సాక్షి, అమరావతి : ఒకటో తారీఖు వస్తుందంటే భయపడాల్సి వస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గురువారం సీఎం నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈసందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న నగదు కొరత సమస్యపై ముఖ్యమంత్రి బ్యాంకు అధికారులతో చర్చించారు. ఒకటో తేది వస్తే భయం వేస్తోందని, ఒక్క ఫించన్ల కోసమే రూ.450 కోట్లు కావాలన్నారు. ఎందుకు రాష్ట్రంలో నగదు లభించడం లేదంటూ బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. బ్యాంకుల తీరుతో ప్రజల్లో ఇబ్బందికర వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. ఏ బ్యాంకు అయినా ఇబ్బందుల్లలో ఉంటే డిపాజిట్లర డబ్బు వాడుకుంటాం అనే సంకేతాలను ప్రజల్లోకి పంపారని, అందువల్లే ఈ సమస్యలు వచ్చాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పీఎన్‌బీ కుప్పకూలడంతో ప్రతిఒక్కరిలో భయం పట్టుకుందని, అది తొలగించాల్సిన బాధ్యత బ్యాంకులదేనన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అడిగిన పలు ప్రశ్నలుకు బ్యాంకు అధికారులు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 85శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయని తెలిపారు. డిపాజిట్లుగా వస్తున్న నగదు నాలుగోవంతుకు పడిపోయిందని వెల్లడించారు. ప్రజలు వినియోగదారులు తీసుకున్న డబ్బులో చాలా వరకు ఖర్చు చేయడంలేదని, అందుచేతనే నగదుకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని బ్యాంకర్లు స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో ఐదు వందల కోట్లు నేరుగా ప్రింటింగ్ నుంచి రాష్ట్రానికి వస్తున్నాయని బ్యాంకు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment