
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ కర్ణన్
సాక్షి, ఖమ్మం: ప్రణాళిక ప్రకారం ఆన్‌లైన్ విద్యా బోధన చేపట్టాలని కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల విద్యాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టర్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 1,329 ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి వరకు 74,042 మంది విద్యార్థులకు ఆన్‌లైన్ బోధన అందేలా చూడాలన్నారు. డీటీహెచ్, టీవీ, సెల్‌ఫోన్లకు ఇంటర్నెట్ కనెక్షన్లను సమకూర్చుకోవాలన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న మండలాల్లో పాఠశాలలతోపాటు వసతి గృహాల విద్యార్థులకు సమగ్ర కార్యాచరణతో బోధన జరగాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయులకు సంబంధించి సబ్జెక్టుల వారీగా టీచర్ల సెల్ నంబర్లు తప్పనిసరిగా విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఆన్‌లైన్ తరగతుల షెడ్యూల్‌ను ప్రతి పాఠశాల, గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డుపై తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. ప్రసార మాధ్యమాల సదుపాయం లేని వారి కోసం పాఠశాల, గ్రామ పంచాయతీల్లో టీవీలను సమకూర్చి సీనియర్ విద్యార్థులతో సమన్వయపర్చాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల విద్యార్థుల కోసం తీసుకున్న చర్యలపై సూచనలు చేశారు. వీసీలో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్‌రావు, డీఈఓ మదన్‌మోహన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖాధికారులు సత్యనారాయణ, రమేష్ పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో విద్యా, సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ బోధనాంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ నేటి నుంచి పాఠశాల విద్యార్థులకు దూరదర్శన్, టీ శాట్, ద్వారా చేపడుతున్న ఆన్‌లైన్ తరగతులను టైం టేబుల్ ప్రకారం ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్ టీచర్లు నిర్వహించాలన్నారు. విద్యార్థుల సంఖ్యనుబట్టి ప్రతి విద్యార్థి ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్, కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి, డీఈఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment