వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు మంజూరు చేయాలి
విజయవాడ, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు మంజూరు చేయటంలో అధిక ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బ్యాంకు అధికారులను కోరారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన బ్యాంకు అధికారులు, సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రస్తుతం మంజూరు చేస్తున్న రుణాలను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రబీపంటను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే రైతులకు రుణాలు మంజూరు చేయటానికి కసరత్తు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు త్వరితగతిన రుణాలను మంజూరు చేయాలన్నారు. పెద్ద నోట్లు రద్దు అనంతరం గత నెల రోజులుగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి బ్యాంకులకు వచ్చిన నగదు, ఎంత మొత్తం డిపాజిట్ అయింది, ఏటీఎంలలో ఎంత మొత్తం పంపిణీ జరిగిందనే సమాచారాన్ని ఇవ్వాలని బ్యాంకు అధికారులను మంత్రి కోరారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ జిల్లాలో నగదు రహిత చెల్లింపులపై చేపట్టిన చర్యలను వివరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్, పి.జె.చంద్రశేఖర్, బి.నాగేశ్వరరావు, ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, కనకదుర్గగుడి ఈవో సూర్యకుమారి, సబ్‌కలెక్టర్ సలోని సిదాన, ఎల్.డి.ఎం. జి.వెంకటేశ్వరరెడ్డి వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.