‘వెబ్‌ల్యాండ్’ మోసాలెన్నో!
‘వెబ్‌ల్యాండ్’ మోసాలెన్నో!
Published Fri, Aug 19 2016 10:24 PM | Last Updated on Mon, Oct 1 2018 2:28 PM
రైతుసంఘాల నాయకులు ఆందోళన
భూములపై హక్కులు కోల్పోయే అవకాశం
మంగళగిరి: వెబ్ లాండ్ అక్రమార్కులకు వరంలా మారే అవకాశం ఉందని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అటు అసలైన భూ యజమానులతో పాటు ఇటు ప్రభుత్వ భూములూ అక్రమార్కుల పరమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సర్వేకు రాని భూముల వివరాలు తెలుసుకొని వాటిలో తమ పేర్లు నమోదుచేయించుకునేందుకు అక్రమార్కులకు అవకాశం కల్పించినట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలుంటే తప్పా బ్యాంకర్లు రైతులకు రుణాలివ్వరని చెప్పారు. ఈ విధానం కొందరు రెవెన్యూ అధికారులకూ అక్షయపాత్ర మాదిరిగా ఉంటుందని తెలిపారు.
రూ. లక్ష ముట్టజెప్పి రికార్డుల్లో నమోదు...
ఉదాహరణకు ఓ రైతు మండలంలోని ఓగ్రామంలో తమ భూమిని సర్యే నిర్వహించి రికార్డులలో నమోదు చేయాలని దరఖాస్తు చేశారు. భూమిని సర్యే చేసిన సర్యేయర్ ఎకరం పదిహేను సెంట్లు వుందని దానిని రైతుపేర రికార్డులలో పొందుపరచవచ్చని ధ్రువీకరించగా వీఆర్వో ఎకరం ఐదు సెంట్లు మాత్రమే నమోదు చేశారు. సెంటు లక్షలు పలుకుతుండడంతో వీఆర్వో కావాలనే పక్క రైతు వద్ద డబ్బులు తీసుకుని తనను మోసం చేశారని భావించిన రైతు మరలా వీర్వోను సంప్రదించగా మరో సారి దరఖాస్తు చేసుకోవాలని అప్పుడు మారుస్తానని చెప్పారు. అలా ఎందుకు నమోదు చే శారో చెప్పాలని రైతు ఆగ్రహం వ్యక్తం చేయగా మరలానైనా నమోదు చేయాల్సింది నేనే సెంటుకు పది వేలు ఇవ్వాలని లేదంటనే కుదరదని ఒక వేళ పై అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ పది సెంట్లు కాలువ భూమి అని రాస్తానని రైతును బెదిరించడం విశేషం. గత్యంతరం లేక రైతు రూ.లక్ష ముట్ట చెప్పి మరలా దరఖాస్తు చేసుకుని రికార్డులలో నమోదు చేయించుకోవాల్సిన దుస్థితి వచ్చింది.
హక్కులు కోల్పోయే ప్రమాదం..
వెబ్‌లాండ్ విధానం కారణంగా రైతులు తమ భూములపై పూర్తిగా హక్కులు కోల్పోయే ప్రమాదముంది. అంతేకాక అక్రమార్కులు అధికారులతో కుమ్మక్కైతే ప్రభుత్వ, ప్రైవేటు భూములను కొట్టేసేందుకు సులువైన మార్గంగా వెబ్‌లాండ్ తయారైంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు మానుకుని రైతులకు భూములపై పూర్తి హక్కులుండేలా పాసు పుస్తకాల విధానాన్ని కొనసాగించాలి. తక్షణమే వెబ్‌లాండ్ విధానం రద్దు చేయాలి.
– సింహాద్రి లక్ష్మారెడ్డి, రైతు సంఘం నాయకులు
Advertisement
Advertisement