అడుతూ పాడుతూ తిరుగుతున్న బిడ్డ ఉన్నట్టుండి కుప్పకూలిపోతే.. గాయం, వ్యాధి, ఆరోగ్య సమస్యలేవీ లేకున్నా కళ్లు మూస్తే? ఆ విషాదాన్ని వర్ణించడం కష్టం. తల్లిదండ్రులు ఎవరైనా ఆ నష్టాన్ని దిగమింగుకోలేరు కూడా. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇలాంటి ఘటనలు కొన్ని చోటు చేసుకుంటూండటం. సౌత్ ఇంగ్లాండ్‌లోని బాన్‌బరీలో ఇటీవలే 13 ఏళ్ల బాలుడు ఒకరు ఇలా ఆకస్మికంగా కుప్పకూలిపోయాడు. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఎందుకిలా జరుగుతుంది? కారణాలేమిటి? నివారించే అవకాశం ఏదైనా ఉందా? ఊహూ... ప్రస్తుతానికి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నో అనే చెప్పాలి.
సడన్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ డెత్ ఇన్ ఛైల్డ్‌హుడ్ (ఎస్‌యూడీసీ) అని పిలుస్తారు దీన్ని. పుట్టిన బిడ్డ మొదలుకొని 18 ఏళ్ల వయసు వారి వరకూ ఎవరికైనా ఎదురు కావచ్చు ఇలాంటి దుర్మరణం. బాన్‌బరీలో జరిగిన ఘటననే ఉదాహరణగా తీసుకుంటే...13 ఏళ్ల మాథ్యూ కౌలీ ముందురోజు రాత్రి... స్నేహితులతో వీడియో గేమ్ ఆడుకుని హాయిగా నిద్రపోయాడు. అలాగే శాశ్వతనిద్రలోకి జారుకున్నాడు. ఈ ఆకస్మిక మరణం అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. వైద్య పరీక్షల్లో, పోస్ట్‌మార్టంలోనూ మరణానికి కారణమేమిటన్నది స్పష్టం కాలేదు.
ఎస్‌యూడీసీ అంటే...
వైద్యుల అభిప్రాయం ప్రకారం, సడన్ అన్ ఎక్స్‌ప్లెయిన్డ్ డెత్ ఇన్ చైల్డ్ హుడ్ (SUDC) అంటారు. అకారణంగా ఆరోగ్యకరమైన పిల్లవాడు ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడం. 2021 నాటి లెక్కల ప్రకారం ఒక్క అమెరికాలోనే దాదాపు 450 మంది ఎస్‌యూడీసీ బారిన పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగానూ ఏటా 40 - 50 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. న్యూయార్క్ యూనివర్శిటీ గ్రాస్‌మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లోని వైద్యులు రిచర్డ్ ట్సీన్, ఓరిన్ డెవిన్స్కీ నేతృత్వంలో ఎస్‌యూడీసీకి కారణాలు తెలుసుకునేందుకు ఒక పరిశోధన జరిగింది కానీ ఫలితాలు మాత్రం అంత ఆశాజనకంగా ఏమీ లేవు. సుమారు 124 మంది ఎస్‌యూడీసీ బాధితుల శరీరాల నుంచి వారి తల్లిదండ్రుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో అనూహ్యంగా జరిగిన జన్యుపరమైన మార్పులు (ఉత్పరివర్తనాలు ఇంగ్లీషులో మ్యూటేషన్స్)లను గుర్తించారు. బాధితుల డీఎన్‌ఏలోని జన్యుపరమైన మార్పులు తల్లిదండ్రుల నుంచి సంక్రమించినవి కాకపోవడం గమనార్హం. ఇలా తల్లిదండ్రుల నుంచి కాకుండా స్వతంత్రంగా జరిగే జన్యుమార్పులను డీనోవో ఉత్పరివర్తనాలని పిలుస్తారు.
డీనోవో ఉత్పరివర్తనాల విషయం ఇలా ఉంటే తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జన్యు ఉత్పరివర్తనాల్లో 80 శాతం పిల్లలకూ సంక్రమించాయి. మొత్తం జన్యుమార్పుల్లో 11 ఉత్పరివర్తనాలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ మార్పులు వందలో తొమ్మిది మంది మరణానికి కారణం కావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాల్షియం సిగ్నలింగ్‌లో మార్పు SUDCలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని జన్యుపరమైన ప్రమాద కారకాలను పెంచుతుందని పరిశోధనల ఫలితాలు సూచిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment