ప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడంతో సుమారు తొమ్మిదేళ్ల్ల నిరీక్షణకు తెరపడింది. ఉమ్మడి ఏపీ విభజన సమయంలోనే.. ఏపీ, తెలంగాణలలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఏపీలోని విజయనగరం జిల్లా మర్రివలసలో 2019లోనే సెంట్రల్ ట్రైబల్ వర్సిటీని స్థాపించారు. రాష్ట్రంలో మాత్రం వర్సిటీకి స్థలం విషయంలో పేచీతో ఇన్నాళ్లూ జాప్యం జరిగింది. ఇప్పటికైనా ఈ అంశంపై స్పష్టత రావడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ ఏర్పాటయ్యే పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, గిరిజనులకు విద్యావకాశాలు పెరుగుతాయని అంటున్నారు.
ఇన్నాళ్లూ లేఖలతోనే..
గిరిజన వర్సిటీ నిర్మాణానికి 500 ఎకరాల స్థలం కావాలని, అనుకూలమైన స్థలం ఉంటే వచ్చి పరిశీలిస్తామని 2016లోనే కేంద్ర ఉన్నత విద్యామండలి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో రాష్ట్ర రెవెన్యూ, అటవీశాఖ అధికారులు ఉమ్మడి సర్వే నిర్వహించి.. ములుగు జిల్లాలోని బండాకెపల్లి శివార్లలో 335.4 ఎకరాలను సేకరించారు. 2017 ఫిబ్రవరిలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర అధికారులకు ఆ స్థలాన్ని చూపించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2018 జనవరిలో సమగ్ర నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసి కేంద్ర మానవ వనరుల శాఖకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కు అందించింది.
తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. హెచ్‌సీయూ 2019లో రాష్ట్ర ఉన్నత విద్యామండలిని సంప్రదించగా.. తాత్కాలికంగా తరగతుల ప్రారంభం కోసం ములుగు మండలంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. ఒకేచోట 500 ఎకరాల స్థలం సమకూర్చే వీలు లేకపోవడంతో ములుగు–జాకారం ప్రాంతంలోని మేడారం జాతర సమీపంలో గట్టమ్మ గుట్ట వద్ద 335 ఎకరాలను, పసర వద్ద 165 ఎకరాలను ఇస్తామని చెప్పింది.
కానీ తరగతులు ప్రారంభించడానికి కనీసం 50 ఎకరాల స్థలంలో నిర్మాణాలు ఉండాలని.. అంతేగాకుండా వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమి మొత్తాన్ని ఒకేచోట కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ అంశాలపైనే కేంద్రం–రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇన్నాళ్లూ పేచీ కొనసాగింది. అయితే ఇప్పుడు వర్సిటీని మంజూరు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించడంతో.. సదరు స్థలంలో అవసరమైన విద్యుత్, రోడ్లు, నీళ్లు వంటి మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సి ఉండనుంది.
గిరిజనులకు రిజర్వేషన్లు ఎంతశాతం?
దేశవ్యాప్తంగా గిరిజనులకు 7.5శాతం రిజర్వేషన్ అమల్లో ఉండగా.. తెలంగాణలో 10శాతంగా ఉంది. మరి గిరిజన వర్సిటీలో గిరిజనులకు ఎంత మేర రిజర్వేషన్ ఇస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. సూపర్ న్యూమరరీ విధానంలో సీట్లు పెంచి అయినా గిరిజన విద్యార్థులకే ఎక్కువ సీట్లు కేటాయించాలన్న డిమాండ్ ఉంది.
ఏపీలో ఉన్నట్టుగానే..!
ఏపీలో ఇప్పటికే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నడుస్తున్న నేపథ్యంలో.. అక్కడ అమలు చేస్తున్న కోర్సులనే ములుగు వర్సిటీలోనూ అమలు చేసే అవకాశం ఉందని యూజీసీకి చెందిన ఓ ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. సాధారణ కోర్సుల తోపాటు ప్రత్యేకంగా గిరిజన కళలు, సంస్కృతిపైనా కోర్సులను అందుబాటులోకి తీసుకురావొచ్చని పేర్కొన్నారు.
గిరిజనులకు ఎక్కువ సీట్లు ఇస్తేనే ప్రయోజనం
ఇన్నాళ్లకైనా గిరిజన వర్సిటీ ఇవ్వడం సంతోషకరం. కానీ దీనివల్ల గిరిజనులకు ఒరిగేదేమీ లేదు. గిరిజనుల పేరిట యూనివర్సిటీ పెట్టి వారికి కేవలం ఏడున్నర శాతం రిజర్వేషన్ ఇవ్వడమేంటి? అదేం గిరిజన యూనివర్సిటీ? ఇదేమిటని కేంద్రాన్ని అడిగితే యూజీసీ నిబంధనలు అంటున్నారు. అలాంటప్పుడు జనరల్ యూనివర్సిటీ పెట్టుకోండి అని చెప్పా.. గిరిజనులకు అత్యధికంగా సీట్లు ఇచ్చినప్పుడే అది గిరిజన వర్సిటీ అవుతుంది. దీనిపై కేంద్రమంత్రికి మళ్లీ లేఖరాస్తా.
– అజ్మీరా సీతారాం నాయక్, మాజీ ఎంపీ, కేయూసీ రిటైర్డు ప్రొఫెసర్
Comments
Please login to add a commentAdd a comment