- ‘కార్పొరేట్ విద్య’ పథకానికి 2,300 మంది దరఖాస్తు
- కళాశాలలు పునఃప్రారంభమై 24 రోజులైనా భర్తీ కాని సీట్లు
- ఎదురుచూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
- ఆన్‌లైన్‌లో కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
ధర్మవరం పట్టణానికి చెందిన సుధాకర్ పదో తరగతిలో 8.8 పాయింట్లు సాధించాడు. మే 25న ఉచిత కార్పొరేట్ విద్య పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇప్పటిదాకా ఏ విషయమూ తెలియలేదు. కళాశాలలు ఈ నెల ఒకటి నుంచే ప్రారంభమయ్యాయి. సుధాకర్ మాత్రం ఇంకా ఏ కళాశాలలోనూ చేరలేదు. పోనీ కార్పొరేట్ విద్యా పథకం కింద సీటు కచ్చితంగా వస్తుందా అంటే ఆ విషయం చెప్పేవారే కరువయ్యారు. సొంతంగా కార్పొరేట్ కళాశాలలో చదివే స్తోమత లేదు. దీంతో సుధాకర్‌తో పాటు తల్లిదండ్రులు మదనపడుతున్నారు. సుధాకర్ ఒక్కడే కాదు.. జిల్లా వ్యాప్తంగా 2,300 మందికి పైగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులది ఇదే పరిస్థితి.
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలో ఉచిత కార్పొరేట్ విద్యా పథకం అమలుపై ఈసారి నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పథకం ద్వారా పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ విద్యార్థులను కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో (రెసిడెన్షియల్ వసతితో) ఉచితంగా చదివిస్తారు. ఈ పథకానికే 2009లో అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీధర్ ‘అనంత ఆణిముత్యాలు’గా నామకరణం చేశారు. కులాలు, పాఠశాలల ఆధారంగా రిజర్వేషన్ కల్పించారు. 2013–14 విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రవేశపెట్టారు. ఈ ఏడాది జూనియర్ కళాశాలలు పునఃప్రారంభమై నేటికి 24 రోజులవుతోంది. నేటికీ దరఖాస్తులు తీసుకుంటున్నారు తప్ప ఎప్పుడు భర్తీ చేస్తారన్నది అధికారులకే స్పష్టత లేదు. ముందుగా మే 18 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు. అయితే.. 25 వరకు వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు. దీంతో దరఖాస్తు గడువు ఈ నెల 19 వరకు పెంచారు. గడువు ముగిసినప్పటికీ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతూనే ఉంది. ఇక సీట్ల భర్తీ ప్రక్రియ ఎప్పుడు చేపడతారోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
రిజర్వేషన్లు ఇలా...
ప్రభుత్వ వసతి గృహాలు, కేజీబీవీల్లో చదివిన విద్యార్థులకు 50 శాతం, ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 25 శాతం, ఏపీఎస్‌డబ్ల్యూ స్కూళ్లు, నవోదయలో చదివిన విద్యార్థులకు 20 శాతం, బీఏఎస్ స్కూళ్లలో చదివిన విద్యార్థులకు 5 శాతం సీట్లను కేటాయిస్తారు. బాలికలకు 141 సీట్లు, బాలురకు 91 సీట్లు కేటాయించారు.
వేచి ఉండలేక...వేరే కళాశాలల్లో చేరలేక..
దాదాపు నిరుపేద విద్యార్థులే ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా 2,325 మంది దరఖాస్తు చేశారు. ఒకవైపు కళాశాలలు ప్రారంభమై తరగతులు జరుగుతుంటే.. మరోవైపు తమకు సీటు వస్తుందో, రాదో తెలియక దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. పోనీ వేరే కళాశాలల్లో చేరేద్దామంటే ఆర్థికభారం. అలాగని వేచిచూద్దామంటే ఎంపిక ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి. కొందరైతే వీటిని నమ్ముకోలేక ప్రభుత్వ, ఇతర కళాశాలల్లో చేరేశారు.
సమాచారం లేదు –రోశన్న, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు
మా చేతుల్లో ఏమీ లేదు. రాష్ట్ర అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయం. ఇక్కడి విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. నేటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగుతోంది. ఎప్పటిలోగా భర్తీ చేస్తారనే సమాచారం మాకు లేదు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సమాచారం అందిస్తాం.
ఇంకెన్నడు?!
Published Fri, Jun 23 2017 11:40 PM | Last Updated on Fri, Oct 5 2018 6:40 PM
Advertisement
Advertisement