cash problems
-
ఒకటో తారీఖు అంటేనే భయం వేస్తోంది..
సాక్షి, అమరావతి : ఒకటో తారీఖు వస్తుందంటే భయపడాల్సి వస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గురువారం సీఎం నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈసందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న నగదు కొరత సమస్యపై ముఖ్యమంత్రి బ్యాంకు అధికారులతో చర్చించారు. ఒకటో తేది వస్తే భయం వేస్తోందని, ఒక్క ఫించన్ల కోసమే రూ.450 కోట్లు కావాలన్నారు. ఎందుకు రాష్ట్రంలో నగదు లభించడం లేదంటూ బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. బ్యాంకుల తీరుతో ప్రజల్లో ఇబ్బందికర వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. ఏ బ్యాంకు అయినా ఇబ్బందుల్లలో ఉంటే డిపాజిట్లర డబ్బు వాడుకుంటాం అనే సంకేతాలను ప్రజల్లోకి పంపారని, అందువల్లే ఈ సమస్యలు వచ్చాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పీఎన్బీ కుప్పకూలడంతో ప్రతిఒక్కరిలో భయం పట్టుకుందని, అది తొలగించాల్సిన బాధ్యత బ్యాంకులదేనన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అడిగిన పలు ప్రశ్నలుకు బ్యాంకు అధికారులు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 85శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయని తెలిపారు. డిపాజిట్లుగా వస్తున్న నగదు నాలుగోవంతుకు పడిపోయిందని వెల్లడించారు. ప్రజలు వినియోగదారులు తీసుకున్న డబ్బులో చాలా వరకు ఖర్చు చేయడంలేదని, అందుచేతనే నగదుకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని బ్యాంకర్లు స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో ఐదు వందల కోట్లు నేరుగా ప్రింటింగ్ నుంచి రాష్ట్రానికి వస్తున్నాయని బ్యాంకు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. -
డబ్బు అంతా ఎటుపోయింది?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రోజురోజుకూ నగదు కొరత పెరిగిపోతోంది. ఏటీఎంలలోనే కాదు బ్యాంకు బ్రాంచీల్లోనూ కరెన్సీ లేక ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. ఎన్నికల ఏడాది కావడమే నగదు కొరతకు ప్రధాన కారణమని, డబ్బుపై ఆధారపడి రాజకీయాలు చేయాలనుకుంటున్న కొన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున డబ్బును దాచేస్తున్నట్టు తమ దగ్గర సమాచారం ఉందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై లోతైన సమాచారం కోసం ఆయా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలతో దగ్గరి సంబంధాలున్న నిర్మాణ, మౌలిక సదుపాయాల సంస్థల ఖాతాలను క్షుణ్నంగా పరిశీలించాలనుకుంటున్నట్టు చెబుతున్నాయి. వారంలో రూ.10 కోట్లు అంతకంటే ఎక్కువ నగదు ఉపసంహరించిన ఖాతాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఏపీ, తెలంగాణలో నగదు కొరతకు దారితీసిన పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఇద్దరు సీనియర్ అధికారుల బృందం పర్యటిస్తోందని.. రిజర్వు బ్యాంకు నుంచి ఎంతెంత డబ్బు విడుదల అయిందన్న వివరాలను వారు సేకరించారని ఆ అధికారి తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా పలుచోట్ల నగదు సమస్య ఉన్నా.. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలలో తీవ్రంగా ఉండటానికి కర్ణాటక ఎన్నికలూ ఒక కారణమని సీబీఐ భావిస్తోంది. ఈ మేరకు కొన్ని ప్రధాన ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల ఆర్థిక కార్యకలాపాలపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు బ్యాంకుల నుంచి భారీగా నగదు ‘బ్లాక్’అయిందన్న వార్తల నేపథ్యంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. చెన్నైకి చెందిన ఓ సీనియర్ అధికారి.. భారీగా నగదు ఉపసంహరించిన బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని హైదరాబాద్‌లోని రిజర్వుబ్యాంకు కార్యాలయాన్ని కోరినట్టు తెలిసింది. ఏపీ తెలంగాణలోనే ఎక్కువ ‘బ్లాక్’! నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ ఎత్తున కరెన్సీ నోట్లు ‘బ్లాక్’అయ్యాయని రిజర్వు బ్యాంకు సందేహిస్తోంది. రాష్ట్రాలకు పంపిణీ చేసిన నగదు మొత్తంలో.. తెలుగు రాష్ట్రాలకే ఎక్కువగా సరఫరా చేసినట్టు ఆర్బీఐ చెబుతోంది. 2016 నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు హైదరాబాద్ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి రూ.1,38,691 కోట్లు పంపింది. అందులో తెలంగాణకు రూ.75,245 కోట్లు, ఏపీకి రూ.63,446 కోట్లు పంపిణీ చేసింది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు చెలామణిలో ఉన్న డబ్బుకు మించి నగదు సరఫరా అయిందని ఆర్బీఐ లెక్కలేసుకుంటోంది. మరోవైపు నెలకోసారి నగదు కొరత ఉన్నట్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తుండటంతో ఆర్బీఐ సైతం తల పట్టుకుంటోంది. భారీ ఎత్తున రూ.2000 నోట్లు అక్రమంగా నిల్వ చేసి ఉంటారనే అనుమానాలున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు, నేతలు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేసుకున్నారు. ఇప్పటికే కొన్ని బ్యాంకు బ్రాంచీల నుంచి వందల కోట్లను డ్రా చేసుకున్నట్లుగా ఆర్బీఐకి సమాచారముంది. ఏయే ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో నగదు డ్రా అయింది.. అక్కడి బ్యాంకు మేనేజర్ల ప్రమేయమేమిటనేది.. ఆర్బీఐ ఆరా తీస్తోంది. పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో మే నెలలో ఎన్నికలు జరుగునున్నాయి. గత నెలలోనే ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచే నోట్ల కొరత తీవ్రతరమైంది. ఏప్రిల్ ఒకటో తేదీకి ముందే∙ఏటీఎంలన్నీ ఆనూహ్యంగా ఖాళీ అయ్యాయని, పోటా పోటీగా బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను ఉపసంహరించినట్లుగా అర్థమవుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి భారీ మొత్తమే కర్ణాటక ఎన్నికలకు తరలించినట్లుగా ప్రచారం జోరందుకుంది. విషమించిన పరిస్థితి.. ‘రోజురోజుకు నోట్ల కొరత పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 80 శాతానికిపైగా ఏటీఎంలు మూతపడ్డాయి. బ్యాంకుల్లో నగదు నిల్వలు అడుగంటాయి. వచ్చే నాలుగైదు రోజుల్లో ఏటీఎంలలో డబ్బులు నింపకపోతే.. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుంది..’’.. రాష్ట్రంలోని బ్యాంకర్లు రిజర్వు బ్యాంకుకు నివేదించిన తాజా సమాచారమిది. ఏపీ, తెలంగాణల్లో జనం నగదు నిల్వ చేసుకుంటున్నారని.. బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ముందుకు రాకపోవటమే నోట్ల కొరతకు ప్రధాన కారణమని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. ఏటీఎంలలో నోక్యాష్ బోర్డుల కారణంగా బ్యాంకులపై నమ్మకం పోతోందని, డబ్బు లేదనే ప్రచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందని.. అందుకే అవసరమున్నా లేకున్నా నగదు విత్‌డ్రా చేసి, నిల్వ చేసుకుంటున్నారని స్టేట్ బ్యాంకుకు చెందిన ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అందువల్లే నోట్ల కొరత రోజురోజుకు విషమిస్తోందని పేర్కొన్నారు. గతేడాది నోట్ల రద్దు నిర్ణయం అమలుకు ముందు రాష్ట్రంలో నెలసరి సగటు నగదు ఉపసంహరణ రూ.2,000గా ఉండేది. ఇప్పుడీ సగటు ఉపసంహరణ రూ.4,500కు చేరిందని బ్యాంకర్లు రిజర్వు బ్యాంకుకు నివేదించారు. ఏటీఎంలన్నీ బంద్.. తెలంగాణలో మొత్తంగా 8,700 వరకు ఏటీఎంలున్నాయి. అందులో 48 శాతం ఏటీఎంలు అనధికారికంగా బంద్ అయ్యాయి. మిగతా 52 శాతం ఏటీఎంలు తెరిచి ఉన్నా.. వాటిలో నోక్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అటు బ్యాంకుల్లోనూ డబ్బులు లేవు. రూ.10 వేలకు మించి నగదు ఇవ్వలేమంటూ స్టేట్ బ్యాంకు బ్రాంచీలు చేతులెత్తేస్తుండటం గమనార్హం. దీంతో సరిపడేంత నగదు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆర్బీఐకి లేఖ రాశారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా తగినంత నగదు పంపిణీ చేయాలని ఆర్బీఐని కోరింది. నాలుగైదు రోజుల్లో ఏటీఎంలు తెరవకపోతే.. పరిస్థితి మరింత చేయి దాటిపోతుందని రాష్ట్ర బ్యాంకర్లు బుధవారం ఆర్బీఐకి నివేదించినట్టు తెలిసింది. ఆర్బీఐ ఆధ్వర్యంలో నగదు నిర్వహణ కమిటీ రిజర్వుబ్యాంకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రూ.2,000 కోట్ల నగదును ముంబై నుంచి ప్రత్యేకంగా విమానంలో పంపించింది. రైతుల అవసరాల దృష్ట్యా ఆ నగదును గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచీలకు చేర్చాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ నగదు బ్యాంకు చెస్ట్‌లలో అందుబాటులో ఉంది. అయితే అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఆ నగదును ఏటీఎంలలో భర్తీ చేయడంపై ఆర్బీఐ దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేకంగా నగదు నిర్వహణ కమిటీ (క్యాష్ మేనేజ్మెంట్ కమిటీ) వేయాలని గురువారం రాత్రి నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి రాష్ట్రంలోని ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండేలా తగిన ఏర్పాట్లు చేసే బాధ్యతను ఆ కమిటీకి అప్పగించింది. నెలాఖరుకల్లా రాష్ట్రంలోని 80 శాతం ఏటీఎంలు నిత్యం నగదు అందించే స్థాయిలో ఉంచాలని ఆదేశించింది. ప్రధాన బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. -
అమరావతిలో నగదు కొరత
-
కాసుల కష్టం మళ్లొచ్చె..
బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు అవసరానికి ఉపయోగపడని పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఎన్ని బ్యాంకుల ఏటీఎంలు ఉన్నా.. డబ్బులు రాని పరిస్థితి. ప్రస్తుతం నగదు కొరత కారణంగా ఏటీఎంలలో బ్యాంకింగ్ వ్యవస్థ డబ్బులు పెట్టలేకపోతోంది. కేంద్ర ప్రభుత్వం 2016, నవంబర్ 7న రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. వీటి స్థానంలో రూ.2,000, రూ.500 నోట్లను విడుదల చేసింది. రద్దు చేసిన పెద్దనోట్లను బ్యాంకుల్లో తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాలని ఆదేశించింది. దీంతో ప్రజల వద్ద ఉన్న నగదు డిపాజిట్ల రూపంలో బ్యాంకుకు చేరింది. అయితే బ్యాంకుల్లో చలామణి అయ్యే నగదు కొరత ఉండటంతో కొంతకాలం ఆర్బీఐ పలు నిబంధనలు విధించింది. నిత్యం రూ.4వేలు మాత్రమే విడుదల చేసుకోవచ్చనే షరతులు విధించింది. ఆ ప్రకారం కూడా వినియోగదారులకు నగదు అందించలేకపోయారు. అంతేకాక నగదు రహిత లావాదేవీలు చేపట్టాలని బ్యాంకర్లను ఆదేశించాయి. ఎన్ని సంస్కరణలు, మార్పులు చేసినా.. ప్రజలు మాత్రం నగదు కోసం కష్టాలు పడుతూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగల్లో సంక్రాంతి ఒకటి. ప్రస్తుతం బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా ఈ సంబురాలు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల బ్రాంచ్‌లు దాదాపు 350కి పైగానే ఉన్నాయి. వీటికి చెందిన ఏనీటైం మనీ(ఏటీఎం)లు 227 ఉన్నాయి. ప్రజలకు అవసరమైన తీరుగా బ్యాంకులు, ఏటీఎంల ఏర్పాటు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎంత మాత్రం ప్రయోజనం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), ఆంధ్రా బ్యాంక్‌లకు చెస్ట్ వ్యవస్థ ఉంది. ఈ చెస్ట్ బ్యాంక్‌కు ఆర్బీఐ నగదు నిల్వలను పంపుతుంది. దీంతో మాతృ బ్యాంక్ బ్రాంచ్‌లతోపాటు పలు బ్యాంకులకు కూడా నగదు అందుబాటులో ఉంచుతారు. ఆర్బీఐ నిత్యం ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్‌లకు రూ.300 నుంచి రూ.400 కోట్ల వరకు నగదును పంపుతుంది. దీనిని చెస్ట్ బ్యాంక్ ఎక్కడ నగదు కొరత ఉంటే అక్కడకు పంపుతుంది. ఈ నగదుతోపాటు బ్యాంక్ లావాదేవీలను కూడా వినియోగిస్తూ ప్రజలకు ఎటువంటి నగదు ఇబ్బందులు లేకుండా అధికారులు చూస్తుంటారు. ప్రస్తుతం నగదు కొరత కారణంగా ఆర్బీఐ చెస్ట్ బ్యాంక్‌లకు నగదును చాలినంతగా పంపించటం లేదు. మూడు, నాలుగు రోజులుగా చెస్ట్ బ్యాంకుల్లో రూ.10కోట్లకు మించి నగదు నిల్వలు లేవని, ఆ నగదును అత్యవసర బ్యాంకులకు పంపిస్తున్నారని సమాచారం. దీంతో నగదు సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాలతోపాటు మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, మణుగూరు, పాల్వంచ, భద్రాచలం, ఇల్లెందు, వైరా, కూసుమంచి కేంద్రాల్లో నగదు కోసం ఇబ్బంది పడుతున్నారు. ఏటీఎంల చుట్టూ.. పండగ కోసం జీతం డబ్బులు డ్రా చేసుకుందామని ఉదయం నుంచి ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా. గాంధీచౌక్, రాపర్తినగర్, జూబ్లీపుర సెంటర్లలో ఉన్న ఏటీఎంలకు వెళ్లా ఎక్కడా నగదు లేదు. ఏమి చేయాలో అర్థం కావటం లేదు. పండగకు పిల్లలకు బట్టలు తీసుకుందామనుకున్న కోరిక తీరుతుందో..? లేదో..? – లావుడ్యా తావుర్యా, రికార్డ్ అసిస్టెంట్, ఖమ్మం మహిళా డిగ్రీ కళాశాల ప్రభుత్వ వైఫల్యమే.. నగదును అందుబాటులో ఉంచకపోవటం ప్రభుత్వ వైఫల్యమే. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలు నగదు డ్రా చేసుకుంటారనే విషయం బ్యాంకింగ్ వ్యవస్థకు తెలియదా..? ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నారు..? నగదు బ్యాంకులో ఉంచుకొని డ్రా చేసుకోలేక పోతున్నాం. పది ఏటీఎంల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. – అశోక్, ప్రైవేటు ఉద్యోగి, ఖమ్మం -
సంక్రాంతికి కరెన్సీ కష్టం
ఆదిలాబాద్ : జిల్లాలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవాల్సిన ప్రజలు నగదు కోసం తిప్పలు పడాల్సి వస్తోంది. నోట్ల రద్దు తర్వాత సంవత్సరంపాటు కొనసాగిన కష్టాలు ఈ ఏడాది సంక్రాంతి పండుగకు సైతం అదే పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఏటీఎంలు పని చేయకపోవడంతో నగదు కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. ప్రతి రోజు ఏటీఎం వద్దకు వెళ్తున్న వినియోగదారులు నో క్యాష్ బోర్డు చూసి వెనుదిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వరకు ఏటీఎంలు ఉండగా 20 మాత్రమే పని చేస్తున్నాయి. వాటిలో కూడా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే నగదు ఉండడంతో వినియోగదారులు బారులు తీరుతున్నారు. నగదు కొరతపై అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ పూట పరేషాన్.. ఎంతో సుఖసంతోషాలతో జరుపుకోవాల్సిన సంక్రాంతి పండగ నోట్ల కష్టాలు తీసుకొచ్చింది. జిల్లాలో వారం రోజుల నుంచి ఏటీఎంలలో నగదు కనిపించడం లేదు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చేతినిండా డబ్బులు ఉండాల్సిన ప్రజలు వాటి కోసం చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితిలో పండుగ చేసుకోవడం గగనంగా మారింది. జిల్లా కేంద్రంలో సుమారు 25 ఏటీఎంలు ఉండగా ఐదారు ఏటీఎంలు మాత్రమే పని చేస్తున్నాయి. ఉదయం నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వినియోగదారులు ఎక్కడ ఏటీఎం పని చేస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎం కార్డు చేతపట్టుకుని తిరుగుతున్నప్పటికీ డబ్బులు లేకపోవడంతో ఇంటికి పండగ సామగ్రి సైతం తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది. బ్యాంకుల్లో సైతం రూ.5 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఇటు ఏటీఎంలలో అటు బ్యాంకుల్లో నగదు సమస్య ఏర్పడడంతో ప్రజల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.. మూతపడ్డ ఏటీఎంలు.. జిల్లా వ్యాప్తంగా ఏ ఏటీఎం’చూసినా నో క్యాష్ బోర్డులు, షెటర్లు మూసి ఉంచడం కనిపిస్తోంది. సాధారణ రోజుల్లో ఏటీఎంలో నగదు ఉంచిన అధికారులు సంక్రాంతి పండుగకు సరిపడా నగదు ఏర్పాటు చేయాల్సింది పోయి మొత్తానికి ఏటీఎంలు మూసి వేయడం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు నగదు కష్టాలపై స్పందించి ఏటీఎంలలో డబ్బులను అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. -
రెండ్రోజుల్లో పింఛన్లు
మోర్తాడ్(బాల్కొండ): నగదు కొరతతో పింఛన్లు తీసుకోలేని ఆసరా లబ్ధిదారులకు ఊరట లభించింది. ఉమ్మడి జిల్లాకు రూ.20 కోట్ల నగదును ఆర్బీఐ విడుదల చేయడంతో నిలిచిన పింఛన్లను పంపిణీ చేసేందుకు తపాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెర్ప్ ఉన్నతాధికారుల షెడ్యూల్ ప్రకారం ఈనెల 2వ తేదీనే గడువు ముగియగా, బ్యాంకుల నుంచి సరిపడా నగదు సరఫరా కాకపోవడంతో పింఛన్ల పంపిణీలో ఆటంకాలు తలెత్తాయి. గడచిన డిసెంబర్‌కు సంబంధించి పింఛన్ల పంపిణీని అదే నెలలో 22న మొదలుపెట్టారు. వారం రోజుల్లో పంపిణీ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా, నగదు కొరతతో జాప్యం ఏర్పడింది. దీంతో జిల్లాలో పలుచోట్ల ఆసరా పింఛన్ల కోసం లబ్ధిదారులు ఆందోళనలు చేశారు. జిల్లా మొత్తంలో 2,61,976 మంది ఆసరా లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో కొంతమందికి రెండు, మూడునెలలకు సంబంధించిన ఫించన్లను అందించాల్సి ఉంది. ఈసారి జిల్లాకు రూ.40 కోట్ల నగదు అవసరం కాగా ఇప్పటి వరకు రూ.24 కోట్లు సరఫరా అయ్యింది. ఇంకా రూ.16 కోట్ల నగదు అవసరం ఉంది. ఇప్పటి వరకు పింఛన్లు తీసుకోని లబ్ధిదారుల సంఖ్య 85వేల వరకు నమోదైంది. బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా పింఛన్లు పూర్తిస్థాయిలో పంపిణీ కాలేదు. గడచిన నెల 22న ఆరంభమైన పింఛన్ల పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సంక్రాంతి పండుగ సమయంలో ఆసరా లబ్ధిదారులను నిరుత్సాహపర్చ వద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎలాగైనా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని తీవ్ర ఒత్తిడి తెచ్చింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆర్బీఐ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడటంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఆసరా పింఛన్ల కోసం నగదు కొరత తీర్చడానికి చర్యలు తీసుకున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించి రూ.20 కోట్ల నగదును కేటాయించారు. ఇందులో కామారెడ్డి జిల్లాకు రూ.8 కోట్లు, నిజామాబాద్ జిల్లాకు రూ.12 కోట్లను సర్దుబాటు చేశారు. రెండు జిల్లాలకు ఈ రోజు నగదు సరఫరా కాగా తపాల సిబ్బందికి చేరే సరికి సాయంత్రం అయ్యే అవకాశం ఉంది. పింఛన్ల పంపిణీ కోసం మరో రెండురోజుల గడువు పొడిగించాలని సెర్ప్ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. గడువు కోరాం.. ఆసరా పింఛన్ల పంపిణీకి సంబంధించిన నగదు ఈ రోజు సరఫరా అయ్యింది. అయితే పింఛన్ల పంపిణీకి సమయం సరిపోదు. అందువల్ల మరో రెండురోజుల పాటు గడువును కోరాం. నగదు కేటాయించిన దృష్ట్యా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం కూడా గడువు పెంచే అవకాశం ఉంది. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – రవీందర్, ఏపీఎం, డీఆర్డీఏ -
మళ్లీ మొదటికొచ్చిన నగదు సమస్య
= ఏటీఎంల్లో నగదు లేక ఖాతాదారుల ఇబ్బందులు = నగదు డ్రా కోసం వెళ్తే పది రూపాయల కాయిన్స్ ఇస్తున్న బ్యాంకర్లు కంభం : బ్యాంకుల్లో సరిపడా నగదు లేక.. ఏటీఎం సెంటర్లు పనిచేయక ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో 11 ఏటీఎం సెంటర్లు ఉన్నా నగదు లేక అవి నిరుపయోగంగా ఉన్నాయి. నెల రోజులుగా ఒకటి.. రెండు ఏటీఎం సెంటర్లు మినహా మిగిలిన ఏటీఎంలు పని చేసిన దాఖలాలు లేవు. అవి కూడా అప్పుడప్పుడు మాత్రమే పని చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం బ్యాంకుల్లో నగదు అందుబాటులో లేదు. కేవలం కొద్ది మొత్తంలో నోట్లు ఉండగా మిగిలిన వారికి పది రుపాయల కాయిన్స్ ఇస్తున్నారు. దీంతో ఖాతాదారులకు కొత్త చిక్కు వచ్చి పడింది. రూ.10 వేలు, రూ.20 వేలు విత్‌డ్రా తీసుకున్న వారు ఆ కాయిన్లు తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి వరకూ నోట్లను చిల్లరగా మార్చుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడేమో చిల్లరను నోట్లుగా మార్చుకోవాల్సి వస్తోంది. దుకాణాల్లో ఎక్కువ చిల్లర ఇస్తే తీసుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. బ్యాంకులతో పాటు ఎస్బీఐ ఖాతాదారుల సేవా కేంద్రాల్లో సైతం పది రుపాయల కాయిన్స్ విత్‌డ్రాగా ఇస్తున్నారు. నగదు అవసరమై గురువారం బ్యాంకుకు వెళ్లి రూ.20 వేలు విత్‌డ్రా చేసా. అన్నీ పది రూపాయల కాయిన్స్ ఇచ్చారు. దాదాపు పది కేజీల పైన బరువు ఉన్నాయి. వీటిని ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదు. --- చెన్నకేశవులు, కంభం బ్యాంకులో నగదు అందుబాటులో లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉంది. నగదు ఉన్నంత వరకూ ఇచ్చేస్తున్నాం. పది రూపాయల కాయిన్లు కొంతమేర ఉండటంతో వాటిని ఖాతాదారులకు అందిస్తున్నాం. --- రాఘవులు, ఎస్బీఐ మేనేజర్, కంభం -
చిల్లరివ్వండి మహాప్రభో..
- బ్యాంకర్లను ప్రాధేయపడుతున్న జనం – నగదు కొరత కారణంగా రూ.4 వేలు కూడా ఇవ్వలేకపోతున్న బ్యాంకర్లు – బ్యాంకులు, ఏటీఎంల వద్ద కొనసాగుతున్న రద్దీ అనంతపురం అగ్రికల్చర్/టౌన్ : కరెన్సీ కష్టాలు కొనసాగుతుండడంతో జనం తల్లడిల్లుతున్నారు. కొద్దిపాటి నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. చాలా అవసరముంది సార్.. కనీసం రూ.4 వేలైనా ఇవ్వండంటూ బ్యాంకర్లను వేడుకుంటున్నారు. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి 15 రోజులు కావస్తున్నా జనం ఇక్కట్లు ఏ మాత్రమూ తగ్గలేదు. పైగా రోజురోజుకూ జఠిలమవుతున్నాయి. మంగళవారం కూడా జిల్లా అంతటా అన్ని బ్యాంకుల వద్ద రద్దీ కొనసాగింది. నగదు కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో కొన్ని చోట్ల బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 36 ప్రిన్సిపల్ బ్యాంకులు ఉన్నాయి. వాటి పరిధిలో 456 బ్యాంకు శాఖలు నడుస్తున్నాయి. 70 -80 శాఖల్లో మాత్రమే రూ.2 వేల చొప్పున నగదు మార్పిడి జరుగుతోంది. అది కూడా ఆయా శాఖల పరిధిలోని ఖాతాదారులకు మాత్రమే ఇస్తున్నారు. ఒకేసారి రూ.24 వేల విత్‌డ్రా ఎక్కడా జరగడం లేదు. చాలాచోట్ల కనీసం రూ.4 వేలు కూడా ఇవ్వలేకపోతున్నారు. అందుబాటులో ఉన్న నగదులోనే కొద్దికొద్దిగా సర్దుబాటు చేస్తున్నారు. అనంతపురంలోని ఎస్బీఐ సాయినగర్ ప్రధానశాఖలో రద్దీ ఏమాత్రమూ తగ్గడం లేదు. ఏటీఎంల పరిస్థితి కూడా మెరుగుపడలేదు. జిల్లా వ్యాప్తంగా ఎస్బీఐ పరిధిలో 150 ఏటీఎంలు ఉండగా, అందులో 35 మాత్రమే పనిచేసినట్లు సమాచారం. మిగతా బ్యాంకుల పరిధిలో 400 వరకు ఉండగా. 70కి మించి పనిచేయలేదు. వాటిలో కూడా రూ.2 వేల నోట్లు మాత్రమే ఉంచడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రూ.100 నోట్లు లేక కొన్ని బ్యాంకులు ఏటీఎం కేంద్రాలను నిరవధికంగా మూసేశాయి. రూ.50, రూ.100 నోట్ల చెలామణి తగ్గుముఖం పట్టడంతో రూ.2 వేల నోట్లకు చిల్లర కొరత తీవ్రంగా వేధిస్తోంది. పాత రూ.500, రూ.1000 నోట్ల డిపాజిట్లకు మాత్రం ఇబ్బంది లేదు. పెళ్లిళ్లు, రైతులకు కొన్ని వెసులుబాట్లను కల్పించినట్లు ఆర్బీఐ చెబుతున్నా.. నగదు సమస్య కారణంగా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. మరోవైపు పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) స్వైప్మిషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. నగదు రహిత లావాదేవీలు ఉంటాయని చెబుతున్నా.. అందులో కూడా ప్రజల నెత్తిన భారం పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తమ్మీద మెజార్టీ ప్రజలు ఉదయం నుంచి రాత్రి వరకు డబ్బు కోసం అన్ని పనులు పక్కనపెట్టి బ్యాంకులకే పరిమితం అవుతున్నారు. ముఖ్యంగా వ్యాపారులు, రైతులు, కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. వెలవెలబోయిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఎప్పుడూ లేనంతగా వెలవెలబోయాయి. పెద్దనోట్ల ప్రభావం ఒకవైపు, మంగళవారం సెంటిమెంట్ మరోవైపు రిజిస్ట్రేషన్ల శాఖను కుదిపేశాయి. అనంతపురం, హిందూపురం జిల్లాల రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మంగళశారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నామమాత్రంగా సాగింది. అనంతపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతి రోజూ 50 నుంచి 60 రిజిస్ట్రేషన్లు జరిగేవి. మంగళవారం ఏడు మాత్రమే జరిగాయి. రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ ఇదే పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లోనూ వందకు మించి రిజిస్ట్రేషన్లు జరగలేదు. బ్యాంకు ఎదుట ఖాతాదారుల ధర్నా అమరాపురం : అమరాపురం సిండికేట్ బ్యాంకు ఎదుట ఖాతాదారులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకే ఇక్కడికి చేరుకున్న తమ్మడేపల్లి, గౌడనకుంట తదితర గ్రామాల రైతులు, మహిళలు రూ.10వేల వరకు విత్ డ్రా చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలంటూ బాంకు అధికారులను కోరారు. రూ.2వేలు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉందని వారు చెప్పారు. దీంతో వారు బ్యాంకు ఎదుట రోడ్డుపై కూర్చొని మధ్యాహ్నం రెండు గంటల వరకు ధర్నా చేపట్టారు. ఫీల్డ్ ఆఫీసర్ తరుణ్, అధికారి బాబ్జీ నచ్చజెప్పినా ఖాతాదారులు వినలేదు. 10 రోజుల నుంచి బ్యాంకుకు వచ్చి వెళుతున్నామని, రూ.2వేలు మాత్రమే ఇస్తే అవసరాలు ఎలా తీరతాయని ప్రశ్నించారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులకు సర్దిచెప్పారు.