సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్‌లో ఖరీదైన వక్ఫ్ బోర్డ్ భూముల్లో రాజకీయ నేతలు పాగా వేశారు. పేద ముస్లింలకు చెందాల్సిన స్థలాలను కబ్జా చేశారు. ఆక్రమణలు నిజమేనంటూ రెవెన్యూ అధికారులు నిగ్గు తేల్చినా నివేదికపై చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం సాహసం చేయడం లేదు. జిల్లా కేంద్రమైన ఖమ్మంలో వక్ఫ్ బోర్డు ఆధీనంలో రూ.1200 కోట్ల విలువైన భూములున్నాయి. ఖమ్మం ఖిల్లా బజార్‌లోని బాదెషాహి అషూర్ ఖానా, రోటరీనగర్‌లోని తాలీమస్తాన్ రహమతుల్లా అలై దర్గాలకు చెందిన ఈ భూములు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నట్లు ప్రభుత్వ రాజపత్రం ద్వారా వెల్లడవుతోంది.
అయితే సదరు స్థలాలు కాగితాల్లో మాత్రమే వక్ఫ్ భూములుగా కనిపిస్తుండగా, ఖరీదైన ఈ భూముల్లో పలువురు రాజకీయ నేతలు పాగా వేశారు. అషూర్‌ఖానాకు చెందిన దాదాపు 86 ఎకరాల భూమిలో 71 ఎకరాలు ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల పంచాయతీ పరిధిలోని గొల్లగూడెంలో ఉంది. ఎకరం కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఈ భూములపై ఖమ్మానికి చెందిన పలువురు ప్రముఖుల కన్నుపడింది. క్రమంగా రికార్డులను తారుమారు చేస్తూ కబ్జాదారులు వక్ఫ్ భూముల్లో కాలుమోపారు.
మరికొందరు 99 సంవత్సరాల లీజు పేరుతో సంస్థలను ఏర్పాటు చేశారు. సదరు భూమిలో ఆక్రమణకు పాల్పడిన వారిలో జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత కూడా ఉన్నారని మైనార్టీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సుమారు రూ.10 కోట్ల విలువ చేసే భూమిలో సదరు నేత తన సొంత కంపెనీ పేరుతో పలు నిర్మాణాలు కూడా చేసి వాటిని విక్రయించినట్లు గతంలో ఫిర్యాదులు సైతం దాఖలయ్యాయి. వక్ఫ్ బోర్డు భూముల్లో జరుగుతున్న ఈ రియల్ ఎస్టేట్ దందాను గమనించిన మైనార్టీ సంఘాలు అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాయి.
దీనిపై విచారణ చేయాలని రెండు సంవత్సరాల కిందట అప్పటి ట్రైనీ ఐఏఎస్ అధికారి, అసిస్టెంట్ కలెక్టర్ హరినారాయణను నియమించారు. ఆయన విచారణ నిర్వహించి టీడీపీ నేత చేసిన కబ్జా వాస్తవమేనంటూ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. అయితే నివేదిక సమర్పించి రెండేళ్లు గడుస్తున్నా అధికారులు మాత్రం సదరు ఆక్రమణలపై కనీస విచారణకు కూడా సిద్ధపడకపోవడం గమనార్హం.ఖమ్మంలోని రోటరీనగర్‌లో సైతం దర్గాకు చెందిన దాదాపు 8 ఎకరాల భూమి పలువురి ఆధీనంలో ఉన్నట్లు వక్ఫ్ అధికారులు అంగీకరిస్తున్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రి నుంచి రహదారికి ఇరువైపులా విస్తరించి ఉన్న ఈ భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉండటం విశేషం. సదరు భూముల ఆక్రమణల్లో ఖమ్మానికి చెందిన కాంగ్రెస్ నేత కూడా ప్రముఖంగా ఉండటంతో వక్ఫ్ అధికారులు చర్యలు తీసుకునేందుకు అప్పట్లో వెనుకాడారు.
ఈ భూముల ఆక్రమణల వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులు సైతం ఉన్నప్పటికీ వాటిని అమలు చేసే విషయంలో జిల్లా యంత్రాంగం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుండటం కబ్జాదారుల పలుకుబడిని స్పష్టం చేస్తోంది. మైనార్టీలకు అండగా నిలుస్తున్నామని చెప్పుకుంటున్న రాజకీయ నేతలే వక్ఫ్ బోర్డు స్థలాలను మింగేస్తున్నా అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. రక్షిత భూముల విషయంలో న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా అధికారులు స్పందించడం లేదు. కోట్ల విలువైన వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయని, దీనిపై తమ ఆవేదనను అటు రాజకీయ పార్టీలు, ఇటు అధికారులు గుర్తించడం లేదని ముస్లిం మైనారిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం డివిజన్‌లోనే ఆక్రమణలు ఎక్కువ...
జిల్లా వ్యాప్తంగా మొత్తం 714.04 ఎకరాల వక్ఫ్ భూములు ఉండగా, 344.05 ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయి. వక్ఫ్‌పరిరక్షణలో 370 ఎకరాలు ఉన్నాయి. ఖమ్మం డివిజన్‌లో 170.28 ఎకరాలు ఉండగా, అందులో 122.11 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. కొణిజర్ల మండలం పరిధిలో 48.24 ఎకరాలకు 38.08 ఎకరాలు, సింగరేణి మండల పరిధిలో 0.37 ఉండగా మొత్తం ఆక్రమణకు గురయ్యాయి. మధిర మండల పరిధిలో 219.23 ఎకరాలు ఉండగా 22.09 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు.
ఇవి కాక చింతకాని మండల పరిధిలో 32.03 ఎకరాలు, ముదిగొండ మండలంలో 0.21, నేలకొండపల్లి మండలంలో 3.01, బోనకల్ మండలంలో 3.31, ఎర్రుపాలెంలో 26.38, తిరుమలాయపాలెం మండల పరిధిలో 8.08, బయ్యారం మండలంలో 5.20, బూర్గంపహాడ్‌లో 20.36, అశ్వాపురంలో 4.37, కుక్కునూరులో 0.20, వేంసూరులో 49.05, కల్లూరు మండలంలో 16.24, గార్లలో 33.22, గుండాల 2.32, తల్లాడలో 8.07, జూలూరుపాడులో 14.00, పాల్వంచలో 51.23, ఏన్కూర్‌లో 8.15, వైరా మండలంలో 0.09 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి.
కబ్జా కోరల్లో వక్ఫ్ భూములు
Published Sat, Nov 29 2014 3:29 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement