ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రిజిస్ట్రేషన్ చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ విద్యా ధరణి
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం అరిశేపల్లి గ్రామానికి చెందిన నంద్యాల తేజస్ ఒక ఎకరం పొలాన్ని కొనుగోలు చేశారు. బందరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో ఆయన పేరు నమోదైంది. ఒకే రోజు రిజిస్ట్రేషన్‌తో పాటు ఆటోమెటిక్‌గా మ్యుటేషన్ కూడా జరిగిపోయింది.
సరళంగా ప్రక్రియ
ఆస్తి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరిట మారాలంటే కొద్ది రోజుల క్రితం వరకు పెద్ద ప్రహసనమే. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగినా మ్యుటేషన్ జరగక కొనుగోలుదారులు అవస్థలు పడాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతో ప్రవేశపెట్టిన విధానాలు, రెవెన్యూ సంస్కరణల ఫలితంగా ఇప్పుడు చాలా తేలిగ్గా ఆటో మ్యుటేషన్ జరిగిపోతోంది. వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ వెళుతున్నాయి.
రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటోమేటిక్‌గా వెబ్‌ల్యాండ్‌లో యాజమాన్య హక్కుల బదలాయింపు జరుగుతోంది. ఎక్కడికి తిరగాల్సిన పనిలేకుండా ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న కార్డ్ ప్రైమ్ రిజిస్ట్రేషన్ల విధానంలో మ్యుటేషన్ ప్రక్రియ అత్యంత సరళంగా ముగుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రిజిస్ట్రేషన్లు, ఆటో మ్యుటేషన్ల తీరును ‘సాక్షి’ ప్రతినిధి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పూర్తయ్యేదాకా ఉత్కంఠే!
స్థిరాస్థుల క్రయవిక్రయాలు జరిగిన తర్వాత వాటిని తమ పేరు మీదకు మార్చుకోవడం ఇన్నాళ్లూ క్లిష్టతరంగా ఉండేది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ మ్యుటేషన్ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవడం, ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టడంతో కొనుగోలుదారులకు కునుకు పట్టేది కాదు. ఆస్తిని రిజిష్టర్ చేసేది రిజిస్ట్రేషన్ శాఖ అయితే దాన్ని రెవెన్యూ రికార్డుల్లో అప్‌డేట్ చేసేది రెవెన్యూ శాఖ.
రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, ఏళ్ల తరబడి అదే విధానం కొనసాగడంతో రిజిస్ట్రేషన్ పూర్తయినా మ్యుటేషన్ కోసం నిరీక్షణ తప్పని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో రిజిస్టర్ అయిన ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తడంతో మ్యుటేషన్ జరిగేది కాదు. అవతవకలకు ఆస్కారం ఉండేది. సంక్లిష్టంగా ఉన్న మ్యుటేషన్ల విధానాన్ని సీఎం జగన్ ప్రభుత్వం సరళంగా మార్చింది. ఎంతోకాలం నుంచి కాగితాలకే పరిమితమైన ఆటో మ్యుటేషన్ ప్రతిపాదనను వాస్తవ రూపంలోకి తెచ్చి ప్రజల అవస్థలను తొలగించింది.
రిజిస్ట్రేషన్ల శాఖకు వెబ్‌ల్యాండ్ అనుసంధానం
నూతన విధానంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్‌వేర్‌ను, రెవెన్యూ శాఖ వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేశారు. దానికి ముందు రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్‌వేర్ కార్డ్ స్థానంలో కార్డ్ ప్రైమ్‌ను ప్రవేశపెట్టారు. ఆటో మ్యుటేషన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనే డాక్యుమెంట్ తయారు చేసుకోవడం, సర్వే నెంబర్ ఎంటర్ చేయగానే మార్కెట్ విలువ కనిపించడం, అందుకు తగ్గట్టుగా ఆన్‌లైన్‌లోనే చలానాలు కట్టడం, అనంతరం రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవడం కార్డ్ ప్రైమ్ విధానంలో కొత్తగా అందుబాటులోకి వచ్చాయి.
నిర్దేశించిన స్లాట్ ప్రకారం రిజిస్టార్ ఆఫీసు లేదంటే గ్రామ, వార్డు సచివాలయానికి వెళితే అక్కడ కొత్త విధానంలో వెంటనే రిజిస్ట్రేషన్‌తోపాటు ఆ వివరాల ప్రకారం ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ జరిగిపోతోంది. మళ్లీ మ్యుటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవడం, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే అన్నింటినీ పక్కాగా నిర్థారిస్తారు. సబ్ రిజి్రస్టార్లు రెవెన్యూ రికార్డులను పూర్తిగా పరిశీలించి రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. రిజిస్ట్రేషన్ జరగగానే రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్య హక్కు దానంతట అదే మారిపోతుంది.
త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మూడు నెలల క్రితం నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త విధానంలోనే రిజిస్ట్రేషన్లతోపాటు ఆటో మ్యుటేషన్లు జరుగుతున్నాయి. కొత్త విధానం వచ్చాక 26 జిల్లాల్లో ఇప్పటివరకు 7 వేలకుపైగా ఆటో మ్యుటేషన్లు జరిగాయి.
వ్యవసాయ భూములకు సంబంధించి అమలవుతున్న ఆటో మ్యుటేషన్ విధానాన్ని త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నగరాలు, పట్టణాల్లో ఆస్తుల రికార్డులు మున్సిపల్ శాఖ నిర్వహిస్తుండడంతో రిజిస్ట్రేషన్ల శాఖ అందుబాటులోకి తెచ్చిన కార్డ్ ప్రైమ్ సాఫ్ట్‌వేర్‌ను దానికి అనుసంధానించాల్సి ఉంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ అందుకు సిద్ధమవగా మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది.
సులభతరం
రిజిస్ట్రేషన్ సేవలతోపాటు మ్యుటేషన్ విధానాన్ని సులభతరం చేశాం. కార్డ్ ప్రైమ్ విధానంలో ఆటో మ్యుటేషన్ వెంటనే జరిగిపోతోంది. ఇందుకోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల సాఫ్ట్‌వేర్‌లను పూర్తిగా మార్చాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములకు ఆటో మ్యుటేషన్లు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో అర్బన్ ఆస్తులకూ ఇదే విధానాన్ని తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. రిజిస్ట్రేషన్ల విధానం, ఆటో మ్యుటేషన్ చాలా బాగా అమలవుతోంది. దుష్ప్రచారాలను నమ్మవద్దు.
– వి రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
వెంటనే ఆన్‌లైన్‌లో..
మా గ్రామ సమీపంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశా. నందిగామ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అరగంటలోనే పూర్తయింది. ఆ తర్వాత వెంటనే నా పేరు మీద ఆన్‌లైన్‌లో కూడా మారింది. ఇంతకుముందు ఆన్‌లైన్‌లో పేరు చేర్చాలంటే రిజిస్ట్రేషన్ పత్రాలతో ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు వెంటనే మ్యుటేషన్ జరగడం బాగుంది.
– నల్లపోతుల నాగరాజు, నందిగామ మండలం, రాఘవాపురం
తిరిగే తిప్పలు లేవు..
నా పేరుతో ఉన్న 33 సెంట్ల భూమిని నా కుమార్తె వెంకటేశ్వరమ్మ పేరిట రాశాను. రిజిస్ట్రేషన్ జరిగిన రోజే ఆమె పేరిట భూమి మారిపోయింది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన బాధ లేకుండా వెంటనే పని పూర్తయింది.
– చల్లా ఆంజనేయులు, కొండూరు, నందిగామ మండలం.
Comments
Please login to add a commentAdd a comment