ఉద్యోగులకూ ‘రాజ్‌భవన్’ రాజసం
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్... గవర్నర్ అధికారిక నివాసం.. రాజసం ఉట్టిపడే చారిత్రక భవనం. అందులో పనిచేసే ఉద్యోగుల ఆవాసం కూడా మంచి దర్పంగా ఉండాలని ఇటీవల గవర్నర్ నరసింహన్ భావించారు. అలాగే వారి పిల్లల కోసం ఆధునాతన పాఠశాల భవనం కూడా ఆ నివాసాల ప్రాంగణంలోనే ఉండాలని తలచారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పుడు దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో రాజ్‌భవన్ వెనకవైపు ఐదంతస్తులతో కూడిన నివాస భవన సముదాయాలు, ఆధునిక పాఠశాల భవనం నిర్మాణానికి రంగం సిద్ధమైంది. బుధవారం నరసింహన్, కేసీఆర్‌లు ఆ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం వెనకవైపు ఉన్న పాత క్వార్టర్లు, పాత బడి భవనాలను ఇప్పటికే తొలగించారు. క్వార్టర్లతో కూడిన భవన సముదాయాల్లో కిందిస్థాయి ఉద్యోగులకు 140 ఇళ్లు, అధికారులకు 25 ఇళ్లు, ఉన్నతస్థాయి అధికారులకు 20 ఇళ్లు ఉంటాయి. వాటి పక్కన 500 మంది విద్యార్థుల సామర్థ్యంతో రెండంతస్తుల పాఠశాల భవనం, 500 మంది సామర్థ్యంతో కమ్యూనిటీ హాలు భవనం నిర్మిస్తారు. సెక్యూరిటీ సిబ్బంది కోసం ఓ బ్యారెక్ కూడా నిర్మించనున్నారు.
టెండర్లలో ఉన్నతాధికారిపై వేటు
రాజ్‌భవన్‌కు సంబంధించిన పనుల్లో కూడా రోడ్లు భవనాల శాఖ అధికారుల తీరు మారలేదు. అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లకు పనులు దక్కేలా చక్రం తిప్పే పద్ధతిని ఇక్కడా పాటించినట్టు ప్రభుత్వం అనుమానించి ఇటీవల ఓ ఉన్నతాధికారిపై వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పనులకు సంబంధించి గతంలోనే రోడ్లు భవనాల శాఖ టెండర్లు పిలిచింది. ఇందులో 9 మంది కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. కానీ ఒకే కాంట్రాక్టర్ అర్హత పొందేలా టెండర్‌లో అంశాలను పొందుపర్చినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించి విచారణ జరిపించారు.
ఓ కాంట్రాక్టరుకు అనుకూలంగా ఉండేందుకే ఇలా చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై సీఎం సీరియస్ అయ్యారు. ఆ వెంటనే భవనాల విభాగం చీఫ్ ఇంజనీర్ సెలవులో వెళ్లిపోయారు. ప్రభుత్వ ఆదేశంతోనే ఆయన సెలవులో వెళ్లినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటీవలే ఆ అధికారి తిరిగి విధుల్లో చేరినా... ఆయనకు రోడ్ల బాధ్యత అప్పగించి భవనాల విభాగం బాధ్యతను కేటాయించలేదు. ఆ తర్వాత పాత టెండర్లు రద్దు చేసి, కొత్త నిబంధనలతో మళ్లీ టెండర్లు పిలిచారు. ఇటీవలే వాటిని తెరిచి తక్కువ కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు అప్పగించారు.