
హైదరాబాద్: జంట నగరాల తాగునీటి కోసం నిర్మించిన హిమాయత్ సాగర్ నుంచి తరలించి మరో చోట ఏర్పాటు చేసిన గ్రామమే కొత్వాల్‌గూడ. సాగర్ పక్కనే ఉన్న ఈ గ్రామస్తులు దశాబ్దాలుగా వారి స్థలాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా పైసీస్ సంస్థ ఏకంగా ఊరంతా తాకట్టు పెట్టి రుణాలు పొందిందన్న వార్త ఇప్పుడు గ్రామస్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొత్వాల్‌గూడకు సంబంధించిన కొన్ని సర్వే నంబర్ల భూమి కాస్తా ఎనిమీ ప్రాపర్టీ (స్వాతంత్ర సమయంలో ఇక్కడి భూమిని వదిలి ఇతర దేశాలకు వెళ్లిన వారి ఆస్తులు) కింద ఉండడంతో ఇక్కడ ఫాం 1బీ సర్టిఫికెట్లను కూడా గ్రామస్తులు పొందలేకపోయారు..
ఇప్పుడు ఇలా...
కొత్వాల్‌గూడ సర్వే నంబర్ 1 నుంచి 170 వరకు ఉన్న భూములను గోవా కేంద్రంగా పనిచేస్తున్న పైసీస్ సంస్థ.. పీఈసీ (ప్రాజెక్ట్ అండ్ ఎక్విప్‌మెంట్ కార్పొరేషన్) వద్ద తాకట్టు పెట్టి రూ.332 కోట్ల రుణం పొందినట్లు తాజాగా అధికారులకు సమాచారం అందింది. అయితే రెవెన్యూ రికార్డులో మాత్రం ఎక్కడా పైసీస్‌కు సంబంధించిన పేర్లు లేవు. భూమి పొజిషన్‌లో కూడా వీరు లేరని ఇప్పటికే అధికారులు నివేదించినట్లు సమాచారం. ఊరంతా తాకట్టు పెట్టి రుణం పొందారనే సమాచారం వెలుగులోకి రావడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ భూమిని శివభూషణ్‌కి రిజిస్ట్రేషన్ చేసిన హసన్ కూడా 1965లో మరణించినట్లు గ్రామస్తులు తెలియజేస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ 1977లో జరిగేందుకు అవకాశమే లేదంటున్నారు.
రెవెన్యూ రికార్డుల్లో పేర్లు లేవు..
భూమిని తాకట్టు పెట్టిన వారి పేర్లు రెవెన్యూ రికార్డుల్లో లేవు. భూమి పొజిషన్‌లో కూడా లేరు. భూముల పట్టాలన్నీ గ్రామస్తుల పేర్ల మీదనే ఉన్నాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖ ఆధారంగా విచారణ చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తాం.
– సురేశ్‌కుమార్, తహసీల్దార్
ప్రభుత్వం విచారణ చేపట్టాలి
వందేళ్లుగా ఉంటున్న గ్రామాన్ని ఏదో కంపెనీ ఎలా తాకట్టు పెడుతుంది. ఇది చాలా దారుణం. ప్రభుత్వం విచారణ చేపట్టాలి. ఇప్పటికే గ్రామంలో కొన్ని సర్వే నంబర్లలోని భూమిని ఎనిమి ప్రాపర్టీ అంటూ ఫాం 1బీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. సాగు తప్ప వేరే ఆధారం లేని ప్రజలు ఇక్కడ ఉన్నారు.
– గుర్రంపల్లి ప్రసన్న లింగం, సర్పంచ్, కొత్వాల్‌గూడ
ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలి
ఇక్కడి ప్రజలు వ్యవసాయం, చేపల విక్రయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. బోగస్ కంపెనీ మా ఊరి భూమిని ఎలా తాకట్టు పెడుతుంది. రెండు నెలల కిందట ఓ వ్యక్తి ఇక్కడ భూములన్నీ తనఖాలో ఉన్నాయని గ్రామంలో తిరిగి పరిశీలించాడు. బోగస్ సంస్థపై చర్యలు తీసుకోవాలి.
–గుంటి మిట్టు, రైతు, కొత్వాల్‌గూడ
Comments
Please login to add a commentAdd a comment