ఇకపై నగదు రహిత లావాదేవీలు
- బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు
- పింఛన్లు సహా లావాదేవీలన్నీ కార్డుల ద్వారానే
- రాబోయే రోజుల్లో మొబైల్ బ్యాంకింగ్‌కు మళ్లాలి
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు: నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. దీనికోసం విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, నరేగా సూపర్‌వైజర్లను వినియోగించుకోవాలన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలను పెంచేందుకు ఆర్‌బీఐకి, కేంద్రానికి ఐదు సూచనలతో లేఖ రాయనున్నట్లు తెలిపారు. స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)తో సోమవారం సీఎం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికీ బ్యాంకు అధికారుల నుంచి వాస్తవ సమాచారం రావడం లేదన్నారు. ఆన్‌లైన్, కార్డులపై వసూలు చేస్తున్న సర్వీసు చార్జీలను డిసెంబర్ 30 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకులే చార్జీలు తగ్గించాలన్నారు. ఫిజికల్ కరెన్సీ కంటే డిజిటల్ కరెన్సీ వినియోగంపై చార్జీలు తక్కువ ఉండాలని, ఇందుకు అనుగుణంగా బ్యాంకులు, సర్వీసు ప్రొవైడర్లు చర్యలు తీసుకోవాలన్నారు.
వచ్చే నెల నుంచి ఖాతాల్లోనే పెన్షన్లు
వచ్చే నెల నుంచి వృద్ధాప్య, వింతతు పెన్షన్లను నేరుగా బ్యాంకు ఖాతాలకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందరికీ రూపే కార్డులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. త్వరలో రైతుబజార్లు, పెట్రోల్‌బంకులు, సినిమాహాళ్లు వంటి వాటిల్లో కూడా కార్డుల ద్వారానే లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి మరింత నగదు వస్తుందన్న నమ్మకం లేదని.. ఇదే పరిస్థితి కొనసాగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు విశ్వాసం కోల్పోతారని సీఎం అన్నారు.
మొబైల్ బ్యాంకింగ్‌వైపు మళ్లండి
రాబోయే రోజుల్లో ప్రజలు మొబైల్ బ్యాంకింగ్‌వైపు మొగ్గుచూపాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పోలవరం కుడి కాలువ గట్టుపై ఏపీ జెన్‌కో నెలకొల్పిన ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.2 వేల నోటు వల్ల ప్రయోజనం లేదన్నారు. వ్యవసాయంవల్ల ఎక్కువ ఆదాయం రాదని, అందువల్ల అనుబంధ పరిశ్రమలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
మద్యం దుకాణాల్లో స్వైప్ యంత్రాలు..
రాష్ట్రంలో మద్యం దుకాణాల్లోనూ స్వైప్ యంత్రాలను అందుబాటులో ఉంచుతామని బాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన ఆయన.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు ఇబ్బందులు ఎదుర్కొనేందుకు క్యాష్, రూపీ, మొబైల్ బ్యాంకింగ్ వంటి మూడు విధానాలను అమలు చేస్తున్నామన్నారు. డిసెంబర్ 10న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంక్రీటు పనులను ప్రారంభించనున్నామని చెప్పారు. కాగా, బ్యాంకుల పరిమితులు, ఏటీఎంలలో నగదు లేక జనం ఇబ్బంది పడుతుంటే.. పింఛన్లు సహా అన్ని లావాదేవీలు బ్యాంకుల ద్వారా నిర్వహిస్తామని సీఎం చెప్పడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.