శిఖం..మాయం! | some peoples are trying to khabja land of sikharam cheruvu | Sakshi
Sakshi News home page

శిఖం..మాయం!

Published Wed, Oct 22 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM

some peoples are trying to khabja land of sikharam cheruvu

చెరువు ఎఫ్‌టీఎల్ హద్దు మీద ప్రైవేటు వ్యక్తులకు పట్టాలిస్తారా? శిఖం భూమిని అధికారికంగా ఎవరికైనా ధారాదత్తం చేయొచ్చా? నిబంధనలకు విరుద్ధంగా పొందిన భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయవచ్చా?  పారిశ్రామిక నగరం పటాన్‌చెరువులో ఇవన్నీ సాధ్యమే. అధికారులను ప్రసన్నం చేసుకుంటే చాలు ఏకంగా చెరువును కూడా పట్టా పొందవచ్చు.

అందుకు తాజా ఉదాహరణ పటాన్‌చెరు మండలం బీరంగూడలోని శెట్టికుంట. అధికారికంగానే చెరువును, శిఖం భూమిని సొంతం చేసుకున్న వ్యాపారులు ఇపుడు దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారికి కట్టబెట్టారు. అనధికారిక లేఅవుట్లతో ప్లాట్లుగా చేసి అమ్మకానికి సిద్ధం చేశారు. రూ.15 నుంచి రూ .20 కోట్ల ఈ భూదందాకు రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు ప్లాన్ గీస్తే ... రియల్ ఎస్టేట్ వ్యాపారులు  పక్కాగా అమలు చేస్తున్నారు.

 
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పటాన్‌చెరు మండలం పరిధిలోని బీరంగూడలోని శెట్టికుంట చెరువు శిఖం భూమిని కొందరు వ్యక్తులు దర్జాగా కబ్జా పెట్టారు. సర్వే నంబర్ 947లోని 12.04 ఎకరాల భూమి చెరువు శిఖం కింద ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ఈ భూమి పటేల్‌గూడ గ్రామంలోని ఊబగుంట చెరువు పరిధిలో ఎఫ్‌టీఎల్( ఫుల్ ట్యాంకు లెవల్) హద్దు పరిధిలోకి వస్తుందని చిన్న నీటిపారుదల శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

ఈ చెరువు శిఖం మీద ప్రైవేటు వ్యక్తులకు పట్టాలివ్వడానికి ప్రభుత్వానికి కూడా సాధారణ అధికారులు లేవు. కానీ 1994-95 మధ్య కాలంలో 12.04 ఎకరాల చెరువు భూమిని మాజీ సైనికులకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పుడు తహ శీల్దార్‌గా పని చేసిన కిషన్‌నాయక్ ఈ తంతంగాన్ని నడిపినట్లు తెలుస్తోంది. తహశీల్దార్ చేసిన తప్పును సవరించి చెరువును కాపాడాల్సిన ఉన్నతాధికారి... ఆమ్యామ్యాలకు లొంగిపోయి తహశీల్దారుకే వత్తాసు పలికారు. అప్పట్లో ఆర్డీఓగా పని చేసిన మృత్యుంజయరావు ఏ  రెవెన్యూ అధికారి కూడా చేయలేని ధైర్యం చేసి ఏకంగా చెరువు శిఖం భూమిని అమ్ముకునే అధికారం (ఎన్‌ఓసీ) ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు.
 
అంతా మాయ
భూమి పొందిన వ్యక్తులు అప్పటి నుంచే చెరువును పూడ్చే పనులు ముమ్మరం చేశారు.  రాత్రింబవళ్లు చెరువులో మట్టి నింపి చదును చేశారు. న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు దాన్ని ఒకరి నుంచి మరొకరికి.. వారి నుంచి ఇంకొకరికి మారుస్తూ..రిజిస్ట్రేషన్లు చేయించారు. తాజాగా ఈ మొత్తం భూమిని ప్లాట్లుగా చేసి, అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చాలంటే ల్యాండ్ కన్వర్షన్ జరపాలి.

కానీ 947 సర్వే నంబర్ భూమిని ల్యాండ్ కన్వర్షన్ చేయాలని తమకు ఎలాంటి దరఖాస్తు  అందలేదనిరెవెన్యూ అధికారులు చెప్తున్నారు. కానీ అక్కడ పనులు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. జరుగుతున్న తంతు గ్రామ వీఆర్‌ఓ నుంచి తహశీల్దారు వరకు అందరికీ తెలిసినా ఎవరూ పట్టించుకోవడంలేదు. నిండు చెరువులో మట్టి పోస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ అక్రమంపై పత్రికల్లో కథనాలు వచ్చిన తర్వాత తహశీల్దారు ఓ నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ నోటీసుల ఆధారంగానే ఇపుడు వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు.
 
ఆ వెంచర్‌తో ప్రమాదం
వ్యాపారులు వెంచర్ పూర్తి చేసి ప్లాట్లుగా మార్చి కోట్ల రూపాయలు గడించవచ్చు. కానీ ఈ ప్లాట్లు కొన్న వారు మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  సర్వేనంబర్ 947 వాస్తవానికి చెరువు శిఖం భూమి అంటే ఎప్పటికీ నీటినిల్వ ఉండే ప్రాంతం. ఇప్పుడు నీరు లేకపోయినా, వర్షాలు బాగా కురిస్తే కనీసం 10 అడుగుల నీరు వచ్చే పరిస్థితి ఉంది. దాంట్లో నిర్మాణాలే జరిగితే భవిష్యత్‌లో ఎప్పుడైనా వరదలు వస్తే పూర్తిగా ఆ ప్రాంతం అంతా నీట మునగడం ఖాయం.
 
అది శిఖం భూమే
దీనిపై తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి వివరణ కోరగా సర్వే నెంబర్ 947లో 1995 కంటే ముందు ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు 12.04 ఎకరాల భూమిని కేటాయించారని,  అది పూర్తిగా  చెరువు శిఖం పరిధిలోనే ఉందన్నారు. ఆ భూమిలో ఇప్పుడు వెంచర్ వేస్తున్నట్లు తెలిసి, ఎలాంటి పనులు చేపట్టకూడదని తాము నోటీసులు ఇచ్చామన్నారు. అయితే రియల్ వ్యాపారులు  కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని వెల్లడంచారు. పంచాయతీరాజ్ శాఖ ఈఓ పీఆర్ డీ దేవదాస్‌ను వివరణ కోర గా బీరంగూడలోని సర్వే నంబర్ 947లో వెంచ ర్ కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement