అదే తీరు.. విత్తన బేజారు
ప్రత్యామ్నాయ విత్తనం తెప్పించడంలో అధికారుల విఫలం
రెండోరోజూ కూడా బారులు తీరిన రైతులు
అనంతపురం అగ్రికల్చర్: ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలంటూ అటు అధికారులు, ఇటు ప్రభుత్వం ప్రచారం హోరెత్తిస్తున్నా...అందుకు అవసరమైన విత్తనాలను మాత్రం అందుబాటులో ఉంచడం లేదు. సోమవారం నుంచే ప్రత్యామ్నాయ విత్తన పంపిణీ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైనప్పటికీ చాలా మండలాల్లో విత్తన కొరత వేధిస్తోంది. దీంతో రెండోరోజూ రైతులు విత్తన పంపిణీ కేంద్రాల ఎదుట బారులు తీరారు. తొలిరోజు చాలా మండలాలకు విత్తనాలు సరఫరా కాకపోవడంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు. రెండోరోజు కూడా 10 నుంచి 12 మండలాలకు విత్తనం చేరలేదని తెలుస్తోంది. మిగతా మండలాల్లో అలసంద, ఉలవ, పెసలు, జొన్నలు, కొర్రలు పంపిణీ చేశారు. అయితే ఒక్క మండలంలో కూడా అన్ని రకాల విత్తనాలు అందుబాటులో లేవని చెబుతున్నారు. రెండు మూడు రకాల విత్తనాలు ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మండలాల్లో రైతులు విత్తనాల కోసం ఎగబడుతున్నారు.
వ్యవసాయ కార్యాలయాల వద్ద పడిగాపులు
బయోమెట్రిక్ పద్ధతిలో విత్తన పంపిణీ కొనసాగుతుండగా...రైతులంతా ఉదయం 7 గంటలకే విత్తన పంపిణీ కౌంటర్ల వద్దకు చేరుకుని క్యూలో నిలబడుతున్నారు. అనంతపురం రూరల్ మండలానికి సంబంధించి స్థానిక డీసీఎంఎస్ వద్ద విత్తన కౌంటర్ ఏర్పాటు చేయగా... మంగళవారం వందలాది మంది రైతులు, మహిళలు విత్తనాల కోసం బారులుతీరి కనిపించారు. జిల్లాకు కేటాయించిన 1.12 లక్షల క్వింటాళ్లలో ప్రస్తుతం 12 వేల క్వింటాళ్ల విత్తనాలు నిల్వ ఉన్నట్లు చెబుతున్నారు. తొలిరోజు సర్వర్ సమస్య ఉత్పన్నకాకపోయినా... రెండో రోజు గంటపాటు మొరాయించడంతో అటు వ్యవసాయాధికారులు...ఇటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు అవసరం లేకున్నా ప్రత్యామ్నాయ విత్తనాలు తీసుకెళితే ఇన్‌పుట్‌సబ్సిడీ లాంటి ప్రయోజనాలు వర్తించవని ప్రచారం జరుగుతుండటంతో రైతుల్లో అయోమయం నెలకొంది.