ఆదిలాబాద్ : జిల్లాలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవాల్సిన ప్రజలు నగదు కోసం తిప్పలు పడాల్సి వస్తోంది. నోట్ల రద్దు తర్వాత సంవత్సరంపాటు కొనసాగిన కష్టాలు ఈ ఏడాది సంక్రాంతి పండుగకు సైతం అదే పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఏటీఎంలు పని చేయకపోవడంతో నగదు కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. ప్రతి రోజు ఏటీఎం వద్దకు వెళ్తున్న వినియోగదారులు నో క్యాష్ బోర్డు చూసి వెనుదిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వరకు ఏటీఎంలు ఉండగా 20 మాత్రమే పని చేస్తున్నాయి. వాటిలో కూడా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే నగదు ఉండడంతో వినియోగదారులు బారులు తీరుతున్నారు. నగదు కొరతపై అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పండుగ పూట పరేషాన్..
ఎంతో సుఖసంతోషాలతో జరుపుకోవాల్సిన సంక్రాంతి పండగ నోట్ల కష్టాలు తీసుకొచ్చింది. జిల్లాలో వారం రోజుల నుంచి ఏటీఎంలలో నగదు కనిపించడం లేదు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చేతినిండా డబ్బులు ఉండాల్సిన ప్రజలు వాటి కోసం చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితిలో పండుగ చేసుకోవడం గగనంగా మారింది. జిల్లా కేంద్రంలో సుమారు 25 ఏటీఎంలు ఉండగా ఐదారు ఏటీఎంలు మాత్రమే పని చేస్తున్నాయి. ఉదయం నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వినియోగదారులు ఎక్కడ ఏటీఎం పని చేస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎం కార్డు చేతపట్టుకుని తిరుగుతున్నప్పటికీ డబ్బులు లేకపోవడంతో ఇంటికి పండగ సామగ్రి సైతం తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది. బ్యాంకుల్లో సైతం రూ.5 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఇటు ఏటీఎంలలో అటు బ్యాంకుల్లో నగదు సమస్య ఏర్పడడంతో ప్రజల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు..
మూతపడ్డ ఏటీఎంలు..
జిల్లా వ్యాప్తంగా ఏ ఏటీఎం’చూసినా నో క్యాష్ బోర్డులు, షెటర్లు మూసి ఉంచడం కనిపిస్తోంది. సాధారణ రోజుల్లో ఏటీఎంలో నగదు ఉంచిన అధికారులు సంక్రాంతి పండుగకు సరిపడా నగదు ఏర్పాటు చేయాల్సింది పోయి మొత్తానికి ఏటీఎంలు మూసి వేయడం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు నగదు కష్టాలపై స్పందించి ఏటీఎంలలో డబ్బులను అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment