డబ్బు అంతా ఎటుపోయింది? | Cash Problems Going To High In Telugu States | Sakshi
Sakshi News home page

డబ్బు అంతా ఎటుపోయింది?

Published Fri, Apr 20 2018 1:04 AM | Last Updated on Thu, Sep 27 2018 5:03 PM

Cash Problems Going To High In Telugu States - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో రోజురోజుకూ నగదు కొరత పెరిగిపోతోంది. ఏటీఎంలలోనే కాదు బ్యాంకు బ్రాంచీల్లోనూ కరెన్సీ లేక ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. ఎన్నికల ఏడాది కావడమే నగదు కొరతకు ప్రధాన కారణమని, డబ్బుపై ఆధారపడి రాజకీయాలు చేయాలనుకుంటున్న కొన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున డబ్బును దాచేస్తున్నట్టు తమ దగ్గర సమాచారం ఉందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై లోతైన సమాచారం కోసం ఆయా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలతో దగ్గరి సంబంధాలున్న నిర్మాణ, మౌలిక సదుపాయాల సంస్థల ఖాతాలను క్షుణ్నంగా పరిశీలించాలనుకుంటున్నట్టు చెబుతున్నాయి. వారంలో రూ.10 కోట్లు అంతకంటే ఎక్కువ నగదు ఉపసంహరించిన ఖాతాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నట్టు ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఏపీ, తెలంగాణలో నగదు కొరతకు దారితీసిన పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఇద్దరు సీనియర్‌ అధికారుల బృందం పర్యటిస్తోందని.. రిజర్వు బ్యాంకు నుంచి ఎంతెంత డబ్బు విడుదల అయిందన్న వివరాలను వారు సేకరించారని ఆ అధికారి తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా పలుచోట్ల నగదు సమస్య ఉన్నా.. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలలో తీవ్రంగా ఉండటానికి కర్ణాటక ఎన్నికలూ ఒక కారణమని సీబీఐ భావిస్తోంది. ఈ మేరకు కొన్ని ప్రధాన ప్రైవేట్, కార్పొరేట్‌ సంస్థల ఆర్థిక కార్యకలాపాలపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు బ్యాంకుల నుంచి భారీగా నగదు ‘బ్లాక్‌’అయిందన్న వార్తల నేపథ్యంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. చెన్నైకి చెందిన ఓ సీనియర్‌ అధికారి.. భారీగా నగదు ఉపసంహరించిన బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని హైదరాబాద్‌లోని రిజర్వుబ్యాంకు కార్యాలయాన్ని కోరినట్టు తెలిసింది. 

ఏపీ తెలంగాణలోనే ఎక్కువ ‘బ్లాక్‌’! 
నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ ఎత్తున కరెన్సీ నోట్లు ‘బ్లాక్‌’అయ్యాయని రిజర్వు బ్యాంకు సందేహిస్తోంది. రాష్ట్రాలకు పంపిణీ చేసిన నగదు మొత్తంలో.. తెలుగు రాష్ట్రాలకే ఎక్కువగా సరఫరా చేసినట్టు ఆర్‌బీఐ చెబుతోంది. 2016 నవంబర్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు హైదరాబాద్‌ ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయానికి రూ.1,38,691 కోట్లు పంపింది. అందులో తెలంగాణకు రూ.75,245 కోట్లు, ఏపీకి రూ.63,446 కోట్లు పంపిణీ చేసింది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు చెలామణిలో ఉన్న డబ్బుకు మించి నగదు సరఫరా అయిందని ఆర్‌బీఐ లెక్కలేసుకుంటోంది. మరోవైపు నెలకోసారి నగదు కొరత ఉన్నట్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తుండటంతో ఆర్‌బీఐ సైతం తల పట్టుకుంటోంది. భారీ ఎత్తున రూ.2000 నోట్లు అక్రమంగా నిల్వ చేసి ఉంటారనే అనుమానాలున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు, నేతలు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేసుకున్నారు. ఇప్పటికే కొన్ని బ్యాంకు బ్రాంచీల నుంచి వందల కోట్లను డ్రా చేసుకున్నట్లుగా ఆర్‌బీఐకి సమాచారముంది. ఏయే ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో నగదు డ్రా అయింది.. అక్కడి బ్యాంకు మేనేజర్ల ప్రమేయమేమిటనేది.. ఆర్‌బీఐ ఆరా తీస్తోంది. పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో మే నెలలో ఎన్నికలు జరుగునున్నాయి. గత నెలలోనే ఈ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచే నోట్ల కొరత తీవ్రతరమైంది. ఏప్రిల్‌ ఒకటో తేదీకి ముందే∙ఏటీఎంలన్నీ ఆనూహ్యంగా ఖాళీ అయ్యాయని, పోటా పోటీగా బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను ఉపసంహరించినట్లుగా అర్థమవుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి భారీ మొత్తమే కర్ణాటక ఎన్నికలకు తరలించినట్లుగా ప్రచారం జోరందుకుంది.  
 
విషమించిన పరిస్థితి.. 
‘రోజురోజుకు నోట్ల కొరత పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 80 శాతానికిపైగా ఏటీఎంలు మూతపడ్డాయి. బ్యాంకుల్లో నగదు నిల్వలు అడుగంటాయి. వచ్చే నాలుగైదు రోజుల్లో ఏటీఎంలలో డబ్బులు నింపకపోతే.. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుంది..’’.. రాష్ట్రంలోని బ్యాంకర్లు రిజర్వు బ్యాంకుకు నివేదించిన తాజా సమాచారమిది. ఏపీ, తెలంగాణల్లో జనం నగదు నిల్వ చేసుకుంటున్నారని.. బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేందుకు ముందుకు రాకపోవటమే నోట్ల కొరతకు ప్రధాన కారణమని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. ఏటీఎంలలో నోక్యాష్‌ బోర్డుల కారణంగా బ్యాంకులపై నమ్మకం పోతోందని, డబ్బు లేదనే ప్రచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందని.. అందుకే అవసరమున్నా లేకున్నా నగదు విత్‌డ్రా చేసి, నిల్వ చేసుకుంటున్నారని స్టేట్‌ బ్యాంకుకు చెందిన ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అందువల్లే నోట్ల కొరత రోజురోజుకు విషమిస్తోందని పేర్కొన్నారు. గతేడాది నోట్ల రద్దు నిర్ణయం అమలుకు ముందు రాష్ట్రంలో నెలసరి సగటు నగదు ఉపసంహరణ రూ.2,000గా ఉండేది. ఇప్పుడీ సగటు ఉపసంహరణ రూ.4,500కు చేరిందని బ్యాంకర్లు రిజర్వు బ్యాంకుకు నివేదించారు. 
 
ఏటీఎంలన్నీ బంద్‌.. 
తెలంగాణలో మొత్తంగా 8,700 వరకు ఏటీఎంలున్నాయి. అందులో 48 శాతం ఏటీఎంలు అనధికారికంగా బంద్‌ అయ్యాయి. మిగతా 52 శాతం ఏటీఎంలు తెరిచి ఉన్నా.. వాటిలో నోక్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అటు బ్యాంకుల్లోనూ డబ్బులు లేవు. రూ.10 వేలకు మించి నగదు ఇవ్వలేమంటూ స్టేట్‌ బ్యాంకు బ్రాంచీలు చేతులెత్తేస్తుండటం గమనార్హం. దీంతో సరిపడేంత నగదు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆర్‌బీఐకి లేఖ రాశారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా తగినంత నగదు పంపిణీ చేయాలని ఆర్‌బీఐని కోరింది. నాలుగైదు రోజుల్లో ఏటీఎంలు తెరవకపోతే.. పరిస్థితి మరింత చేయి దాటిపోతుందని రాష్ట్ర బ్యాంకర్లు బుధవారం ఆర్‌బీఐకి నివేదించినట్టు తెలిసింది. 
 
ఆర్‌బీఐ ఆధ్వర్యంలో నగదు నిర్వహణ కమిటీ 
రిజర్వుబ్యాంకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రూ.2,000 కోట్ల నగదును ముంబై నుంచి ప్రత్యేకంగా విమానంలో పంపించింది. రైతుల అవసరాల దృష్ట్యా ఆ నగదును గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచీలకు చేర్చాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఈ నగదు బ్యాంకు చెస్ట్‌లలో అందుబాటులో ఉంది. అయితే అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఆ నగదును ఏటీఎంలలో భర్తీ చేయడంపై ఆర్‌బీఐ దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేకంగా నగదు నిర్వహణ కమిటీ (క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ) వేయాలని గురువారం రాత్రి నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి రాష్ట్రంలోని ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండేలా తగిన ఏర్పాట్లు చేసే బాధ్యతను ఆ కమిటీకి అప్పగించింది. నెలాఖరుకల్లా రాష్ట్రంలోని 80 శాతం ఏటీఎంలు నిత్యం నగదు అందించే స్థాయిలో ఉంచాలని ఆదేశించింది. ప్రధాన బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆర్‌బీఐ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement