Wakf Board lands
-
రూ. 260 కోట్ల వక్ఫ్ భూమికి ఎసరు! చక్రం తిప్పిన రియల్ ఎస్టేట్ సంస్థ
సాక్షి, హైదరాబాద్: వక్ఫ్‌బోర్డు భూములు దర్జాగా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతున్నాయి. రెవెన్యూ శాఖ (ధరణి)తో పాటు స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ల శాఖ నిషేధిత జాబితాలో పొందుపర్చిన భూములకు కనీస పరిశీలన లేకుండానే లేఅవుట్ అవుట్ పర్మిషన్లు జారీ అవుతుండగా, ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ యథేచ్ఛగా కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్ శివారులో ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న కొంగర కుర్దు–ఏలో ఈ విధంగా ఓ భారీ రియల్ వెంచర్ వెలుగుచూసింది. సుమారు రూ.260 కోట్ల విలువైన 52.25 ఎకరాల వక్ఫ్ భూములకు సంబంధించి హైకోర్టులో వివాదం కొనసాగుతుండటం గమనార్హం. ఇంత జరుగుతున్నా వక్ఫ్ బోర్డు ప్రేక్షక పాత్ర పోషించడం అనుమానాలకు తావిస్తోంది. ఇదీ కథ..: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగరకుర్దు–ఏలో సర్వే నంబర్ 2 నుంచి 400 వరకు దర్గా సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేనీ ఖిబ్లా పేరిట సుమారు 500 ఎకరాలకు పైగా వక్ఫ్ భూమి ఉంది. 1954 నుంచి ఇప్పటివరకు పహాణీల్లో పట్టాదారు కాలంలో దర్గా పేరే నమోదై ఉంది. 2007లో వక్ఫ్‌బోర్డు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా ఆ భూమిని సాగు చేసుకుంటున్న రైతులందరితో పాటు సర్వే నంబర్ 86, 87, 88, 89లోని సుమారు 52.25 ఎకరాల భూమి సాగు చేసే చెట్కూరి వంశీయులు కూడా గెజిట్‌ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టేటస్ కో ఆర్డర్ జారీ చేయడంతో అప్పటి నుంచి కేసు పెండింగ్‌లోనే ఉంది. ప్రభుత్వ రెవెన్యూ రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ నిషేధిత జాబితాలో సైతం ఆయా సర్వే నంబర్ల వివరాలు పొందుపర్చారు. ఫలితంగా భూముల రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోయాయి. పహాణీ, ధరణిలో కబ్జాదారుడు (పీటీ)ల కాలమ్‌లో చెట్కూరి కుటుంబ వంశీయుల పేర్లు, పట్టాదారుల కాలమ్‌లో దర్గా సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేనీ ఖిబ్లా పేరు కొనసాగుతూ వస్తోంది. కాగా 2010లో రోడ్డు కోసం సేకరించిన భూమికి గాను ప్రభుత్వం చెట్కూరి కుటుంబాలకు పరిహారం అవార్డు ప్రకటించింది. అయితే కోర్టు వివాదం కారణంగా తుది తీర్పును బట్టి పరిహారం చెల్లింపు వర్తించే విధంగా నిబంధన చేర్చింది. సందట్లో సడేమియా.. హైకోర్టులో వివాదం కొనసాగుతుండగానే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ రంగ ప్రవేశం చేసింది. గ్రామంలో లేని ఇద్దరు రైతుల పేరిట సుమారు 52.25 ఎకరాలకు సంబంధించి పాత తేదీలతో తప్పుడు పత్రాలు çసృష్టించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక రైతు పేరిట సర్వే నంబర్ 86, 87లోని 24.15 ఎకరాలు, మరొకరి పేరిట సర్వే నంబర్ 88, 89లోని 28.10 ఎకరాలకు సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించారు. అప్పటి తూర్పు డివిజన్ (గోషామహల్) రెవెన్యూ అధికారి జారీ చేసినట్లుగా.. ఓఆర్సీ (ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్) ప్రొసీడింగ్, తప్పుడు పట్టాదారు పాస్ బుక్, టైటిల్ నంబర్, ఖాతా నంబర్, వారసత్వం, భూ మార్పిడి పత్రాలు సృష్టించినట్లు తెలుస్తోంది. మరోవైపు మండల రెవెన్యూ శాఖ అధీనంలో ఉండే కచ్చా పహాణీలో రైతుల పేర్లు చేర్చారు. అయితే ధరణికి ముందు ల్యాండ్ రెవెన్యూ రికార్డుల్లో (ఆన్లైన్) కానీ, తాజా ధరణి రికార్డులో కానీ ఈ వివరాలు లేకపోవడం ఇవి తప్పుడు పత్రాలేనన్న అనుమానాలకు బలం చేకూర్చుతోంది. పాస్‌బుక్ ఖాతా నంబర్లను పరిశీలిస్తే సర్వే నంబర్ల వాస్తవ పరిస్థితికి భిన్నంగా కనిపిస్తోంది. కాగా సదరు రియల్ ఎస్టేట్ సంస్థ ఆ భూమిపై జీపీఏ తీసుకుంది. దీని ఆధారంగా వెంచర్ వేసి భూమి రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నించగా నిషేధిత జాబితాలో ఈ భూమి వివరాలు ఉండటంతో చుక్కెదురయ్యింది. దీంతో రిజిస్ట్రేషన్‌కు అనుమతి కోరుతూ రియల్ సంస్థ కోర్టును ఆశ్రయించి తమకు అనుకూలంగా తాత్కాలిక ఆదేశాలు పొందింది. అయితే ఇది తుది తీర్పుపై ఆధారపడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పోలీసుల సహకారంతో సదరు రియల్ ఎస్టేట్ సంస్థ భూములను తమ అధీనంలోకి తీసుకుంది. విషయం తెలిసిన చెట్కూరి వంశీయులు ఈ కేసులో తమను ఇంప్లీడ్ చేయాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ పెండింగ్‌లో ఉంది. కోర్టు ఆదేశాల సాకుతో.. దర్గాకు సంబంధించి సర్వే నంబర్ 82లోని ఆరు ఎకరాలకు గతంలో లేఅవుట్ పర్మిషన్ (ఎల్పీ) జారీ చేసిన హెచ్ఎండీఏ..రియల్ సంస్థ దరఖాస్తు మేరకు తాజాగా ఈ 52.25 ఎకరాలకు ఎల్పీ జారీ చేసింది. సదరు రియల్ ఎస్టేట్ సంస్థ ఎల్పీ కోసం దరఖాస్తు చేసుకున్న సమాచారం తెలిసి ధరణిలో పట్టాదారుగా నమోదైన రైతులు.. ఎల్పీ జారీ చేయవద్దని, ఆ భూములపై 12 కేసులు ఉన్నాయంటూ, హెచ్ఎండీఏ వద్ద పలు ఆధారాలతో సహా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ భూములపై కోర్టు తుది తీర్పు షరతును సాకుగా తీసుకుని, భూముల వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే హెచ్ఎండీఏ ఎల్పీ జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖ కూడా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. కాగా వక్ఫ్ బోర్డు మౌనంగా ఉండటంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఒకవేళ కోర్టు తుది తీర్పు ప్రతికూలంగా వస్తే ప్లాట్ల కొనుగోలుదారుల పరిస్థితేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా హెచ్ఎండీఏ అధికారులు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ స్పందించక పోవడం గమనార్హం. ‘సర్వే నంబర్లు నిషేదిత జాబితాలో ఉన్నమాట వాస్తవమే. అయితే కోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం..’అని మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ మహేందర్ స్పష్టం చేశారు. -
వక్ఫ్ భూముల మ్యాపింగ్‌లో ఏపీ ఆదర్శం
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఏపీలో వక్ఫ్‌బోర్డు భూముల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కృషి అద్భుతమని సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యులు జనాబ్ నౌషాద్, జనాబ్ హనీఫ్‌అలీ, ఎస్. మున్వారీబేగం, దరక్షన్ ఆంద్రాబీ ప్రశంసించారు. గడిచిన ఏడాదిలో రాష్ట్రంలో అన్యాక్రాంతమైన 559.16 ఎకరాల వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని పరిరక్షించడంపై వారు ప్రభుత్వాన్ని అభినందించారు. విజయవాడలోని ఏపీ స్టేట్ వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ గంధం చంద్రుడు ఇతర ఉన్నతాధికారులతో వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను గురువారం సాయంత్రం కౌన్సిల్ సభ్యులు సమీక్షించారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం వారు మాట్లాడుతూ వక్ఫ్‌బోర్డు ఆస్తులను 50 శాతానికి పైగా మ్యాపింగ్ చేసి దక్షిణ భారతదేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి అమలు చేస్తున్న పలు పథకాల కింద రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డు ద్వారా నిధులు మంజూరుకు కృషి చేస్తామన్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డు నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని కౌన్సిల్ సభ్యులు చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఏపీ వక్ఫ్‌బోర్డు కమిటీని, వక్ఫ్ ట్రిబ్యునల్ త్వరగా ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. ఏపీ వక్ఫ్‌బోర్డు సీఈవో ఎస్.అలీమ్‌బాషా, ఏపీ వక్ఫ్‌బోర్డు డిప్యూటీ సెక్రటరీ షేక్ అహ్మద్, డిప్యూటీ ఇంజినీర్ అబ్దుల్‌ఖాదిర్ పాల్గొన్నారు. చదవండి: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల -
AP: వక్ఫ్ ఆస్తులకు రక్షణ కవచం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు సర్కార్ నడుంబిగించింది. ఇప్పటికే రీసర్వే ద్వారా గుర్తించిన ఆస్తులను కాపాడటంతోపాటు అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనం చేసుకుంటోంది. ఇందుకు ప్రభుత్వం సాంకేతిక పద్ధతులను అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలోనే మైనార్టీ శాఖ పర్యవేక్షణలో రెండో విడత రీసర్వే ఇటీవల మొదలైంది. వక్ఫ్ బోర్డు గుర్తింపు పొందని మసీదులు, వాటికి చెందిన స్థలాలు, గుర్తింపు పొందిన మసీదుల ఆస్తులను రీసర్వే ద్వారా అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు రీసర్వే పూర్తయిన కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు 3,674 వక్ఫ్ ఆస్తులను అధికారులు గుర్తించారు. చదవండి: ‘వర్జీనియా’ రైతుకు ‘పొగ’ సర్వే చేసిన వాటిలో 3,295 వక్ఫ్ ఆస్తులకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు కర్నూలు, పశ్చిమగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దాదాపు 223 వక్ఫ్ భూములు, 3,772 మసీదులు, దర్గాల ఆస్తులకు జీపీఎస్ మ్యాపింగ్‌ను పూర్తి చేశారు. తద్వారా ఆ ఆస్తులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. మరో 1,206 వక్ఫ్ భూములు, 69 వక్ఫ్ సంస్థలకు అనుబంధ ఆస్తుల మ్యాపింగ్‌కు కసరత్తు జరుగుతోంది. వక్ఫ్ భూముల పరిరక్షణకు రీ సర్వే కొనసాగుతోంది.. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ భూముల పరిరక్షణకు రీ సర్వే కొనసాగుతోంది. కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇప్పటికే రీ సర్వే పూర్తి చేశాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుతోపాటు పలు జిల్లాల్లో రీ సర్వేను కొనసాగించేలా చర్యలు చేపట్టాం. రీసర్వేను వేగంగా పూర్తి చేసి అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం. జియోఫెన్సింగ్ ఏర్పాటును వేగంగా చేపట్టేలా అధికార సిబ్బందిని సమాయత్తం చేశాం. రాష్ట్రంలో 30 మసీదులు, దర్గాలకు చెందిన 495.80 ఎకరాల వక్ఫ్ భూములను అక్రమార్కుల చెర నుంచి స్వాధీనం చేసుకున్నాం. – గంధం చంద్రుడు, కార్యదర్శి, మైనార్టీ సంక్షేమ శాఖ -
‘86 శ్మశానాలు కబ్జా అయితే ఐదు కేసులేనా?’
సాక్షి, హైదరాబాద్: వక్ఫ్‌బోర్డు ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నా చట్టపరంగా సరైన చర్యలు చేపట్టడం లేదంటూ బోర్డు సీఈవో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ జంటనగరాల పరిధిలో 86 ముస్లిం శ్మశానాలను కబ్జాదారులు ఆక్రమించారని తేలినా.. కేవలం 5 చోట్ల మాత్రమే కేసులు నమోదు చేయించడం ఏమిటని నిలదీసింది. వక్ఫ్ ఆస్తులను కాపాడటంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన సీఈవోను ఇంటికి పంపడమే మేలంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. సీఈవోపై వెంటనే తగిన చర్యలు చేపట్టాలని మైనారిటీ వెల్ఫేర్ శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జంటనగరాలలోని ముస్లింల శ్మశానాలు ఆక్రమణకు గురవుతున్నాయని, అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా వక్ఫ్‌బోర్డు చర్యలు చేపట్టడం లేదని నగరానికి చెందిన సామాజిక కార్యకర్త మహ్మద్ ఇలియాస్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. (చదవండి: మెరూన్ పాస్‌బుక్ ఇవ్వకండి) ఈ సందర్భంగా వక్ఫ్‌బోర్డు సీఈవో మహ్మద్ కాసీం విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఆక్రమణలపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులకు లేఖలు రాశామని కాసీం వివరించారు. అయితే ఇది సివిల్ వివాదమని, కేసులు నమోదు చేయలేమంటూ వారు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారని తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేయకపోతే జిల్లా ఎస్పీని ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించింది. అక్కడా కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇవ్వకపోతే నేరుగా న్యాయస్థానం ముందు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకునే అవకాశం ఉన్నా ఎందుకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదంటూ మండిపడింది. తనకు సీఆర్పీసీ గురించి తెలియదని కాసీం వ్యాఖ్యానించడంపై ధర్మాసనం స్పందిస్తూ ఇంత చేతగానీ సీఈవో ఉంటే వక్ఫ్‌బోర్డు ఆస్తులకు రక్షణ ఎక్కడ ఉందంటూ అసహనం వ్యక్తం చేసింది. అక్రమణదారులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, 18 ఏళ్లు గడిచినా వాటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. అక్రమార్కులపై వెంటనే చట్టపరంగా తగిన చర్యలు చేపట్టాలని మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలను వివరిస్తూ మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
నంద్యాల టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి, కర్నూలు : వక్ఫ్ బోర్డు భూములు కేంద్రంగా నంద్యాల టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. వక్ఫ్ బోర్డు భూములను కబ్జా చేస్తున్న టీడీపీ నేతలపై ఆ పార్టీ సీనియర్ నేత ఎన్.ఎం.డి ఫరూఖ్ ఆగ్రహించారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాలలోని సర్వే నెం. 286లో ఉన్న వక్ఫ్ బోర్డుకు చెందిన 22.85 ఎకరాల స్థలంపై టీడీపీలోని ఓ నేత కన్నేశాడు. అదే విధంగా 236 సర్వే నెం.లోని 16 ఎకరాల స్థలంపై టీడీపీలోని మరో వర్గం నాయకుడు కన్నేశాడు. వక్ఫ్ బోర్డు పక్కనే ఉన్న తన వెంచర్లకు వక్ఫ్ భూములను రహదారులుగా మార్చుకున్నాడు. దీంతో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు మండలి ఛైర్మన్ ఫరూఖ్‌ను కలిసి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఆక్రమణలకు పాల్పడుతున్న టీడీపీలోని ఒక వర్గం వారిపై ముస్లింలు తిరగబడాలని, ధర్నాలు, రాస్తారోకోలు చేయాలంటూ ఫరూఖ్ పిలుపునిచ్చారు. కాగా కబ్జాను అడ్డుకుంటున్న అధికారులపై టీడీపీ నేతలు దాడులు, బెదిరింపులకు పాల్పడుతుండటం గమనార్హం. -
వక్ఫ్ బోర్డు భూముల లీజులో జలీల్‌ఖన్ పై మండిపాటు
-
కబ్జా కోరల్లో వక్ఫ్ భూములు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్లో ఖరీదైన వక్ఫ్ బోర్డ్ భూముల్లో రాజకీయ నేతలు పాగా వేశారు. పేద ముస్లింలకు చెందాల్సిన స్థలాలను కబ్జా చేశారు. ఆక్రమణలు నిజమేనంటూ రెవెన్యూ అధికారులు నిగ్గు తేల్చినా నివేదికపై చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం సాహసం చేయడం లేదు. జిల్లా కేంద్రమైన ఖమ్మంలో వక్ఫ్ బోర్డు ఆధీనంలో రూ.1200 కోట్ల విలువైన భూములున్నాయి. ఖమ్మం ఖిల్లా బజార్‌లోని బాదెషాహి అషూర్ ఖానా, రోటరీనగర్‌లోని తాలీమస్తాన్ రహమతుల్లా అలై దర్గాలకు చెందిన ఈ భూములు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నట్లు ప్రభుత్వ రాజపత్రం ద్వారా వెల్లడవుతోంది. అయితే సదరు స్థలాలు కాగితాల్లో మాత్రమే వక్ఫ్ భూములుగా కనిపిస్తుండగా, ఖరీదైన ఈ భూముల్లో పలువురు రాజకీయ నేతలు పాగా వేశారు. అషూర్ఖానాకు చెందిన దాదాపు 86 ఎకరాల భూమిలో 71 ఎకరాలు ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల పంచాయతీ పరిధిలోని గొల్లగూడెంలో ఉంది. ఎకరం కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఈ భూములపై ఖమ్మానికి చెందిన పలువురు ప్రముఖుల కన్నుపడింది. క్రమంగా రికార్డులను తారుమారు చేస్తూ కబ్జాదారులు వక్ఫ్ భూముల్లో కాలుమోపారు. మరికొందరు 99 సంవత్సరాల లీజు పేరుతో సంస్థలను ఏర్పాటు చేశారు. సదరు భూమిలో ఆక్రమణకు పాల్పడిన వారిలో జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత కూడా ఉన్నారని మైనార్టీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సుమారు రూ.10 కోట్ల విలువ చేసే భూమిలో సదరు నేత తన సొంత కంపెనీ పేరుతో పలు నిర్మాణాలు కూడా చేసి వాటిని విక్రయించినట్లు గతంలో ఫిర్యాదులు సైతం దాఖలయ్యాయి. వక్ఫ్ బోర్డు భూముల్లో జరుగుతున్న ఈ రియల్ ఎస్టేట్ దందాను గమనించిన మైనార్టీ సంఘాలు అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై విచారణ చేయాలని రెండు సంవత్సరాల కిందట అప్పటి ట్రైనీ ఐఏఎస్ అధికారి, అసిస్టెంట్ కలెక్టర్ హరినారాయణను నియమించారు. ఆయన విచారణ నిర్వహించి టీడీపీ నేత చేసిన కబ్జా వాస్తవమేనంటూ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. అయితే నివేదిక సమర్పించి రెండేళ్లు గడుస్తున్నా అధికారులు మాత్రం సదరు ఆక్రమణలపై కనీస విచారణకు కూడా సిద్ధపడకపోవడం గమనార్హం.ఖమ్మంలోని రోటరీనగర్‌లో సైతం దర్గాకు చెందిన దాదాపు 8 ఎకరాల భూమి పలువురి ఆధీనంలో ఉన్నట్లు వక్ఫ్ అధికారులు అంగీకరిస్తున్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రి నుంచి రహదారికి ఇరువైపులా విస్తరించి ఉన్న ఈ భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉండటం విశేషం. సదరు భూముల ఆక్రమణల్లో ఖమ్మానికి చెందిన కాంగ్రెస్ నేత కూడా ప్రముఖంగా ఉండటంతో వక్ఫ్ అధికారులు చర్యలు తీసుకునేందుకు అప్పట్లో వెనుకాడారు. ఈ భూముల ఆక్రమణల వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులు సైతం ఉన్నప్పటికీ వాటిని అమలు చేసే విషయంలో జిల్లా యంత్రాంగం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుండటం కబ్జాదారుల పలుకుబడిని స్పష్టం చేస్తోంది. మైనార్టీలకు అండగా నిలుస్తున్నామని చెప్పుకుంటున్న రాజకీయ నేతలే వక్ఫ్ బోర్డు స్థలాలను మింగేస్తున్నా అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. రక్షిత భూముల విషయంలో న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా అధికారులు స్పందించడం లేదు. కోట్ల విలువైన వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయని, దీనిపై తమ ఆవేదనను అటు రాజకీయ పార్టీలు, ఇటు అధికారులు గుర్తించడం లేదని ముస్లిం మైనారిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం డివిజన్‌లోనే ఆక్రమణలు ఎక్కువ... జిల్లా వ్యాప్తంగా మొత్తం 714.04 ఎకరాల వక్ఫ్ భూములు ఉండగా, 344.05 ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయి. వక్ఫ్పరిరక్షణలో 370 ఎకరాలు ఉన్నాయి. ఖమ్మం డివిజన్లో 170.28 ఎకరాలు ఉండగా, అందులో 122.11 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. కొణిజర్ల మండలం పరిధిలో 48.24 ఎకరాలకు 38.08 ఎకరాలు, సింగరేణి మండల పరిధిలో 0.37 ఉండగా మొత్తం ఆక్రమణకు గురయ్యాయి. మధిర మండల పరిధిలో 219.23 ఎకరాలు ఉండగా 22.09 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. ఇవి కాక చింతకాని మండల పరిధిలో 32.03 ఎకరాలు, ముదిగొండ మండలంలో 0.21, నేలకొండపల్లి మండలంలో 3.01, బోనకల్ మండలంలో 3.31, ఎర్రుపాలెంలో 26.38, తిరుమలాయపాలెం మండల పరిధిలో 8.08, బయ్యారం మండలంలో 5.20, బూర్గంపహాడ్‌లో 20.36, అశ్వాపురంలో 4.37, కుక్కునూరులో 0.20, వేంసూరులో 49.05, కల్లూరు మండలంలో 16.24, గార్లలో 33.22, గుండాల 2.32, తల్లాడలో 8.07, జూలూరుపాడులో 14.00, పాల్వంచలో 51.23, ఏన్కూర్‌లో 8.15, వైరా మండలంలో 0.09 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి.