యనమల రామకృష్ణుడు (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి : ఆంధధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంక్ అధికారుల సమావేశం జరిగింది. ఇందులో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు పలు బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యనమల బ్యాంకుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తీవ్ర నగదు కొరత ఏర్పడిందని, ఏటీఎంలు మూతపడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఏటీఎంల్లో నగదు అందుబాటులో ఉండటంలేదని.. కనీసం వెయ్యి రూపాయలు కూడా దొరకడం లేదన్నారు. ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా నగదు దొరకని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నగదు కొరతతో రియల్‌ఎస్టేట్ రంగం పడిపోయిందని, ఎకనామిక్ యాక్టివిటి జరగడంలేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో వృద్ధిరేటు శాతం తగ్గిపోయిందని, భవిష్యత్తులో మనీ సర్క్యూలేషన్ లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందుల వస్తాయని యనమల అన్నారు. రాష్ట్రంలో చాలా వరకు ఏటీఎంలు మూతపడ్డాయని, ప్రజలు బ్యాంకుల చుట్టూ, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా నగదు దొరకని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని యనమల అభిప్రాయపడ్డారు. నగదు కొరతపై చంద్రబాబు ఇప్పటికే పలుసార్లు కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. నల్లధనాన్ని అరికడతామని నాడు కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిందని, కానీ అది పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా నోట్ల రద్దు వల్ల ఇతరత్రా సమస్యలు అనేకం తలెత్తాయిని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 2వేల నోట్లు కనిపించకుండా పోయాయని, కనీసం వందనోట్లు కూడా ఎక్కడ దొరకడం లేదంటూ యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు డబ్బు సర్క్యులేషన్‌లో ఉంటేనే ఆర్ధిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఆర్థిక కార్యకలాపాలు స్థంభిస్తే అభివృద్ధి ఎలా సాధ్యం అంటూ ప్రశ్నించారు. నోట్ల రద్దు ప్రభావం ప్రభుత్వాలపై పడుతోందని, బ్యాంకుల్లో నగదు లేమిని నివారించాలని బ్యాంకు అధికారులను కోరారు. ఈ వ్యవహారంపై కేంద్రం ఏం చేద్దామనుకుంటుందో అర్థం కావడంలేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మంత్రి యనమల వ్యాఖ్యలతో బ్యాంకు అధికారులు విభేదించారు. ఆర్‌బీఐ నుంచి వేల కోట్లు విలువ చేసే కొత్త నోట్లు అందించామని తెలియచేశారు.
Comments
Please login to add a commentAdd a comment