ఖర్మాస్పత్రులు
- సర్కార్ ఆస్పత్రుల్లో రోగులకు నరకం
- వైద్యులు కనిపించరు...సిబ్బంది ఉండరు
- సాయంత్రమైతే చాలా ఆస్పత్రులు ఖాళీ
24 గంటలూ పనిచేయాల్సిన ఆస్పత్రుల్లోనూ అరకొర సౌకర్యాలు
అనంతపురం ఆస్పత్రిలో కుక్కల స్వైరవిహారం...వార్డుల్లో ఎలుకల సంచారం
- సాక్షి విజిట్‌లో కనిపించిన సిత్రాలు
‘నాకు 7 నెలలు. కడుపులో గడ్డ ఉంది, బీపీ పెరిగింది. గుత్తి ఆస్పత్రికి వెళితే అనంతపురం పెద్దాస్పత్రికి వెళ్లాలన్నారు. ఇక్కడికి వస్తే ఉదయం రాపో...అంటున్నారు. అడ్మిట్ చేసుకోండంటే బెడ్లు లేవంటున్నారు. ఇపుడు 11 గంటలైంది. ఈ చలిలో ఎక్కడ ఉండాలి.’
- అనంతపురం సర్వజనాస్పత్రికి వచ్చిన గుత్తికి చెందిన మల్లీశ్వరి ఆవేదన ఇది
సర్కారు వైద్యం దైవాదీనంగా మారింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం రోగులపాలిట శాపంగా మారింది. 24 గంటలూ పనిచేయాల్సిన ఆస్పత్రులు కూడా సాయంత్రం ఆరింటికే మూతపడుతున్నాయి. కొన్నిచోట్ల ఆస్పత్రి తీసి ఉంచినా సిబ్బంది కనిపించడం లేదు. అత్యవసర సమయంలో అటెండర్లు, స్వీపర్లే వైద్యుల అవతారమెత్తుతున్నారు. తమకొచ్చిన వైద్యంతో రోగులకు నరకం చూపుతున్నారు. చాలా ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలోనూ రోగుల బాధలు వర్ణించేందుకు వీలు కావడం లేద. కిక్కిరిపోయిన కాన్పుల వార్డుల్లో ఒక్కే బెడ్‌పై ఇద్దరు, ముగ్గురిని ఉంచి వైద్యం చేస్తున్న తీరు వైద్యఆరోగ్య శాఖ డొల్ల తనానికి పరాకాష్టగా నిలిచింది. శనివారం రాత్రి 8 నుంచి సాక్షి బృందం జిల్లాలోని 42 పీహెచ్‌సీలను పరిశీలించగా...దాదాపు అన్నిచోట్ల సిబ్బంది విధులకు డుమ్మాకొట్టడఽం కనిపించింది.
- సాక్షిప్రతినిధి, అనంతపురం
పేదలు ప్రాణం మీదకు వస్తే పేదలంతా ప్రభుత్వ ఆస్పత్రులకే పరుగు తీస్తారు. కానీ అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం వారికి నరకం చూపుతోంది. మందులుంటే సిబ్బంది ఉండరు..సిబ్బంది ఉంటే మందులు దొరకరు. అన్నీ ఉంటే అసౌకర్యాల కొరత..ఇలా పేదోడికి బతుకుండగానే నరకం చూపుతున్నారు. 24 గంటలూ పనిచేయాల్సిన ఆస్పత్రుల్లోనూ వైద్యులు, సిబ్బంది సాయంత్రమే ఇంటిబాట పడుతుండడంతో అర్ధరాత్రి వేళ అత్యవసరమై దవాఖానకు వచ్చే వారికి తిప్పలు తప్పడం లేదు.
- అనంతపురం సర్వజనాస్పత్రి రాత్రి 9.45 గంటల సమయంలో ఆరుబయట రోగుల బంధువులు నిద్రపోతుండగా... వారి మధ్యలో కుక్కలు తిరుగుతున్నాయి. వారిలో నిండుగర్భిణీలు...పండు ముసలివారూ ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమను ఉదయం వస్తేనే చూస్తామని నర్సులు చెప్పారనీ, అందువల్లే అంతదూరం వెళ్లి రాలేక ఆస్పత్రిలో ఆవరణలో నిద్రకు ఉపక్రమించినట్లు తెలిపారు.
ఒకే బెడ్డుపై ఇద్దరు...ముగ్గురు
అనంతపురం ఆస్పత్రిలోని కాన్సుల వార్డులో ఒక బెడ్డుపై ఇద్దరు ఉన్నారు. నెలలు నిండి, నొప్పులతో బాధపడుతున్న గర్భిణీలు వార్డుబయల వాకిట్లో కూర్చున్నారు. కొందరు కిందనే నిద్రపోయారు. ఇదేంటని నర్సులను ప్రశ్నిస్తే...‘బెడ్లు లేవు... రోజూ ఇంతే’ అన్న సమాధానం వినిపించింది. కాన్సుల వార్డును పరిశీలిస్తే అనంతపురం ఆస్పత్రి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
- రాత్రి 11.30 గంటల సమయంలో ఆర్థోపెడిక్‌వార్డులోని ఓ బెడ్డు వద్ద రోగి బంధువులు ప్రార్థనలు చేస్తున్నారు. కూడేరు మండలం ముద్దలాపురానికి చెందిన అశోక్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఎమర్జెన్సీ నుంచి ఆర్థోపెడిక్‌వార్డుకు రెఫర్ చేశారు. గంటల తరబడి వేచి ఉన్నా నర్సులు పట్టించుకోలేదు.
- మొత్తమ్మీద ఈ ఆస్పత్రి పేరుకు 500 పడకల ఆస్పత్రి. కానీ సౌకర్యాల కల్పన మాత్రం దారుణంగా ఉన్నాయి. ఐపీలో(ఇన్‌పేషెంట్స్)రోజూ 800–900మంది దాకా ఉంటున్నారు. దీనికి అనుగుణంగా ఆస్పత్రి స్థాయిని పెంచాల్సి ఉంది. లేదంటే రోగులకు రోజూ నరకమే!
24 గంటల ఆస్పత్రులు మరీ దారుణం
జిల్లాలో 24 గంటలూ పనిచేయాల్సిన ఆస్పత్రుల్లోనూ సిబ్బంది, వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. కుందుర్పి ఆస్పత్రిలో 8.45 గంటలకు డాక్టరుతో పాటు సిబ్బంది కూడా ఇంటిబాట పట్టడంతో ఆస్పత్రి ఖాళీగా కనిపించింది. డాక్టర్లు ఆన్ కాల్ డ్యూటీ ద్వారా హాజరవుతారనుకున్నా... సిబ్బంది కూడా ఆయన బాటే పట్టారు. ఉరవకొండ ఆస్పత్రిలో కేవలం ఇద్దరు నర్సులు మినహా ఎవ్వరూ లేరు. కదిరి ఏరియా ఆస్పత్రిలో డ్యూటీ డాక్టరు లేరు. ఓ కాంపౌండర్, స్టాఫ్‌నర్సు మాత్రమే ఉన్నారు. దోమల బెదడ తీవ్రంగా ఉండటంతో రోగులు బెడ్లవద్ద మస్కిటో కాయిల్స్ ఏర్పాటు చేసుకున్నారు. మంత్రి పరిటాల సునీత నియోజకవర్గంలోని కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, ఆత్మకూరు పీహెచ్‌సీల్లోనూ వైద్యులు జాడ కనిపించలేదు.
కేవలం నర్సులు మాత్రమే ఉన్నారు. ఆత్మకూరులో అయితే నర్సులూ కనిపించలేదు. కనగానపల్లి పీహెచ్‌సీలో లైట్లు కాలిపోవడంతో రోగులు అంధకారంలో అల్లాడిపోయారు. శెట్టూరులో నర్సులంతా సాయంత్రం కాగానే ఇంటిదారిపట్టారు. ఆరా తీస్తే ఇళ్లవద్ద ఉంటూ ఏవైనా కేసులు వస్తేనే ఆస్పత్రికి వస్తారని తెలుస్తోంది. కేసులు వచ్చే సంగతి వారికి ఎవరు చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఇక ధర్మవరం ఆస్పత్రిలో భువనేశ్వరి అనే స్టాఫ్ నర్సు మినహా ఎవ్వరూ కనిపించలేదు. రాయదుర్గంలో డాక్టర్ 8.30కు వచ్చి వెళ్లారు. నర్సులు మాత్రమే ఉన్నారు. గుంతకల్లులో రోగులు బెడ్‌షీట్లు లేకపోవడంతో ఇళ్లవద్ద నుంచి తెచ్చుకున్నారు. ఇలా మొత్తం జిల్లాలోని 42 ఆస్పత్రులను ‘సాక్షి’ పరిశీలించగా ఏ ఒక్క ఆస్పత్రిలోనూ రాత్రి వేళ రోగులకు మెరుగైన వైద్యం అందినట్లు కనిపించలేదు.