‘ఫిట్‌మెంట్’ దం‘దాదా’గిరీ | Fitment issues | Sakshi
Sakshi News home page

‘ఫిట్‌మెంట్’ దం‘దాదా’గిరీ

Published Sun, Aug 2 2015 2:39 AM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

Fitment issues

సాక్షి ప్రతినిధి, కాకినాడ : పోరాడి సాధించుకున్న ఫిట్‌మెంట్ అమలుకు ప్రభుత్వోద్యోగులు తమ శాఖల్లోని దం‘దాదా’ల చేతులు తడపాల్సి వస్తోంది. నాలుగింట మూడొంతుల ప్రభుత్వ శాఖల్లో ఫిట్‌మెంట్ కోసం మామూళ్లు వసూలు చేస్తున్న వ్యవహారం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణ  సర్కార్ ఇచ్చిన ఫిట్‌మెంట్ మాదిరి ఇక్కడి ఉద్యోగులు కూడా పోరాడి సాధించుకున్నారు. కానీ ఖజానా(ట్రెజరీస్) శాఖకు ‘ఫార్మాలిటీస్’ వంకతో పై నుంచి కిందిస్థాయి వరకు ముడుపులు ముట్టచెప్పందే ఫిట్‌మెంట్ రాదని వసూల్ రాజాలు బెదిరిస్తున్నారు. జిల్లాలో ఏ శాఖ ఉద్యోగులను కదిలించినా ఈ వసూళ్ల దందానే చెబుతున్నారు. సంతోషం కొద్దీ తాము ఇస్తే తీసుకోవాలే కాని డిమాండ్ చేసి మరీ వసూళ్లకు తెగబడుతున్నారని పలుశాఖల్లో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 వైద్య ఆరోగ్య, రెవెన్యూ, రవాణా, ఎక్సైజ్..ఇలా మూడొంతుల శాఖల్లో ఫిట్‌మెంట్ వసూళ్ల దందా గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్నారు. ఆయా శాఖల్లోని పలు విభాగాల పర్యవేక్షకుల్లో ఒకరిద్దరు కలిసి  ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. ఇందులో ఏ ఒక్కరినీ విడిచిపెట్టడం లేదని ఉద్యోగులు గగ్గోలుపెడుతున్నారు. అలాగని బయటపడి పెదవి విప్పేందుకు వెనకడుగు వేస్తున్నారు. కొరివితో తల గోక్కున్నట్టవుతుందేమోనని మిన్నకుంటున్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలో వివిధ విభాగాలకు చెందిన అరడజన్ మంది ఉద్యోగులు ఒకో కేడర్‌కు ఒకో రేటు నిర్ణయించి మరీ వసూళ్ల దందాకు తెరలేపారు.   ఉద్యోగుల వివరాలతో కూడిన నివేదికలు ఖజానా శాఖకు అందచేసేందుకు వారికి ఎంతో కొంత ముట్టచెప్పాలంటూ స్థాయిని బట్టి రూ.1,000 నుంచి రూ.5,000 వసూలు చేస్తున్నారు.
 
 వైద్య, ఆరోగ్యశాఖలో ముందే మొదలు..
 వైద్య ఆరోగ్యశాఖలో ఈ దందా ముందే మొదలైపోయింది.  ఏఎన్‌ఎంలు, ఫార్మాసిస్టులు, లేబ్ టెక్నీషియన్ వంటి ఉద్యోగుల నుంచి రూ.1,000, స్టాఫ్‌నర్సుల నుంచి రూ.2,000 పై గా వసూలు చేస్తున్నారు.  చివరకు వైద్యుల నుంచి కూడా  వారి హోదాకు తగ్గట్టు రూ.3,000 వంతున వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి.  
 
 అన్ని శాఖల్లోనూ వసూళ్లు

 రెవెన్యూశాఖలో రూ.1,000 తక్కువ కాకుండా, అధిక ఆదాయం వస్తుందంటూ రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల నుంచి రూ.2,000 వసూలు చేస్తున్నారు. ఎక్సైజ్‌శాఖలో దిగువ కేడర్‌కు చెందిన కానిస్టేబుళ్లు తమ నుంచి రెండు వేలు తక్కువైతే తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఇదే పరిస్థితి మిగిలిన అన్ని శాఖల్లో ఉంది.  ఫిట్‌మెంట్ పేరుతో సాగుతున్న వసూళ్ల దందా దిగువ కేడర్ ఉద్యోగులు, మినిస్టీరియల్ సిబ్బందికి భారంగా మారింది. ట్రెజరీ వంకతో సాగిస్తున్న ఈ వసూళ్ల దందాకు చెక్ పెట్టాల్సిన బాధ్యత ఆయా శాఖల ఉన్నతాధికారులపై ఉంది.
 
 పోరాడి సాధించుకుంటే లంచమా..
 ఫిట్‌మెంట్ అనేది పోరాడి సాధించుకోగా లంచాలు డిమాండ్ చేయడం భావ్యం కాదు. తోటి ఉద్యోగుల నుంచి ట్రెజరీకి ఇవ్వాలంటూ వసూళ్లకు పాల్పడటం సమంజసం కాదు.
 - పలివెల శ్రీనివాస్, వైద్య ఉద్యోగుల సంఘం నాయకుడు
 
 వసూళ్లపై ఫిర్యాదులొస్తే తీవ్రచర్యలు
  మా శాఖ పేరు చెప్పి లంచాలు వసూలుచేస్తే తీవ్రంగా పరిగణిస్తాం. ఎవరైనా మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయి. మా శాఖ సిబ్బందికి ఈ వ్యవహారంలో ఎటువంటి సంబంధం లేదు.
 - జి.లలిత, డిప్యూటీ డెరైక్టర్, ట్రెజరీస్, కాకినాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement