సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/మెదక్ జోన్: భూవివాదాలను పరిష్కరించి భవిష్యత్ తరాలు ఇబ్బంది పడకుండా చూసేందుకే ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేపట్టిందని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలకు ఈ ప్రక్షాళనతో పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రైతులకు ఇది సదావకాశమని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం నాగసాలలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తి కావడంతో సోమవారం గవర్నర్ ఆ గ్రామాన్ని సందర్శించారు.
తర్వాత మెదక్ జిల్లాలోని పాషాపూర్ గ్రామంలో జరిగిన ప్రక్షాళన కార్యక్రమాన్ని పరిశీలించారు. రెండుచోట్ల ప్రజలతో ముఖాముఖీ మాట్లాడారు. నాగసాలలో గ్రామ నక్షను పరిశీలించారు. గ్రామంలో జనాభా, వారి పేరిట ఉన్న భూముల వివరాలు, సర్వే నంబర్లు తదితర సమాచారానికి సంబంధించిన ప్రత్యేక నోటీసులను పరి శీలించారు. గ్రామస్తులతో 20 నిమిషాల పాటు మాట్లాడి సర్వే ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లా డుతూ.. ప్రక్షాళన తర్వాత రైతులందరికీ అధికారులు ఈ–పాస్ పుస్తకాలు అందజేస్తా రన్నారు. అధికారులకు గ్రామస్తులు సహకరించాలని, రికార్డుల్లో తప్పులు దొర్లితే బ్యాంకులు రుణాలివ్వవని పేర్కొన్నారు.
నాగసాలలో గ్రామస్తులతో గవర్నర్ మాటామంతీ..
గవర్నర్: ఏమ్మా మీకు ఎంత భూమి ఉంది? ఏమైనా సమస్యలున్నాయా?
కుమ్మరి లలితమ్మ: సారూ.. మా తాతకు మాన్యం కింద ఇచ్చిన 1.5 ఎకరాల పొలం ఉంది. ఆయన చనిపోయిండు. భూమి మాత్రం ఆయన పేరిటే ఉంది. పరిష్కారం కాలేదు. 5 మందిమి ఉన్నం. ఎవరి పేర్ల మీద ఎక్కించలేదు.
గవర్నర్: చూడండమ్మా.. మీరు 5 మంది ఉన్నరు. ఫస్టు మీ కుటుంబ సభ్యులందరూ కలసి మాట్లాడుకోండి. ఎవరెవరికి ఎంత మేర పంపకాలు జరగాలో చర్చించుకోండి. తర్వాత రెవెన్యూ అధికారులకు దరఖాస్తు పెట్టుకుంటే వాటిని అమలు చేస్తారు.
గవర్నర్: ఏమ్మా.. మీకు భూమి ఉందా?
పద్మమ్మ: సారూ.. 10 నెలల కింద ఊళ్ల ఊషన్నకు చెందిన భూమి కొన్న. పాసు పుస్తకాలు ఇస్తలేరు. లక్షల రూపాయలు పోసి కొన్నం. మిత్తిలు పెరుగుతున్నయి.
గవర్నర్: ఎందుకు ఏమైనా సమస్య ఉందా?
పద్మమ్మ: ఏమో సారు మా ఆయన పేరు మీద 6 ఎకరాలు, కోడలు పేరు మీద 2 ఎకరాలు, కొడుకు పేరు మీద 18 గుంటల భూమి కొన్నం. రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది. సర్కారోళ్లు బుక్కులు ఇస్తలేరు.
గవర్నర్: వీఆర్‌ఓ గారూ.. ఏం సమస్య.. వీళ్లకు ఎందుకు బుక్కులు రావడం లేదు?
వీఆర్‌ఓ: సార్.. వీళ్లు కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్‌లోఉన్న భూమి, పొజిషన్ ఉన్న దానికి క్లారిటీ లేదు. దానిపై మాకు దరఖాస్తు ఇచ్చారు. పరిష్కారం చేసి బుక్కులు అందజేస్తాం.
పూరిగుడిసెల్లోకి వెళ్లి..
పాషాపూర్‌లో భూ ప్రక్షాళన కార్యక్రమం అనంతరం గవర్నర్ గ్రామంలో పర్యటించారు. నవనీత–ఏసు, పోచయ్య, రాజులకు చెందిన పూరిగుడిసెల్లోకి వెళ్లి వారి బాగోగులు తెలుసుకున్నారు. గుడిసెల్లో ఎంతకాలం ఉంటున్నారని, పక్కా ఇళ్లు ఎందుకు కట్టుకోలేదని వారిని ప్రశ్నించారు. దీంతో వారు మాట్లాడుతూ చాలా కాలంగా పూరిపాకలోనే ఉంటున్నామని, రాత్రి వేళలో విషపురుగులతో భయంగా ఉందని, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన గవర్నర్ గ్రామంలోని మరికొన్ని ఇళ్లను కలియ తిరుగుతూ మరుగుదొడ్లు నిర్మించుకున్న వారిని అభినందించారు.