భూమి వదలకపోతే అంతు చూస్తా! | CI Threats To Sakshi Reporter In Anantapur | Sakshi
Sakshi News home page

భూమి వదలకపోతే అంతు చూస్తా!

Published Fri, Jul 13 2018 9:13 AM | Last Updated on Mon, Aug 20 2018 8:24 PM

CI Threats To Sakshi Reporter In Anantapur

ఆందోళన చేస్తున్న నాయకులను బెదిరిస్తున్న సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్‌

రాప్తాడు నియోజకవర్గంలో రాజ్యహింస పెరిగిపోయింది. మంత్రి పరిటాల సునీత ప్రమేయంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతోంది. తాజాగా తనకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలతో బలమైన వార్తలు రాసిన సాక్షి విలేకరిని ఆర్థికంగా దెబ్బతీసే ఎత్తుగడలకు మంత్రి ఊతమిచ్చారు. వంశపారంపర్యంగా వస్తున్న భూమిని టీడీపీ కార్యకర్తల పరం చేసేందుకు పావులు కదిపారు. వివాదం కాస్త కోర్టుకు చేరుకుంది. అయినా పట్టు విడవకుండా పోలీసులను ప్రభావితం చేస్తూ బెదిరింపులకు దిగారు. భూమి వదులుకోకపోతే అంతు చూస్తామంటూ సాక్షాత్తూ సీఐ స్థాయి అధికారి ద్వారా బెదిరించడమే కాక భౌతిక దాడికి ఉసిగొల్పారు.

అనంతపురం సెంట్రల్‌ : రాప్తాడు నియోజకవర్గంలో తొలి నుంచి అధికారపార్టీకి వత్తాసు పలుకుతూ, ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు పోతున్న ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథయాదవ్‌ వ్యవహారం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల కందుకూరులో వైఎస్సార్‌ సీపీ కార్యకర్త శివారెడ్డి హత్య కేసులో కూడా ఆయనపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఆయన అండ చూసుకునే టీడీపీ నేతలు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అప్పట్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా కోర్టులో వివాదంలో ఉన్న భూ సమస్యలోకి తలదూర్చి టీడీపీ నేతలకు బలవంతంగా ఆ భూమిని ఇప్పించేందుకు దుప్పటి పంచాయితీ చేస్తూ మరోవివాదానికి తెరలేపారు. గురువారం ఏకంగా బాధితుడిపై దాడికి బరితెగించారు.

40 సంవత్సరాలుగా సాగులో..
మండల కేంద్రం రాప్తాడులో సర్వే ‘612–1బి’లో ఉన్న ఐదు ఎకరాల పొలం స్థానిక సాక్షి విలేకరి కొండప్ప పేరుపై ఉంది. 40 సంవత్సరాలుగా ఆ భూమిని కొండప్ప కుటుంబసభ్యులే సాగు చేస్తూ వస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలతో పాటు రెవెన్యూ రికార్డుల్లో కూడా కొండప్ప సాగులో ఉన్నట్లు ఉంది. 44వ జాతీయ రహదారి పక్కనే ఈ భూమి రూ. కోట్లు విలువ చేస్తోంది. ఈ భూమిపై కన్నేసిన టీడీపీ నేతలు ఎలాగైనా దానిని కబ్జా చేసేందుకు పావులు కదుపుతూ వచ్చారు. మంత్రి సునీత అండతో కొన్నేళ్లుగా ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చారు.

సీఐ దుప్పటి పంచాయితీ
తమకు వ్యతిరేకంగా వార్తలు రాశాడన్న అక్కసుతో కొండప్పను ఆర్థికంగా దెబ్బతీయడం ద్వారా లొంగదీసుకోవాలని టీడీపీ నాయకులు పథకం వేశారు. ఇందులో భాగంగానే అతని భూమిని టీడీపీ నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న కొండప్ప కబ్జాను అడ్డుకున్నాడు. హైకోర్టును ఆశ్రయించి, భూమిపై అన్ని విధాలుగా హక్కులను సాధించారు. దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు సీఐని ప్రభావితం చేసి దుప్పటి పంచాయితీలతో ముప్పుతిప్పలు పెడుతూ వచ్చారు.

భూమిపై హక్కులు వదులుకో..
గురువారం ఉదయం రాప్తాడు పోలీస్‌స్టేషన్‌కు కొండప్పను సీఐ రప్పించుకున్నారు. ‘కోర్టుకెళ్లి ఎన్ని స్టేలు తెచ్చుకున్నా.. నీ భూమి నీకు దక్కదు. నేను చెప్పినట్లు విని రెండు ఎకరాలు వారికి ఇచ్చేసి సమస్య పరిష్కరించుకో’ అంటూ హుకుం జారీ చేశారు. దీనిపై కొండప్ప ససేమిరా అన్నారు. ‘సార్‌.. 40 ఏళ్లుగా ఆ భూమిలో మేమే సాగులో ఉన్నాం. మా నాన్న 30 ఏళ్లు సాగు చేశారు. ఆయన మరణానంతరం నాకు సంక్రమించిన ఆస్తి అది. నేను వదులుకోలేను. భూ రికార్డులు పరిశీలించి  న్యాయం చేయండి’ అంటూ కొండప్ప అభ్యర్థించారు. దీంతో సీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొండప్ప కాలర్‌ పట్టుకుని నాకే ఎదురు చెబుతావా.. నేను చెప్పినట్లు నీవు విని తీరాల్సిందే లేకుంటే పరిస్థితులు మరోలా ఉంటాయి అంటూ దుర్భాషలకు దిగారు. ఈ అంశాన్ని తన కెమెరాలో బంధించేందుకు కొండప్ప ప్రయత్నించగా ఆవేశంతో ఊగిపోతు దాడికి పాల్పడ్డారు.

వైఎస్సార్‌ సీపీ,ప్రజాసంఘాల ఆందోళన
రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీకి సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్‌ తొత్తుగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ, ప్రజసంఘాల నాయకులు ఆరోపించారు. విలేకరి కొండప్పపై దాడిని ఖండిసూత గురువారం రాప్తాడు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగారాప్తాడు జెడ్పీటీసీ సభ్యుడు వెన్నపూస రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. భూ పంచాయితీలు చేసే అధికారం సీఐకి ఎవరిచ్చారని ప్రశ్నించారు.  వెంటనే సీఐని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దాదాపు గంటపాటు ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న అనంతపురం డీఎస్పీ వెంకట్రావ్‌ అక్కడకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. బాధితుడికి న్యాయం చేస్తామంటూ హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ బోయ రామాంజనేయులు, యూత్‌ కన్వీనర్‌ చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి సాకే నారాయణ, సర్పంచ్‌ గాండ్లపర్తి మోహన్‌రెడ్డి, నాయకులు యర్రగుంట కేశవరెడ్డి, దండు రామాంజనేయులు, కొత్తపల్లి నారాయణస్వామి, పసుపుల బాబయ్య, కుమ్మరరాము, సీపీఐ నాయకులు రామకృష్ణ, నాగరాజు, సీపీఎం నాయకులు పోతులయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, రామాంజనేయులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement