Waqf Board Lands Are Gradually Turning Into Real Estate Ventures - Sakshi
Sakshi News home page

రూ. 260 కోట్ల వక్ఫ్‌ భూమికి ఎసరు! రైతుల పేరిట చక్రం తిప్పిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ 

May 8 2023 1:32 AM | Updated on May 8 2023 3:01 PM

Waqf Board lands are gradually turning into real estate ventures - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వక్ఫ్‌బోర్డు భూములు దర్జాగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారిపోతున్నాయి. రెవెన్యూ శాఖ (ధరణి)తో పాటు స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ల శాఖ నిషేధిత జాబితాలో పొందుపర్చిన భూములకు కనీస పరిశీలన లేకుండానే లేఅవుట్‌ అవుట్‌ పర్మిషన్లు జారీ అవుతుండగా, ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ యథేచ్ఛగా కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్‌ శివారులో ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకుని ఉన్న కొంగర కుర్దు–ఏలో ఈ విధంగా ఓ భారీ రియల్‌ వెంచర్‌ వెలుగుచూసింది. సుమారు రూ.260 కోట్ల విలువైన 52.25 ఎకరాల వక్ఫ్‌ భూములకు సంబంధించి హైకోర్టులో వివాదం కొనసాగుతుండటం గమనార్హం. ఇంత జరుగుతున్నా వక్ఫ్‌ బోర్డు ప్రేక్షక పాత్ర పోషించడం అనుమానాలకు తావిస్తోంది. 

ఇదీ కథ..: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగరకుర్దు–ఏలో సర్వే నంబర్‌ 2 నుంచి 400 వరకు దర్గా సయ్యద్‌ శారాజ్‌ ఖత్తాల్‌ హుస్సేనీ ఖిబ్లా పేరిట సుమారు 500 ఎకరాలకు పైగా వక్ఫ్‌ భూమి ఉంది. 1954 నుంచి ఇప్పటివరకు పహాణీల్లో పట్టాదారు కాలంలో దర్గా పేరే నమోదై ఉంది. 2007లో వక్ఫ్‌బోర్డు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా ఆ భూమిని సాగు చేసుకుంటున్న రైతులందరితో పాటు సర్వే నంబర్‌ 86, 87, 88, 89లోని సుమారు 52.25 ఎకరాల భూమి సాగు చేసే చెట్కూరి వంశీయులు కూడా గెజిట్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టేటస్‌ కో ఆర్డర్‌ జారీ చేయడంతో అప్పటి నుంచి కేసు పెండింగ్‌లోనే ఉంది.

ప్రభుత్వ రెవెన్యూ రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ నిషేధిత జాబితాలో సైతం ఆయా సర్వే నంబర్ల వివరాలు పొందుపర్చారు. ఫలితంగా భూముల రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోయాయి. పహాణీ, ధరణిలో కబ్జాదారుడు (పీటీ)ల కాలమ్‌లో చెట్కూరి కుటుంబ వంశీయుల పేర్లు, పట్టాదారుల కాలమ్‌లో దర్గా సయ్యద్‌ శారాజ్‌ ఖత్తాల్‌ హుస్సేనీ ఖిబ్లా పేరు కొనసాగుతూ వస్తోంది. కాగా 2010లో రోడ్డు కోసం సేకరించిన భూమికి గాను ప్రభుత్వం చెట్కూరి కుటుంబాలకు పరిహారం అవార్డు ప్రకటించింది. అయితే కోర్టు వివాదం కారణంగా తుది తీర్పును బట్టి పరిహారం చెల్లింపు వర్తించే విధంగా నిబంధన చేర్చింది. 

సందట్లో సడేమియా..  
హైకోర్టులో వివాదం కొనసాగుతుండగానే ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థ రంగ ప్రవేశం చేసింది. గ్రామంలో లేని ఇద్దరు రైతుల పేరిట సుమారు 52.25 ఎకరాలకు సంబంధించి పాత తేదీలతో తప్పుడు పత్రాలు çసృష్టించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక రైతు పేరిట సర్వే నంబర్‌ 86, 87లోని 24.15 ఎకరాలు, మరొకరి పేరిట సర్వే నంబర్‌ 88, 89లోని 28.10 ఎకరాలకు సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించారు. అప్పటి తూర్పు డివిజన్‌ (గోషామహల్‌) రెవెన్యూ అధికారి జారీ చేసినట్లుగా.. ఓఆర్‌సీ (ఆక్యుపెన్సీ రైట్స్‌ సర్టిఫికెట్‌) ప్రొసీడింగ్, తప్పుడు పట్టాదారు పాస్‌ బుక్, టైటిల్‌ నంబర్, ఖాతా నంబర్, వారసత్వం, భూ మార్పిడి పత్రాలు సృష్టించినట్లు తెలుస్తోంది.

మరోవైపు మండల రెవెన్యూ శాఖ అధీనంలో ఉండే కచ్చా పహాణీలో రైతుల పేర్లు చేర్చారు. అయితే ధరణికి ముందు ల్యాండ్‌ రెవెన్యూ రికార్డుల్లో (ఆన్‌లైన్‌) కానీ, తాజా ధరణి రికార్డులో కానీ ఈ వివరాలు లేకపోవడం ఇవి తప్పుడు పత్రాలేనన్న అనుమానాలకు బలం చేకూర్చుతోంది. పాస్‌బుక్‌ ఖాతా నంబర్లను పరిశీలిస్తే సర్వే నంబర్ల వాస్తవ పరిస్థితికి భిన్నంగా కనిపిస్తోంది. కాగా సదరు రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆ భూమిపై జీపీఏ తీసుకుంది. దీని ఆధారంగా వెంచర్‌ వేసి భూమి రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నించగా నిషేధిత జాబితాలో ఈ భూమి వివరాలు ఉండటంతో చుక్కెదురయ్యింది.

దీంతో రిజిస్ట్రేషన్‌కు అనుమతి కోరుతూ రియల్‌ సంస్థ కోర్టును ఆశ్రయించి తమకు అనుకూలంగా తాత్కాలిక ఆదేశాలు పొందింది. అయితే ఇది తుది తీర్పుపై ఆధారపడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పోలీసుల సహకారంతో సదరు రియల్‌ ఎస్టేట్‌ సంస్థ భూములను తమ అధీనంలోకి తీసుకుంది. విషయం తెలిసిన చెట్కూరి వంశీయులు ఈ కేసులో తమను ఇంప్లీడ్‌ చేయాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ పెండింగ్‌లో ఉంది. 

కోర్టు ఆదేశాల సాకుతో.. 
దర్గాకు సంబంధించి సర్వే నంబర్‌ 82లోని ఆరు ఎకరాలకు గతంలో లేఅవుట్‌ పర్మిషన్‌ (ఎల్పీ) జారీ చేసిన హెచ్‌ఎండీఏ..రియల్‌ సంస్థ దరఖాస్తు మేరకు తాజాగా ఈ 52.25 ఎకరాలకు ఎల్పీ జారీ చేసింది. సదరు రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఎల్పీ కోసం దరఖాస్తు చేసుకున్న సమాచారం తెలిసి ధరణిలో పట్టాదారుగా నమోదైన రైతులు.. ఎల్పీ జారీ చేయవద్దని, ఆ భూములపై 12 కేసులు ఉన్నాయంటూ, హెచ్‌ఎండీఏ వద్ద పలు ఆధారాలతో సహా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ భూములపై కోర్టు తుది తీర్పు షరతును సాకుగా తీసుకుని, భూముల వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే హెచ్‌ఎండీఏ ఎల్పీ జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది.

రిజిస్ట్రేషన్‌ శాఖ కూడా ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయడం గమనార్హం. కాగా వక్ఫ్‌ బోర్డు మౌనంగా ఉండటంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఒకవేళ కోర్టు తుది తీర్పు ప్రతికూలంగా వస్తే ప్లాట్ల కొనుగోలుదారుల పరిస్థితేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించగా హెచ్‌ఎండీఏ అధికారులు, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ స్పందించక పోవడం గమనార్హం. ‘సర్వే నంబర్లు నిషేదిత జాబితాలో ఉన్నమాట వాస్తవమే. అయితే కోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం..’అని మహేశ్వరం సబ్‌ రిజిస్ట్రార్‌ మహేందర్‌ స్పష్టం చేశారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement