రైతు సంక్షేమం కోసమే వెబ్‌ల్యాండ్‌ | webland programme in anantapur | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమం కోసమే వెబ్‌ల్యాండ్‌

Published Tue, Aug 23 2016 11:06 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

రైతు సంక్షేమం కోసమే వెబ్‌ల్యాండ్‌ - Sakshi

రైతు సంక్షేమం కోసమే వెబ్‌ల్యాండ్‌

–  రెవెన్యూ రికార్డుల సరళీకరణతో బోగస్‌ పట్టా పుస్తకాల ఏరివేత సాధ్యం
–  రైతు చెంతకు కీలకమైన 1–బి రికార్డు
–  మీ– భూమి పోర్టల్‌ ద్వారా భూమి వివరాలు
–  వెబ్‌ల్యాండ్‌పై ‘సాక్షి’ అవగాహన సదస్సులో ఇన్‌చార్జి కలెక్టర్‌ బి.లక్ష్మికాంతం


అనంతపురం అర్బన్‌/ అనంతపురం : రెవెన్యూ రికార్డుల సరళీకరణ ప్రక్రియలో భాగంగా ఏర్పాటైన వెబ్‌ల్యాండ్‌ ద్వారా బోగస్‌ పట్టాదారు పాసు పుస్తకాల ఏరివేత సాధ్యమైందని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ లక్ష్మికాంతం అన్నారు. అనంతపురం రూరల్‌ మండలం ఇటుకలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఎడిషన్‌ ఇన్‌చార్జ్‌ తోలేటి మహేశ్వరరెడ్డి అధ్యక్షతన మంగళవారం వెబ్‌ల్యాండ్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సరళీకృత విధానం వల్ల రెవెన్యూ రికార్డుల్లో అత్యంత కీలకమైన 1–బి కోసం అధికారుల చుట్టూ రైతులు తిరిగే అవసరం లేదని, మీ–సేవ ద్వారా నేరుగా పొందే అవకాశముందని తెలిపారు. మీ–భూమి పోర్టర్‌ ద్వారా ఎవరైనా ఎక్కడి నుంచైనా తమ భూమి వివరాలను స్వయంగా తెలుసుకోవచ్చని అన్నారు.


జిల్లాలో 7.71 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు ఉండగా వీటిలో 99 శాతం ఆధార్‌ అనుసంధానం ప్రక్రియ పూర్తి అయిందన్నారు. వెబ్‌ల్యాండ్‌లోని వివరాలను ఎవరుపడితే వారు మార్పు చేయడానికి అవకాశం ఉండదని, దీనికి సంబంధించిన డిజిటల్‌ కీ ఆర్డీవో వద్దనే ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని సూచించారు. ముఖ్యంగా భూమి నిరంతం క్రయ విక్రయాలు, భాగ పరిష్కారాలు, వారసత్వం ద్వారా మార్పు చెందుతుంటుందన్నారు. ఈ క్రమంలో చేర్పులు మార్పులకు అధికారుల చుట్టు తిరిగే సమస్య లేకుండా ఆటో మ్యూటేషన్‌ ప్రక్రియని కూడా త్వరలో చేపట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో మలోల, తహశీల్దార్‌ శ్రీనివాసులు, సాక్షి బ్యూరో ఇన్‌చార్జ్‌ రవివర్మ, గ్రామ సర్పంచ్‌ పెద్దిరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శులు కేశవరెడ్డి, యూపీ నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఒలిపిరెడ్డి శివారెడ్డి, దస్తగిరి రెడ్డి, రైతు సంఘం నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, రామాంజి, రైతులు పాల్గొన్నారు.

బ్యాంక్‌ సమస్య పరిష్కారం  (సపరేట్‌గా హైలెట్‌ కావాలి)
ప్రస్తుతం తామంతా అనంతపురంలోని గుత్తిరోడ్డులో ఉన్న ఆంధ్రాబ్యాంక్‌ ద్వారా పంట రుణాలు పొందేవారమని, అయితే అధికారులు సహకరించకుండా ఇబ్బందులకు గురిచేస్తుండడంతో తమ గ్రామానికి కందుకూరులోని సిండికేట్‌ బ్యాంక్‌ను దత్త బ్యాంక్‌గా చేయాలంటూ ఇన్‌చార్జి కలెక్టర్‌ను  రైతు సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ రైతులు కోరారు. దీనిపై స్పందించిన ఆయన తక్షణం లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌తో మాట్లాడి, సమస్యకు పరిష్కారం చూపారు. ఈ మేరకు రైతులందరూ ఎల్‌డీఎంకు అర్జీ ఇస్తే దత్త బ్యాంక్‌గా సిండికేట్‌ బ్యాంక్‌ను చేసేందుకు ఎల్‌డీఎం అంగీకరించినట్లు తెలిపారు.  
––––––––––––––
పొరపాట్లు సరిదిద్దాలి
వెబ్‌ల్యాండ్‌లోని పొరపాట్లను వందశాతం సరిదిద్దాలి. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి భూములకు సంబంధించి సబ్‌ డివిజన్‌ సర్వే చేసి భూ రికార్డులను రూపొందించాలి. వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలను తెలుసుకునే విషయంపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి.
– పి.పెద్దిరెడ్డి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
––––––––––––––
రైతులకు ఇబ్బంది కలుగరాదు
వెబ్‌ల్యాండ్‌లో కొందరు రైతుల వివరాలు తప్పుగా నమోదయ్యాయి. దీంతో వారంతా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాటన్నింటినీ సరిచేయడంతో పాటు వెబ్‌ల్యాండ్‌పై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి.
– వెంకట చౌదరి, వైఎస్‌ఆర్‌సీసీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు
–––––––––––––
అవగాహన కల్పించాలి
తగిన సమయం తీసుకుని రైతులకు వెబ్‌ల్యాండ్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. లాభాలను తెలియజేయాలి. అటు తరువాత పట్టాదారు పాసు పుస్తకాలను తొలగించినా ఇబ్బంది ఉండదు.
– సి.మల్లికార్జున, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు

సదస్సు బాగా ఉపయోగపడింది
వెబ్‌ల్యాండ్‌ సమస్యలపై సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు చాలా ఉపయోగపడింది. ఇన్‌చార్జి కలెక్టర్‌ లక్ష్మీకాంతం మంచి విషయాలు తెలిపారు. చదువురాని వారికి కూడా బాగా అర్థమైంది. ఇలాంటి సదస్సులు మరిన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
– వెంకటరెడ్డి రైతు, ఇటుకలపల్లి

–––––––––––––––
సందేహాలు... నివృత్తి
అక్కులప్ప, ఎంపీటీసీ : శివాయిజామి భూముల విషయంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి వాటిని విక్రయించుకునే అవకాశం కల్పించాలి. వెబ్‌ల్యాండ్‌పై రైతుల్లో ఉన్న అపోహలను, సందేహాలను నివృత్తి చేయాలి.
ఆర్‌డీఓ : శివాయిజామి భూముల వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రైతులకు వెబ్‌ల్యాండ్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు, అపోహలు తొలగించేందుకు చర్యలు చేపడతాం.
వనజ, మహిళా రైతు : మాకు కందుకూరు పొలం సర్వే 447లో 5.14 ఎకరాల భూమి ఉంది. 1–బిలో రెండున్నర ఎకరాలు ఉన్నట్లు చూపుతున్నారు.  మీ సేవ ద్వారా అర్జీ పెట్టుకున్నా పరిష్కారం కాలేదు.
ఆర్‌డీఓ : మీ సేవ రసీదు నకలు ఒకటి మాకు ఇవ్వండి. పొరపాటు ఎక్కడ జరిగిందో గుర్తించి రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం.
వెంకటరాముడు, బాలబొజ్జప్ప, అక్కులప్ప, శ్రీరాములు : దేవాదుల కాలువ, శ్మశానానికి  కేటాయించిన భూమికి పట్టాలిచ్చారు. దీంతో సమస్యగా మారింది. ఎవరూ పట్టించుకోవడం లేదు.
తహశీల్దార్‌ శ్రీనివాసులు  :  దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.
రెడ్డెప్ప, నల్లమాడ : నా భూమిలో వేరేవారికి అక్రమంగా పట్టాలిచ్చారు. తహశీల్దార్‌కు ఎన్నిమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు.
ఆర్‌డీఓ : ఆర్డీఓకుS లేదా జాయింట్‌ కలెక్టర్‌కుS అప్పీలు చేస్తూ పిటీషన్‌ దాఖలు చేసుకోవాలి. పట్టా వివరాలు సమగ్రంగా తెలిపాలి. సమస్య పరిష్కారం అవుతుంది.
పెద్దన్న, ఇటుకలపల్లి : పాసు బుక్కుల రద్దు నిర్ణయం సరికాదు. రైతుకు తన భూమికి సంబంధించిన ఆధారం అది ఒక్కటే. అదీ లేకపోతే ఇబ్బంది పడతారు.
ఆర్డీఓ : 1–బి రికార్డు అసలైన ఆధారం. దీనినే నేరుగా రైతులకు అందజేస్తున్నాం. అలాంటప్పుడు పాసుబుక్కు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన  అవసరం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement