బ్యాంకర్లపై సీఎం అసహనం
అమరావతి: పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన పరిస్థితులను చక్కదిద్దడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. బ్యాంకర్లు, అధికారులతో జరిపిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ మూడు వారాలు గడిచినా ఇప్పటికీ ఏటీఎంలు, బ్యాంకుల ముందు నిలబడి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతునే ఉన్నారన్నారు. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు ఉదయం, సాయంత్రం సమీక్షిస్తున్నా బ్యాంకర్ల సహాయ నిరాకరణ, వైఫల్యం వల్ల ప్రజల దృష్టిలో నిస్సహాయులుగా మిగిలిపోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా చిన్న నోట్ల పంపిణీ జరగడం లేదని, ఏపీ నుంచి డిపాజిట్లు పెద్ద ఎత్తున జమ అవుతుండగా నగదు ఉపసంహరణకు మాత్రం చాలా తక్కువ మొత్తాన్ని కేటాయిస్తున్నారని అన్నారు. 20 రోజులైనా బ్యాంకర్ల దగ్గర సెంట్రల్ సర్వర్ నుంచి కచ్చితమైన సమాచార లభ్యత లేదని, అన్ని బ్యాంకుల్ని సమన్వయం చేసుకోవాల్సిన ఆర్‌బీఐ ఈ కీలక సమయంలో ప్రధాన భూమిక పోషించాలని, అది జరగడం లేదని సీఎం అన్నారు. ఈ ఉదాశీనతను ఇక సహించేది లేదన్నారు.
రోజూ నిర్వహిస్తున్న అత్యవసర సమావేశాలకు లీడ్ బ్యాంకర్లే సక్రమంగా రావడంలేదు... వచ్చిన ప్రతినిధుల దగ్గర కచ్చితమైన సమాచారం ఉండటంలేదు.. డేటా లేనప్పుడు సమీక్షలు నిర్వహించి ప్రయోజనం ఏమిటి అని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్ మిషన్‌ల అందుబాటు, చిన్న నోట్ల అందుబాటులో రియల్‌టైం డేటా ఇవ్వడం లేదని సీఎం అన్నారు. కాగా, ఈ రోజు రాష్ట్రంలో 500 నోట్లు రూ. 95 కోట్లు వరకు ఉన్నాయని, వంద నోట్లు 62 కోట్లు, 2000 నోట్లు 1320 కోట్లు, 20 రూపాయల నోట్లు 8 కోట్లు, 10 రూపాయల నోట్లు రూ.2.6 కోట్లు ఉన్నాయని ముఖ్యమంత్రికి బ్యాంకర్లు వివరించారు.