అన్నీ తప్పులే
– తప్పులు తడకగా వెబ్‌ల్యాండ్
– కంప్యూటీకరణలో తప్పుగా నమోదు చేసిన సిబ్బంది
– సరిచేసేందుకు డబ్బుల డిమాండ్
– పట్టించుకోని ఉన్నతాధికారులు
– ఇబ్బందుల్లో అన్నదాతలు
రైతు కొమ్మెర సుబ్బరాయుడుకి తలుపుల మండలం నూతన కాలువ పరిధిలో నాలుగు సర్వే నెంబర్లలో 2 ఎకరాల పొలం ఉంది. పట్టాదారు పాసు పుస్తకం నెంబరు ఏటీపీ 622384. పట్టా నెంబరు 574. సర్వే నెంబరు 18 లో 20 సెంట్లు ఉంది. 2010లో 1–బి తీసుకున్నప్పుడు భూమి విస్తీర్ణం సక్రమంగానే ఉంది. ఈ ఏడాది ఆగస్టు 17న మీ సేవలో 1–బి తీసుకుంటే సర్వే నెంబరు 18లో అతనికి ఐదు సెంట్లు మాత్రమే ఉన్నట్లు నమోదయ్యింది.
–––––––––
రైతు కోటకొండ రామప్పనాయుడుకి తలుపుల మండలం నూతన కాలువ పరిధిలో నాలుగు సర్వే నెంబర్లలో 4.44 ఎకరాల భూమి ఉంది. 2015, జూన్ 3న మీ సేవలో 1–బి తీసుకుంటే విస్తీర్ణం సక్రమంగానే ఉంది. తరువాత ఆగస్టు 17న మీ సేవలో 1–బి తీసుకుంటే సర్వే నెంబరు 483లో 39 సెంట్లు, సర్వే నెంబరు 389లో 72 సెంట్ల భూమి నమోదు కాలేదు.
వీరిద్దరిలాగే 1–బిలో తప్పుల తడకగా భూములు నమోదు కావడంతో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తప్పుల్ని సరిచేయించుకునేందుకు అగచాట్లు పడుతున్నారు
అనంతపురం అర్బన్ : రైతుల భూములకు సంబంధించి 1–బి అత్యంత కీలకమైన ఆధారం. ఇలాంటి కీలక ఆధారానికి సంబంధించి వెబ్‌ల్యాండ్ తప్పుల తడకగా తయారైంది. కంప్యూటీకరణ చేసే క్రమంలో తప్పుగా నమోదు చేశారు. ఈ విషయంలో దిగువ స్థాయి రెవెన్యూ సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. తప్పులు సరిజేసే విషయంలో ముడుపుల దందాకు శ్రీకారం చుట్టడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. పైకి మాత్రం వెబ్‌ల్యాండ్ పక్కా ఉందంటూ అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు.
ముడుపుల దందా
జిల్లాలోని 7.60 లక్షల ఖాతాలు ఉన్నాయి. వీటికి సంబంధించి భూ విస్తీర్ణాన్ని వెబ్‌ల్యాండ్‌లో సక్రమంగా నమోదు చేయాలేదు. కొందరి 1–బిలో అదనంగా చేరిస్తే, మరికొందరి 1–బిలో ఉన్న భూమిని తొలగించారు. 1–బిలో వివరాలను సరిచేసేందుకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వని వారిని పదేపదే తిప్పుకోవడం, గట్టిగా అడిగితే మీ ఇష్టమొచ్చినచోట చొప్పుకో అంటూ దురుసుగా సమాధానం ఇస్తున్నట్లు పలువురు వాపోతున్నారు.
ఇబ్బంది పెడతున్నారు
మా నాన్న కొమ్మెర సుబ్బరాయుడుకి సంబంధించి సర్వే నెంబర్ 18లో 20 సెంట్ల స్థలం ఉంటే కేవలం 5 సెంట్లు ఉన్నట్లు 1–బిలో చూపించారు. పట్టాదారు పాసు పుస్తకం తీసుకెళ్లి చూపించినా సరిచేయడం లేదు. ఇదేమని నిలదీస్తే దిక్కున్న చోట చొప్పుకో అంటూ దురుసుగా సమాధానమిస్తున్నారు.
– కె.రమణ, తలుపుల