‘లక్షల్లో రుణాలు మిమ్మల్ని ఎవరిమ్మన్నారు. మీరు ఇష్టమొచ్చినట్టు ఇవ్వడం వల్లే ఇప్పుడు రుణమాఫీ అమలు చేయలేకపోతున్నా..ఈసారి స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే ఇవ్వండి..లేకుంటే మీకే ఇబ్బంది.’ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇవీ..
మీ అవసరాల కోసం ఇష్టమొచ్చినట్టుగా రుణాలు తీసుకుంటారు..ఇప్పుడు బకాయిలు చెల్లించమంటే నోరెళ్లబెడతారు..మాఫీ వంకతో బకాయిలు చెల్లించడం లేదు..మీకు కొత్త రుణాలు కావాలా? జిల్లాలో ఓ బ్యాంకరు రైతులనుద్దేశించి అన్న మాటలు.
సాక్షి, విశాఖపట్నం: ఇవి చాలు అన్నదాతల పట్ల ప్రభుత్వానికి..బ్యాంకర్లకు ఉన్న దృక్పథాన్ని అర్థం చేసుకోడానికి. ఎన్నికల్లో రూ.87వేల కోట్ల రుణాలు వడ్డీతో సహా మాఫీ చేస్తానంటూ రైతులను నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక సవాలక్ష నిబంధనలతో ఆ మాఫీ కాస్తా ఐదువేల కోట్లకు కుదించేశారు. మాఫీ మాట దేవుడెరుగు..కొత్త రుణాలైనా ఇప్పించండి మహాప్రభో అంటే బకాయిల సాకుగా చూపి ఆ ఒక్కటీ అడగొద్దంటూ బ్యాంకర్లు ముఖం చాటేస్తున్నారు.
దీంతో జిల్లాలో రానున్న సీజన్‌లో రుణాలు విరివిగా మంజూరు చేసే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద వ్యవసాయ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ ఉన్నా అప్పులిచ్చేవారు..స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్‌తో సంబంధం లేకుండా ఇంటిలో ఎవరి పేరునైనా సరే విరివిగా రుణాలిచ్చేవారు. వ్యవసాయ అవసరాల నిమిత్తం అంటూ బంగారం కుదవ పెట్టి అప్పులడిగితే ఆభరణాల విలువలో 75 శాతం మొత్తం రుణాలుగా ఇచ్చేవారు. వీటిపై 33 పైసలు మాత్రమే వడ్డీ వసూలు చేసేవారు.
కానీ ఇప్పుడు వ్యవసాయ అవసరాల కోసమని ఎవరైనా అప్పు కోసం బ్యాంకుకు వెళితే మేనేజర్లు పెడుతున్న ఆంక్షలు రైతులకు దిమ్మతిరిగిపోతుంది. నువ్వు రైతువా?నీకు భూమిఉందా? నీపేరు మీదే ఉందా? నీకు ఏ బ్యాంకులోనైనా అప్పు ఉందా? ఉంటే ఎంత? ఎంత చెల్లించావు? ఇంకా ఎంత చెల్లించాలి? అంటూ సవాలక్ష ప్రశ్నలు వేస్తున్నారు. తన భార్య పేరు మీద భూమిఉందని చెబితే అయితే ఆమెనే తీసుకురా..ఆమె పేరుమీదే రుణం ఇస్తాం.. నువ్వు అడిగినంత ఇవ్వలేం. స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే ఇస్తామని తెగేసి చెబుతున్నారు.
ఇక వ్యవసాయ అవసరాల కోసం భూమి పత్రాలతో పాటు బంగారం కుదువపెట్టి రుణం అడిగితే నీకు ఎకరం భూమి ఉండి.. కిలో బంగారం తీసుకొచ్చినా సరే గతంలో మాదిరి బంగారం విలువలో 75 శాతం మేర వ్యవసాయ రుణంగా ఇవ్వలేం. బంగారు రుణాలకు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే ఎకరాకు 24వేలకు మించి ఇవ్వలేమని చెబుతున్నారు. అంతకుమించి కావాలంటే బంగారాన్ని కుదవపెట్టుకుని రూపాయికి పావలా వడ్డీకి రుణాలిస్తామే తప్ప వ్యవసాయ రుణం పేరిట ఇవ్వలేమంటున్నారు.
పైగా భూ మి, బంగారం తనదై ఉండాలంటూ మెలిక పెడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఖరీఫ్‌లో రూ.650 కోట్లు, రబీలో రూ.312 కోట్ల రుణం ఇ వ్వాలని నిర్ణయిస్తే రుణమాఫీ పుణ్యమా ని అతికష్టం మీద ఖరీఫ్‌లో రూ.342 కోట్లు, రబీలో రూ.204కోట్ల మేర రుణాలివ్వగలిగారు. రానున్న 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్‌లో రూ.800కోట్లు, రబీలో రూ.300కోట్ల చొప్పున జిల్లాలో రైతులకు రూ.1100కోట్ల మేర రుణాలివ్వాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. కానీ రుణామాఫీ భూతం వెన్నాడుతున్నందున రానున్న వ్యవసాయసీజన్‌లో కూడా యాక్షన్ ప్లాన్‌కు తగ్గట్టుగా రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చునని అధికారులే అంగీకరిస్తున్నారు.
ఆ ఒక్కటీ అడగొద్దు
Published Mon, Mar 2 2015 2:55 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement