మళ్లీ మొదటికొచ్చిన నగదు సమస్య
= ఏటీఎంల్లో నగదు లేక ఖాతాదారుల ఇబ్బందులు
= నగదు డ్రా కోసం వెళ్తే పది రూపాయల కాయిన్స్ ఇస్తున్న బ్యాంకర్లు
కంభం : బ్యాంకుల్లో సరిపడా నగదు లేక.. ఏటీఎం సెంటర్లు పనిచేయక ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో 11 ఏటీఎం సెంటర్లు ఉన్నా నగదు లేక అవి నిరుపయోగంగా ఉన్నాయి. నెల రోజులుగా ఒకటి.. రెండు ఏటీఎం సెంటర్లు మినహా మిగిలిన ఏటీఎంలు పని చేసిన దాఖలాలు లేవు. అవి కూడా అప్పుడప్పుడు మాత్రమే పని చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం బ్యాంకుల్లో నగదు అందుబాటులో లేదు. కేవలం కొద్ది మొత్తంలో నోట్లు ఉండగా మిగిలిన వారికి పది రుపాయల కాయిన్స్ ఇస్తున్నారు. దీంతో ఖాతాదారులకు కొత్త చిక్కు వచ్చి పడింది. రూ.10 వేలు, రూ.20 వేలు విత్‌డ్రా తీసుకున్న వారు ఆ కాయిన్లు తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి వరకూ నోట్లను చిల్లరగా మార్చుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడేమో చిల్లరను నోట్లుగా మార్చుకోవాల్సి వస్తోంది. దుకాణాల్లో ఎక్కువ చిల్లర ఇస్తే తీసుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. బ్యాంకులతో పాటు ఎస్‌బీఐ ఖాతాదారుల సేవా కేంద్రాల్లో సైతం పది రుపాయల కాయిన్స్ విత్‌డ్రాగా ఇస్తున్నారు.
నగదు అవసరమై గురువారం బ్యాంకుకు వెళ్లి రూ.20 వేలు విత్‌డ్రా చేసా. అన్నీ పది రూపాయల కాయిన్స్ ఇచ్చారు. దాదాపు పది కేజీల పైన బరువు ఉన్నాయి. వీటిని ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదు. --- చెన్నకేశవులు, కంభం
బ్యాంకులో నగదు అందుబాటులో లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉంది. నగదు ఉన్నంత వరకూ ఇచ్చేస్తున్నాం. పది రూపాయల కాయిన్లు కొంతమేర ఉండటంతో వాటిని ఖాతాదారులకు అందిస్తున్నాం. --- రాఘవులు, ఎస్‌బీఐ మేనేజర్, కంభం