ఏటీఎంలు ఎంత భద్రం? | No Security At ATM Centers In Mahabubnagar | Sakshi
Sakshi News home page

ఏటీఎంలు ఎంత భద్రం?

Published Thu, Dec 12 2019 10:43 AM | Last Updated on Thu, Dec 12 2019 10:43 AM

No Security At ATM Centers In Mahabubnagar - Sakshi

ప్రతీకాత్మక చిత్రo

ఉమ్మడి జిల్లాలోని 250 బ్యాంకుల పరిధిలో 500 ఏటీఎం వరకు ఉన్నాయి. ఇందులో కొన్ని ఏటీఎంలకు మాత్రమే ఒక్కో సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. ఈ లెక్క చాలు ఏటీఎంల భద్రత డొల్లతనానికి కొన్ని బ్యాంకులకు అయితే సెక్యూరిటీ సిబ్బంది లేరు. జిల్లాలోని కొన్ని ఏటీఎంలకు భద్రతా ప్రమాణాలు లేని అద్దె సెంటర్లలో నడిపిస్తున్నారు. గతంలో ఏటీఎంలలో చోరీలు జరిగినప్పుడు భద్రత పెంచుకోవాలని పోలీసులు సూచించినా మార్పు రాలేదు. ఖర్చు భారమనే సాకుతో బ్యాంకర్లు పట్టించుకోవడం లేదు.

సాక్షి, మహబూబ్‌నగర్‌  : ఏటీఎంల వద్ద రక్షణ లేకుండాపోతుంది. ఫలితంగా దొంగతనాలు జరగడంతోపాటు డబ్బులు డ్రా చేసుకోవడానికి వచి్చన వారికి సైతం భద్రత కరువైంది. దీంతో ఏ ఏటీఎం వద్ద ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బ్యాంకులు నగదు ఉంచుతున్నాయే గాని.. వాటి దగ్గర రక్షణ కోసం అవసరమైన సెక్యూరిటీ గార్డులను నియమించడంలో పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. దీంతో కొందరు దుండగులకు ఇవి మరోరకంగా ఉపయోగపడుతున్నాయి. మూడురోజుల కిందట జిల్లాకేంద్రంలోని రాజేంద్రనగర్‌ ఎస్‌బీఐ ఏటీఎంలో ఇద్దరు దొంగలు చోరీకి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ విషయం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగలు ఏటీఎం సంచరిస్తున్న వీడియో ప్రస్తుతం వాట్సాప్‌ గ్రూప్‌లలో వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో ఏటీఎంలలో దోపిడీ యత్నాలు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏటీఎం వద్ద భద్రతపై ప్రత్యేక కథనం.. 

రూపాయి రూపాయి పొదుపు చేసుకోవడానికి పేదవారి నుంచి సంపన్న వర్గాల దాకా బ్యాంకింగ్‌ వ్యవస్థను నమ్ముకుంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 45 లక్షల మంది జనాభా ఉంటే అందులో 5 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు పొదుపు చేస్తున్నారు. అలాగే బ్యాంకుల్లో దాదాపు 30 లక్షల మంది ఖాతాదారులు నగదు పొదుపు చేస్తున్నారు. ఏటీఎంలలో, బ్యాంకులలో ప్రజాధనానికి రక్షణ కలి్పంచాల్సిన బ్యాంకుల ఎంత సురక్షితమనేది ఇప్పుడు.. ఖాతాదారుల్లో ఈమాత్రం భయాందోళనలు సహజమే. ఏటీఎంలు వచ్చాక ఇంట్లో.. జేబుల్లో నగదు నిల్వ చేసుకోవడం మరిచిపోయారు. అందుకే దొంగలు సైతం తమ పంథా మార్చుకున్నారు. ఇళ్లలో నగదు లభించదని గుర్తించి ఏకంగా ఏటీఎంలు లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. బ్యాంకులపై ఆధారపడుతున్న ఖాతాదారుల సంఖ్య పెరిగిన కొద్దీ కరెన్సీ ఖజానాకు భద్రత కలి్పంచాల్సిన బ్యాంకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. శిక్షణ పొందిన భద్రత సిబ్బందిని నియమించడంలో కాసింత వెనుకడుగు వేస్తున్నాయి. 

ఉమ్మడి జిల్లాలో ఇలా.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 250 బ్యాంకులున్నాయి. ఆయా బ్యాంకుల్లో రోజుకు రూ.200 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. అదేవిధంగా జిల్లాలో అన్ని బ్యాంకుల బ్రాంచీలకు సంబంధించిన ఏటీఎంలు దాదాపు 500 వరకు ఉన్నాయి. ఆర్‌బీఐ నిబంధన ప్రకారం ప్రతి బ్యాంకులో ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది, ప్రతి ఏటీఎం సెంటర్‌ వద్ద ఇద్దరు సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని నిబంధనలో ఉన్నా కొన్నిచోట్ల ఒక్కరూ ఉండటం లేదు. 
ప్రైవేట్‌ ఏజెన్సీకి

అప్పగింత 
ఉమ్మడి జిల్లాలోని అన్ని బ్యాంకుల వారి ఏటీఎంలో నగదు నిల్వ చేయడానికి ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించింది. ఏటీఏం సెంటర్ల దగ్గర ఈ ఫ్రైవేట్‌ ఏజెన్సీ వాళ్లే సెక్యూరిటీ వాళ్లను ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకు వారు పేర్కొంటున్నారు. వీరు మాత్రం బ్యాంకు వాళ్లే ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలంటున్నారు. వీరిద్దరి మధ్య రాజీలేక ప్రజల సొమ్ముకు భద్రత లేకుండాపోతోంది. పట్టణ ప్రాంతాల్లో కాకుండా శివారు ప్రాంతాల్లో ఉండే ఏటీఎంలలో భారీస్థాయిలో నగదు తీసుకునే సమయంలో ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. 

కార్డుదారులకెంత రక్షణ.. 
జిల్లాలో ఏటీఎం కార్డుదారులకు బ్యాంకు ఖాతాల సంఖ్యను మించిపోయారు. ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు ఏటీఎం కార్డుల్ని వినియోగిస్తున్నారు. డెబిట్, క్రెడిట్‌ కార్డులతో బ్యాంకులు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయితే కేవలం అత్యవసర సమయంలో మాత్రమే కాకుండా ఎప్పుడు నగదు అవసరమైతే అప్పుడు ఏటీఎంలను ఆశ్రయించడం పరిపాటి. కానీ వీటిలో అందె రక్షణ చర్యలు కార్డుదారుల ప్రాణలమీదకి తెచ్చే ప్రమాదం లేకపోలేదు. జిల్లా కేంద్రంలో ఉన్న పలు ఏటీఎంలను ఉదాహరణగా తీసుకుంటే.. లోపల కేవలం సీసీ కెమెరాలు మాత్రమే ఉంటాయి. అవి కూడా పలు సందర్భాల్లో పని చేయవు. ఇక ఏటీఎంల బయట సెక్యూరిటీ వ్యవస్థ ఉండనే ఉండదు. 

పాలమూరు జిల్లాకేంద్రంలో.. 
పాలమూరు పట్టణంలో ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, ఆంధ్రాబ్యాంకు, ఐసీఐసీఐ, యాక్సిస్, ఇండియాన్‌ బ్యాంకు, యూనియన్, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర, బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు తదితర 80 బ్యాంకుల బ్రాంచిలు ఉన్నాయి. ఆ బ్యాంకుల పరిధిలో 27 ఏటీఎం సెంటర్లు పనిచేస్తున్నాయి. ఇందులో ఎస్‌బీఐ ఏటీఎంలు 13, ఆంధ్రాబ్యాంకు 5, ఇండియన్‌ 2, యాక్సిస్‌ 3, ఐసీఐసీఐ 2, ఒక్కో బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలు ఉన్నాయి. పట్టణం చివరగా ఏర్పాటు చేసిన కొన్ని ఏటీఎంలలో సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో భారీగా నగదు జమ చేసినప్పుడు భద్రత ఉండటం లేదు. ఏటీరెం సెంటర్లు బ్యాంకర్ల పరిధిలో కాకుండా ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించడంతో అసలు సమస్య తలెత్తుతోంది. 

ఏజెన్సీ వాళ్లు చూసుకోవాలి.. 
జిల్లాకేంద్రంలో ఉన్న పలు ఏటీఎం సెంటర్లను ఏజెన్సీ వాళ్లకు అప్పగించాం. వాటిలో డబ్బులు వేయడం, ఇతర వ్యవహారాలు అన్నీ వారే చేస్తున్నారు. ఏటీఎం దగ్గర సెక్యూరిటీలను ఏర్పాటు చేయడం కూడా ఏజెన్సీ వాళ్లే చూసుకోవాలి. 
– కృష్ణమూర్తి, ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్, మహబూబ్‌నగర్‌ 

పెట్రోలింగ్‌ చేస్తున్నాం.. 
బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో పలుమార్లు పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తున్నారు. ప్రధానంగా బ్యాంకుల నుంచి ఆయా ఏటీఎం సెంటర్లలో సీసీ కెమెరాలు, రక్షణ కోసం సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలి. పోలీస్‌ శాఖ నుంచి రక్షణ చర్యలు తప్పక ఉంటాయి. 
– వెంకటేశ్వర్లు, ఏఎస్పీ, మహబూబ్‌నగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement