రైతుల రుణానికి ‘వెబ్‌ల్యాండ్’ కళ్లెం
వ్యవసాయ రుణాల కట్టడికి కొత్త పోర్టల్
ఇకపై బ్యాంకులో రుణం తీసుకోగానే ‘వెబ్ ల్యాండ్’లో నమోదు
మరో బ్యాంకు రుణం ఇవ్వకుండా ప్రభుత్వ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే రుణ విముక్తి పేరుతో రైతులకు వ్యవసాయ రుణాలు పుట్టకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మరోలా వారిపై ఉక్కుపాదం మోపనుంది. ఒక సర్వే నంబర్‌పై రెండు బ్యాంకుల్లో రుణం పొందకుండా కట్టడి చేసే చర్యలు చేపట్టింది. సాధారణంగా స్థానిక రైతులతో ఉన్న సంబంధాలతో బ్యాంకులు వ్యవసాయ రుణాలు మంజూరు చేస్తాయి. అలాగే రైతులు కూడా తమ అవసరాల రీత్యా ఒక సర్వే నంబర్‌పై ఒకట్రెండు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. ఇప్పుడు ఇలా రెండేసి రుణాలు తీసుకోకుండా వెబ్ ల్యాండ్ పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగిస్తోంది.
రాష్ట్రంలోని రైతుల భూములకు సంబంధించిన సర్వే నంబర్లు, పంటల సాగు వివరాలను వెబ్ ల్యాండ్ పోర్టల్‌లో నమోదు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ పరీక్షించే దశలో ఉంది. ఇకపై ప్రతీ ఖరీఫ్, రబీ సీజన్‌లో వెబ్ ల్యాండ్ పోర్టల్‌ను అప్‌డేట్ చేస్తూ ఉంటారు. వ్యవసాయ రుణం కోసం రైతుల బ్యాంకులకు వెళితే ఆయా రైతుల సర్వే నంబర్, భూమి, పంటల వివరాలను వెబ్‌ల్యాండ్ పోర్టల్లో పరిశీలిస్తారు. ఏ బ్యాంకులోను ఆ సీజన్‌లో ఆ సర్వే నెంబర్‌లోని భూమిపై రుణం తీసుకోకపోతేనే సదరు బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. రుణం మంజూరు చేయగానే ఆ సర్వే నెంబర్‌పై రుణం ఇచ్చినట్లు ఆన్‌లైన్‌లో బ్యాంకు చార్జి చేస్తుంది. ఫలితంగా ఆ సర్వే నంబర్‌పై మరో బ్యాంకు రుణం ఇవ్వదు.
ప్రస్తుతం రైతులు సర్వే నంబర్ ఆధారంగా పంట రుణం పొందటంతో పాటు ఆ రుణం సరిపోకపోతే బంగారం కుదవపెట్టి అదే సర్వే నెంబర్‌పై అవసరమైన పంట రుణం తీసుకుంటున్నారు. బ్యాంకులు కూడా బంగారం ఉంది కదా అనే భరోసాతో రైతులకు పంట రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఇక నుంచి అటువంటి రుణాలు కూడా రైతులకు మంజూరు కావు. ఎందుకంటే ఆ సర్వే నెంబర్‌పై రుణం మంజూరు చేసినట్లు ఆ పోర్టల్లో ఉంటుంది. అసలే మాఫీతో ఇబ్బందులు పడుతున్న రైతులు భవిష్యత్‌లో బంగారం కుదవపెట్టి పంట రుణాలు తీసుకోకుండా రైతులను చార్జి పేరుతో కట్టడి చేస్తోంది.
వెబ్‌ల్యాండ్‌పై సీఎస్ సమీక్ష
వెబ్‌ల్యాండ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డులను సమీకృతం చేయడం, ప్రభుత్వ భూములు వ్యవహారాలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సోమవారం సచివాలయంలో సమీక్షించారు. భూమిపై హక్కు కలిగిన వ్యక్తి దానిని ఎవరికైనా విక్రయించినా, ఆ వ్యక్తి చనిపోయినా తప్పకుండా మ్యుటేషన్ చేయించాలని నిర్ణయించారు. మ్యుటేషన్‌కు వీఆర్‌వోను బాధ్యుడిని చేయనున్నట్టు తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలు సంబంధిత వ్యక్తికి వారంలోగా ఎమ్మార్వో సంతకంతో చేరాలని, ఈ అంశంపై వారు క్రమం తప్పకుండా సమీక్షించాలని సీఎస్ ఆదేశించారు.