చైర్మన్ పదవులు శాశ్వతంగా ఎస్టీలకే
- షెడ్యూల్డ్ ప్రాంత మున్సిపాలిటీల ఎన్నికలకు సర్కార్ కసరత్తు
- 50 శాతం వార్డు స్థానాలు సైతం
సాక్షి, హైదరాబాద్ : షెడ్యూల్డ్ ప్రాంత మున్సిపాలిటీలైన ఆదిలాబాద్ జిల్లా మందమర్రి, ఖమ్మం జిల్లా మణుగూరు, పాల్వంచ మునిసిపల్ చైర్మన్ పదవులు శాశ్వతంగా గిరిజనులకు రిజర్వు కానున్నాయి. ఈ మున్సిపాలిటీల్లోని 50 శాతం వార్డులూ గిరిజనులకే దక్కనున్నాయి. రాజ్యాంగపరమైన అడ్డంకులను అధిగమించి షెడ్యూల్డ్ ప్రాంత మున్సిపాలిటీల్లో ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల చట్టానికి సవరణ చేయాలని నిర్ణయించింది. రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాలకు మునిసిపల్ చట్టాలు, మున్సిపల్ ఎన్నికల నిబంధనలు వర్తించవు.
రాజ్యాంగ సవరణ అంశంై కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. దీంతో తెలంగాణలోని షెడ్యూల్డ్ మున్సిపాలిటీలు మందమర్రి, మణుగూరు, పాల్వంచలకు ఎన్నికలు జరగలేదు. అవి ప్రత్యేకాధికారుల పాలనలో మగ్గుతున్నాయి. ఒడిశాలోని షెడ్యూల్డ్ ప్రాంత మున్సిపాలిటీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌లో కల్పించిన ప్రత్యేక వెసులుబాటును వినియోగించి నాలుగేళ్ల కిందట ఎన్నికలను నిర్వహించింది. ఈ నిబంధనల ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పరిపాలన, నియంత్రణ అంశాల్లో గవర్నర్‌కు విశేషాధికారాలున్నాయి. ఒడిశా తరహాలోనే రాష్ట్రంలోని షెడ్యూల్డ్ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది.
ఈ మేరకు ప్రకటన జారీ చేయాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు ప్రతిపాదనలు పంపింది. షెడ్యూల్ 5 ఆధారంగా ఈ 3 మున్సిపాలిటీలకు రాష్ట్ర మున్సిపల్ చట్టాన్ని వర్తింపజేస్తూ ఎన్నికల నోటిఫికేషన్‌ను స్వయంగా గవర్నర్ జారీ చేయనున్నారు. పై మూడు మున్సిపాలిటీల్లో గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో అక్కడ ఎన్నికల కోసం ప్రత్యేక రిజర్వేషన్ల పద్ధతిని ప్రభుత్వం అమలు చేయనుంది. గిరిజనులకే శాశ్వతంగా చైర్మన్ పదవితోపాటు 50 శాతం వార్డు స్థానాలనూ రిజర్వు చేయనుంది. ఎస్సీలకు జనాభా దామాషా ప్రకారం, బీసీలకు మొత్తం సీట్లలో మూడో వంతు వార్డులను కేటాయించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపాలిటీల చట్టాన్ని సవరించేం దుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.