minister uma
-
ఉమావి కక్ష సాధింపు రాజకీయాలు
-
ఉమావి కక్ష సాధింపు రాజకీయాలు
ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మండిపడ్డారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ నాయకులు సామినేని ఉదయభాను, రోజాలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. నందిగామ పర్యటనలో అసలు ఎక్కడైనా గొడవలు జరిగాయా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా అని అడిగారు. జగన్‌పై ఇష్టారాజ్యంగా మాట్లాడిన టీడీపీ నేతల మీద కేసులు ఎందుకు పెట్టలేదని, చట్టం మీకు చుట్టమా అని ఆయన నిలదీశారు. -
ప్రకాశం బ్యారేజీ పటిష్టతకు కృషి
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ రెండోసారి నిర్మాణం జరిగి 60 ఏళ్ళైందని, దీన్ని మరో వందేళ్లు పటిష్టంగా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. 60 వసంతాలు పూర్తియిన నేపథ్యంలో శనివారం మంత్రి బ్యారేజ్ వద్ద ఉన్న స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న బ్యారేజ్ పటిష్టపర్చటానికి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేసి అమరావతికి తలమానికంగా తీర్చిదిద్దుతామన్నారు. 60 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా బ్యారేజ్ సమీపంలో రైతులతో పండుగ మాదిరి ఉత్సవాన్ని నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కార్యక్రమంలో మంత్రితోపాటు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. -
వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు మంజూరు చేయాలి
విజయవాడ, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు మంజూరు చేయటంలో అధిక ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బ్యాంకు అధికారులను కోరారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన బ్యాంకు అధికారులు, సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రస్తుతం మంజూరు చేస్తున్న రుణాలను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రబీపంటను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే రైతులకు రుణాలు మంజూరు చేయటానికి కసరత్తు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు త్వరితగతిన రుణాలను మంజూరు చేయాలన్నారు. పెద్ద నోట్లు రద్దు అనంతరం గత నెల రోజులుగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి బ్యాంకులకు వచ్చిన నగదు, ఎంత మొత్తం డిపాజిట్ అయింది, ఏటీఎంలలో ఎంత మొత్తం పంపిణీ జరిగిందనే సమాచారాన్ని ఇవ్వాలని బ్యాంకు అధికారులను మంత్రి కోరారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ జిల్లాలో నగదు రహిత చెల్లింపులపై చేపట్టిన చర్యలను వివరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్, పి.జె.చంద్రశేఖర్, బి.నాగేశ్వరరావు, ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, కనకదుర్గగుడి ఈవో సూర్యకుమారి, సబ్‌కలెక్టర్ సలోని సిదాన, ఎల్.డి.ఎం. జి.వెంకటేశ్వరరెడ్డి వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. -
నెలాఖరులోపు మూడో జోన్‌కు సాగర్ జలాలు
రెడ్డికుంట(రెడ్డిగూడెం) : చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాగర్ మూడవ జోన్ కింద అయకట్టుకు గోదావరి జలాలను సరఫరా చేసి రైతులకు సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చూసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. మండలంలోని రెడ్డికుంటలో ఆదివారం ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెలాఖరులోపు రెండున్నర టీఎంసీలు సాగర్ మూడో జోన్‌కు మైలవరం, నూజివీడు బ్రాంచి కెనాల్‌కు సరఫరా అవుతాయని మంత్రి తెలిపారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నీటి విడుదలకు అంగికారం తెలిపిందని చెప్పారు. సాగర్ జలాలు విడుదలైన వెంటనే సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చెరువులు నింపుకోవాలని సూచించారు.చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులు కూడా రూ.4.909 కోట్లతో ప్రారంభిస్తామని చెప్పారు. ఈ పథకం పూర్తయితే సాగర్ మూడె జోన్ పరిధిలోని అయకట్టుకు నిరంతరం గోదావరి జలాలు సరఫరా అవుతాయన్నారు. అశభావం వ్యక్తం చేశారు. ఉదయం పోలవరం ప్రాజెక్టు గేట్లు డిజైన్‌ను తిరుపతి వేంకటేశ్వరస్వామి పాదాల వద్ద ఉంచి స్వామి వారి అశీస్సులు అందుకున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2018లోపు పూర్తిచేస్తామన్నారు. ఈ సందర్భంగా ధాన్యం మద్దతు ధరను పెంచాలని పలువురు రైతులు అయనను కోరారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ అర్జునరావు, డీఈ శ్రీనివాసరావు, విజయబాబు, విస్సన్నపేట 25వ డీసీ చైర్మన్ నాదెళ్ల చెన్నకేవశరావు తదితరులు పాల్గొన్నారు. -
చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్‌తో సాగునీరు
కంచికచర్ల : పశ్చిమ కృష్ణా మెట్ట రైతులను ఆదుకునేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకం చేపడుతున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. స్వర్గీయ దేవినేని వెంకటరమణ, ప్రణీతల ఘాట్ వద్ద బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు రూ.4900 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ కృష్ణాలోని నందిగామ, మైలవరం, తిరువూరు,నూజివీడు, గన్నవరం నియోజకవర్గంలోని 18 మండలాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందుతుందన్నారు. 410 గ్రామాల్లోని 21 లక్షల జనాభాకు తాగునీటి సౌకర్యం కలుగుతుందన్నారు. దశాబ్దకాలంలో జిల్లాలోని మూడో జోన్‌లోని నాగార్జున సాగర్ ఎడమ, కుడి కాల్వలకు సాగునీరు అందకపోవడంతో ఈ ప్రాంతంలో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నన్నపనేని నరసింహారావు, ఎంపీపీ వేల్పుల ప్రశాంతి, జెడ్పీటీసీ సభ్యుడు కోగంటి బాబు, ఏఎంసీ చైర్మన్ నన్నపనేని లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు. -
ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి
మంత్రి దేవినేని ఉమ కానూరు (పెనమలూరు) : ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కానూరులో జరుగుతున్న ఫొటోట్రేడ్షోలో శనివారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో వచ్చిన నూతన మార్పులను గుర్తించి సమాజానికి మరింత ఉన్నత సేవలు అందించాలని సూచించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, సంఘ అధ్యక్షుడు మాదాల రమేష్, సభ్యులు జానకీరామ్, శ్రీనివాస్, కృష్ణా, గుంటూరు జిల్లాల ఫోటో, వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో తగ్గిన వర్షపాతం
విజయవాడ సెంట్రల్ : ఈ నెలలో రాష్ట్ర సగటు వర్షపాతం బాగా తగ్గిందని జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. పుష్కర భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రకాశం బ్యారేజీ వద్ద 11.1 అడుగుల నీటి మట్టాన్ని ఉంచామని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల్లో సాధారణ వర్షపాతం 111.1 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 21 ఎం.ఎం మాత్రమే నమోదైందని మంత్రి చెప్పారు. జూన్‌లో 97 మి.మీ. కురవాల్సి ఉండగా 153 మి.మీలు, జులైలో 151 మి.మీ. గాను 121 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. నాగార్జున సాగర్ నుంచి కృష్ణా, పోలవరం నుంచి గోదావరి జలాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. డెల్టా కాలువలకు 16 వేల క్యూసెక్కులు కృష్ణాడెల్టాలోని కాల్వలకు నీరు వదిలిన దృష్ట్యా పర్యవేక్షణ కోసం పుష్కర విధుల్లో ఉన్న ఇరిగేషన్, వ్యవసాయశాఖల అధికారుల్ని రిలీవ్ చేసినట్లు పేర్కొన్నారు. డెల్టా చివరి భూముల వరకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 16,001 క్యూసెక్కుల నీటిని కాల్వలకు విడుదల చేసినట్లు తెలిపారు. మేయర్ కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణరావు పాల్గొన్నారు. -
అలమటిస్తున్నా పట్టించుకోరా..
మంత్రి ఉమా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి కృత్తివెన్ను : ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా ఓ చేతకాని దద్దమ్మని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి అన్నారు. శివారు ప్రాంతాలలో ప్రజలు తాగునీటి కోసం అలమటిస్తున్నా పట్టించుకోని ఉమా లాంటి వారికోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని ఎద్దేవా చేశారు. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో తాగు, సాగునీటి కోసం వైఎస్సార్సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం మహాధర్నా నిర్వహించారు. తొలుత పార్టీ కార్యకర్తలు రంగాబొమ్మ సెంటరు నుంచి లక్ష్మీపురం లాకుల వరకు ర్యాలీగా వచ్చారు. లాకుల వద్ద జాతీయ రహదారిపై పార్టీ నేతలతో కలసి బైఠాయించారు. రాష్ట్రంలో కరువు తాండవించడంలో చిత్రమేమి లేదని కరువు, చంద్రబాబు ఇద్దరూ అన్నదమ్ములని ఎద్దేవా చేశారు. రూ.వందల కోట్ల పట్టిసీమ పేరుతో దోపిడీ చేసి ఇప్పుడు గండికొట్టారంటూ చెప్పడం విడ్డూరమన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు కాలువకు గండి కొడితే పట్టుకోలేని చేతకాని తనంలో ప్రభుత్వం ఉందంటూ దుయ్యబట్టారు. పుష్కరాల పేరుతో చంద్రబాబునాయుడు పాలన గాలికి వదిలేశారని విమర్శించారు. తీర ప్రాంతాలలో ఇన్ని నెలలుగా ప్రజలు తాగునీటి కోసం కష్టాలు పడుతుంటే జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు కోటరీలో ఎమ్మెల్యేలు నిమిత్త మాత్రులేనని వీరికి ఎలాంటి ప్రాధాన్యం లేదంటూ సానుభూతి వ్యక్తం చేశారు. పుష్కరాలు ముగిసే లోపు కృత్తివెన్ను మండలంలోని శివారు ప్రాంతానికి నీరివ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామంటూ హెచ్చరించారు. 18 నెలలుగా తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా టీడీపీ నాయకులు పట్టించుకోకపోవడం దారుణమని ఉప్పాల రాంప్రసాద్ అన్నారు. త్వరలో నీరవ్వకపోతే పార్టీ నేతృత్వంలో ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించారు. తరువాత పార్టీ నేతలంతా పల్లెపాలెం, లక్ష్మీపురం, పెదచందాలలో అడుగంటిన తాగునీటి చెరువులను పరిశీలించారు. ధర్నాలో పార్టీ యువజన రాష్ట్ర కార్యదర్శి ఉప్పాల రాము, ఎంపీటీసీల సంఘ జిల్లా కార్యదర్శి పిన్నెంటి మహేష్, పార్టీ మండల కన్వీనర్ జల్లా భూపతిరాజు, సంయుక్త కార్యదర్శి వైధాని వెంకట్రాజు, యువజన మండలాధ్యక్షుడు పులగం రాము, పార్టీ జిల్లా యువజన కార్యదర్శి వెలివెల చినబాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు తిరుమాని శ్రీనివాస్, మండల కార్యదర్శి ముత్యాల రాధాకృష్ణ, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ గూట్ల జయేశ్వరరావు, పార్టీ మండల కార్యదర్శులు కూనసాని రాంబాబు, కొల్లాటి కృష్ణ, నాయకులు గంధం నాగరాజు, దానియేలు, రాయపురెడ్డి శ్రీను పాల్గొన్నారు. -
ఘాట్లలో క్లోరిన్ శాతం తగ్గకుండా చూడండి
అధికారులకు మంత్రి ఉమా ఆదేశం విజయవాడ(మొగల్రాజపురం) : పుష్కరఘాట్ల నీటిలో క్లోరిన్ శాతం తగ్గకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని జలవనరులశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశించారు. కృష్ణవేణి ఘాట్‌ను సోమవారం ఆయన పరిశీలించి భక్తులతో మాట్లాడారు. నదిలో నీరు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో నీటిని అదనంగా విడుదల చేశామన్నారు. కృష్ణవేణి ఘాట్ తనిఖీ పుష్కరాలు జరిగే సమయంలో శానిటేషన్ పనుల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు తప్పవని నగర మేయర్ కోనేరు శ్రీధర్ హెచ్చరించా. కృష్ణవేణి ఘాట్‌ను శనివారం పరిశీలించారు. ఘాట్‌ల్లో పేరుకున్న చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట కార్పొరేటర్లు కోసూరి శైలజ, సుకాసి సరిత, కె.వెంకటేశ్వరరావు, కొండపల్లి అనసూయ, కొటిబోయిన దుర్గాభవాని, బుగతా ఉమామహేశ్వరి ఉన్నారు. -
బ్యారేజ్ వద్ద 11.5 అడుగులు నీటి నిల్వ
మంత్రి దేవినేని ఉమా విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రకాశం బ్యారేజి వద్ద 11.5 అడుగుల నీటి సామర్థ్యానికి చర్యలు చేపట్టామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా చెప్పారు. శనివారం మీడియా సెంటర్లో ఆయన మాట్లాడారు. ఈనెల ఐదో తేదీన ప్రకాశం బ్యారేజ్ వద్ద 5.3 అడుగుల నీరు ఉందని 12వ తేదీన దాన్ని 11.1 అడుగులకు చేర్చామన్నారు. కృష్ణాడెల్టాకు 9083 క్యూసెక్కులు కాల్వలకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అవనిగడ్డ, మచిలీపట్నం, కైకలూరు శివారు ప్రాంతాలకు నీటిని అందిస్తామన్నారు. మెరుగైన సేవలు.. భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు మంత్రి ఉమా చెప్పారు. సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ల ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తున్నారన్నారు. కర్నూలు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, గుంటూరు జిల్లాలో వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పుష్కరాలను సమీక్షిస్తున్నారని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలోని మెట్టప్రాంతానికి చింతలపూడి ఎత్తిపోతల ద్వారా నీటని అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. -
దుర్గాఘాట్‌పై దృష్టి పెట్టండి
అధికారులకు మంత్రి ఉమా ఆదేశాలు వసతుల కల్పనలో అలసత్వంపై కమిషనర్ ఆగ్రహం విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గాఘాట్‌లో పుష్కర పనులపై మంత్రులు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ శుక్రవారం దుర్గాఘాట్‌ను పరిశీలించి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించగా, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఘాట్ పనులపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. దుర్గాఘాట్ పరిస్థితిపై ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురించిన ‘అదిగో పుష్కరం... ఎప్పటికీ పరిష్కారం?’ కథనానికి స్పందించిన మంత్రి దేవినేని ఉమా, మేయర్ కోనేరు శ్రీధర్ ఘాట్‌కు చేరుకుని పనుల తీరుపై అధికారులను ప్రశ్నించారు. రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మోడల్ గెస్ట్‌హౌస్ వద్ద పనులు, దుర్గాఘాట్‌లో రావిచెట్టు వద్ద మట్టికుప్పలను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తామన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ పనులు సాగుతున్నాయన్నారు. దుర్గాఘాట్‌లో మౌలిక వసతులు కల్పించాలి దుర్గాఘాట్, మోడల్ గెస్ట్‌హౌస్‌లో మౌలిక వసతులు కల్పించడంలో ఎందుకు ఆలస్యం అవుతోందని మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గాఘాట్‌ను శుక్రవారం ఆయన సందర్శించి పలు సూచనలు చేశారు. -
ప్రజాసమస్యలు గాలికొదిలిన మంత్రి ఉమా
ఇబ్రహీంపట్నం: మైలవరం నియోజకవర్గం ప్రజాసమస్యలను జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు గాలికొదిలేసి తిరుగుతున్నాడని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గం సమన్వయ కర్త జోగి రమేష్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన గ్రామసభలో అధికార పక్ష ప్రజాప్రతినిధులు పాల్గొనక పోవడాన్ని బట్టి మంత్రి నిర్వాకం బయట పడిందన్నారు. ప్రజాప్రతినిధుల గైర్హాజరుతో జన్మభూమి సభ అభాసుపాలైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన సర్పంచి, జెడ్పీటీసీ, ఎంపీపీ జన్మభూమి సభకు హాజరుకాకపోవటం వెనుక మతలబు ఏమిటని మంత్రిని ప్రశ్నించారు. హైవే బాధితులు, నివాసాలు కోల్పోయిన వారు, స్థానిక ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక, మంత్రి ఉమా ముఖం చాటేశాడని ఎద్దేవాచేశారు. బీసీ ప్రజా ప్రతినిధులకు స్వేచ్ఛ ఇవ్వకుండా మంత్రి ఉమా తన చెప్పు కింద అణగదొక్కుతున్నాడని ఆరోపించారు. ప్రజాప్రయోజనాల కోసం నిర్వహిస్తున్న జన్మభూమి సభను టీడీపీ సభగా మార్చారని ఎద్దేవా చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు హాజరు కాకపోయినా ప్రొటోకాల్ లేని వ్యక్తులు జన్మభూమి వేదికపై సబ్‌కలెక్టర్ సమక్షంలో కూర్చోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన సమస్యలు వివరిస్తున్న వైఎస్సార్ సీపీ, సీపీఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పోలీసుల చర్యలను ఖండించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో మంత్రి ఉమాతో పాటు ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధి చూపాలని హితవు పలికారు. -
చిన్నబుచ్చుకున్న పెద్దరికం
ఇరిగేషన్ ఎస్ఈపై ఊగిపోయిన మంత్రి ఉమా - కిందిస్థాయి సిబ్బంది ఎదుటే అవమానం - అధికారులకు అడుగడుగునా పరాభవం - మంత్రి తీరుతో మనస్తాపం - ఇరిగేషన్ సలహామండలి సమావేశంలో ఉమా ఓవరాక్షన్ సాక్షి, విజయవాడ : మీకు సిగ్గూఎగ్గు లేదా.. ఏం ఎందుకు పనిచేయరు.. నొప్పి ఏమైనా ఉందా.. నేను చెప్పినట్లు వింటే ప్రమోషన్లు.. లేకపోతే కఠిన చర్యలు తప్పవు.. పదేళ్లుగా రూమ్‌లోనే కూర్చుని ధనయజ్ఞం చేశారు.. ఇక మిమ్మల్ని మిట్టమధ్యాహ్నం కాల్వ గట్ల మీద పరిగెత్తిస్తా.. డబ్బులు బొక్కేయడానికి చూస్తున్నారు.. ఏం రామకృష్ణా నీ పెద్దరికాన్ని కాపాడుకో... ఇలా పనిచేస్తే ఏమాత్రం ఊరుకోను! ...ఈ బెదిరింపులు ఏదైనా సంస్థలో చిరుద్యోగులతో పనిచేయించేందుకు అధికారి చేసిన హెచ్చరికలనుకుంటే పొరబడినట్లే. జలవనరుల శాఖలో సుదీర్ఘకాలం అనుభవం ఉన్న ఇంజినీర్లపై తొలిసారిగా మంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలివి. మంగళవారం ఉదయం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జలవనరుల సలహా మండలి సమావేశం కలెక్టర్ బాబు ఎ. అధ్యక్షతన జరుగగా ఆ శాఖ మంత్రి దేవినేని ఉమా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), బోడే ప్రసాద్, తంగిరాల సౌమ్య హాజరయ్యారు. మీడియాను కూడా అనుమతించారు. వీరందరి ఎదుట మంత్రి ఉమా ఇంజినీర్లు మనస్సు నొచ్చుకునే విధంగా హంగామా చేశారు. ఎస్ఈ రామకృష్ణ జిల్లాలోనే వివిధ హోదాల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఆయన కింద పనిచేసే సిబ్బంది ఎదుటే ఏకవచనంలో మాట్లాడుతూ ఆయన పనితీరు బాగోలేదంటూ ఎండగట్టారు. ఆత్మస్తుతి.. పరనింద ఆత్మస్తుతి చేసుకోవడంలో దేవినేని ఉమా ఆయనకు ఆయనే సాటి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆగ్రహం రాకుండా అప్పుడప్పుడు ఆయన్ను స్తుతిస్తుంటారు. సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు కాల్వగట్లపై పడుకుంటున్నారని, తానూ కాల్వగట్లపైనే తిరుగుతున్నానని, రోజుకు 18 గంటలు కష్టపడుతున్నానంటూ గొప్పలు చెప్పుకున్నారు. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో అధికారులు ఏసీ రూమ్లకే పరిమితమై ధనయజ్ఞం చేశారని, ఇక నుంచి వారిని మిట్టమధ్యాహ్నం కాల్వగట్ల వెంబడి పరిగెత్తిస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. అడుగడుగునా అక్షింతలు... కృష్ణాడెల్టా ఆధునీకరణ పనులతోపాటు ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు ఆలస్యం కావడంపై జేఈలు, ఏఈలను నిలబెట్టి అక్షింతలు వేశారు. ప్రతి అంశంలో ఒక్కో అధికారిని లేచి నిలబడి సమాధానం చెప్పండని ఆదేశించారు. రైతు సదస్సుల కోసం ఒక్కొక్క మండలానికి రూ.50వేలు మంజూరయ్యాయని, వాటిని బొక్కేయకుండా ఖర్చు చేయండంటూ మంత్రి వ్యాఖ్యానించారు. సుమారు నాలుగు గంటలపాటు ఈ హైడ్రామా సాగింది. -
టాప్ సీక్రెట్!
మంత్రి ఉమ ఇంటికి వెళ్లిన ఎంపీ కేశినేని నాని ఇద్దరూ కలిసి ఒకే కార్లో ప్రయాణం విజయవాడ : తెలుగుదేశం పార్టీలో వైరి వర్గాలు ఒక్కటయ్యాయా.. ఉన్నట్లుండి ఇరువురు ముఖ్య నేతలు ఒకే కారులో వెళ్లడం వెనుక అంతర్యం ఏమిటీ.. అంటూ సొంత పార్టీ నాయకులే ముక్కునవేలేసుకున్నారు. ఇప్పటివరకు టీడీపీకి చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్‌లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. మంత్రి ఉమ అందరినీ కలుపుకొని వెళ్లాలంటూ ఎంపీ కేశినేని నాని బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పార్టీ క్యాడర్ కూడా రెండుగా విడిపోయి పదవుల కోసం పోటీ పడ్డాయి. దీంతో ఇరువురు కలిసి పని చేయాలంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి హితవు పలికారు. నేరుగా చంద్రబాబు కేశినేనిని ఇంటికి పిలిపించి మరీ చెప్పి పంపించారు. అయినా, కొన్ని సందర్భాల్లో ఎంపీ నాని మాత్రం మంత్రి ఉమ తీరును తప్పుపడుతూనే ఉన్నారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామం వద్ద పైలాన్ విషయంలో మూడు రోజుల క్రితం ఎంపీ, మంత్రి వర్గీయులు బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇరువురు నేతలు శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కలిసి ఉండటం విశేషం. చంద్రాలలో ఆటల పోటీలు ప్రారంభించిన తర్వాత మైలవరంలోని ఆస్పత్రికి వెళ్లి లోకేశ్ జన్మదిన వేడుకల్లోనూ పాల్గొన్నారు. అర్ధగంటపాటు చర్చలు.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేతలు కేశినేని, దేవినేని ఏకంగా ఒకే ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నారు. ఏమి మాట్లాడుకున్నారనేది మాత్రం టాప్ సీక్రెట్. ఎంపీ కేశినేని నాని ఉదయం చంద్రాలలో జరిగే 78 గ్రిగ్ పోటీలు ప్రారంభించేందుకు వెళుతూ గొల్లపూడిలోని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఇంటికి వచ్చారు. ఇద్దరు సుమారు అరగంట పాటు ఇంట్లో మాట్లాడుకున్నారు. ఏమి మాట్లాడుకున్నారనేది మాత్రం వెల్లడి కాలేదు. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రతినిధి ప్రయత్నించగా, మళ్లీ మాట్లాడతామని బదులిచ్చారు. మొత్తంమీద ఈ పరిణామం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. -
సొమ్ము ప్రభుత్వానిది.. సోకు టీడీపీది
⇒ ఇదీ రైతు సాధికారత సదస్సుల ముఖ్య ఉద్దేశం ⇒ ముందుగా గ్రామాల్లో మేళతాళాలతో ప్రదర్శనలు ⇒ సదస్సులో రుణమాఫీ పత్రాల అందజేత ⇒ రుణం మాఫీ కాని రైతులను బుజ్జగించే పని అధికారులదేనంట! ⇒ ఊరూరా కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు ⇒ హడలెత్తుతున్న అధికార యంత్రాంగం విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు సాధికారత సదస్సులు గురువారం నుంచి అట్టహాసంగా ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అధికార పార్టీ భారీ ప్రణాళిక, పక్కా వ్యూహంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రధానంగా రుణమాఫీపై పెద్ద ఎత్తున ప్రచారం చేసి రైతుల్లో వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. గ్రామగ్రామాన ప్రజాప్రతినిధులు అధికార పార్టీ నేతలతో మేళతాళాలు, మిఠాయిల పంపిణీ వంటి హంగామ చేయించనుంది. ప్రభుత్వ ఖర్చుతో అధికార పార్టీ సొంత ప్రచారం చేసుకుంటోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే... రుణమాఫీ విషయంలో రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు ప్రతి గ్రామంలో రైతు సాధికారత సదస్సులు నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రుణమాఫీకి సంబంధించి ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా అధిగమించాలనే దానిపై నిర్ధిష్టమైన ప్రణాళికనూ ప్రభుత్వమే రూపొందించింది. ఇందులో భాగంగా బుధవారం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని ఎంపీడీవోలు, తహశీల్దార్లు, వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడు గంటల పాటు జరిగిన కాన్ఫరెన్స్‌లో సదస్సుల్లో అధికారులు నిర్వహించాల్సిన ముందస్తు వ్యూహాన్ని వినిపించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి దేవినేని ఉమా నాయకత్వం వహించడం గమనార్హం. రుణ ఉపసంహరణ పత్రాలు, పింఛన్ల పంపిణీ, ఇసుక, ధాన్యం కొనుగోళ్లు వంటి కార్యక్రమాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నారు. పోలీసు బందోబస్తు ⇒ఈ సదస్సులకు పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత స్టేషన్ల వారీగా గ్రామసభలు జరిగే ప్రాంతాల్లో బందోబస్తు పర్యవేక్షించాలని ప్రభుత్వం పోలీసు శాఖను ఆదేశించింది, ప్రతి మండలంలో అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి రోజూ రెండు లేదా మూడు గ్రామాల్లో సదస్సులు నిర్వ హించాలి. ⇒సదస్సులకు సంబంధించి కరపత్రాలు వాల్‌పోస్టర్లు పంపిణీ చేయాలి. ⇒సదస్సు జరిగే ముందురోజు గ్రామంలో మైకుల ద్వారా ప్రచారం చేయాలి. ⇒అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో రావాలి. ⇒రుణం మాఫీ అయిన వారికి పత్రాలు అందించాలి. ⇒రుణం రద్దు కాని వారు అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సరైన రీతిలో సమాధానం చెప్పాలి. ⇒మరో నెల రోజుల్లో అందరికీ రుణం మాఫీ అవుతుందని రైతులకు నచ్చచెప్పాలి. ⇒ ముందుగా బ్యాంకర్లతో మండల అధికారులతో సమావేశాలు నిర్వహించాలి. ⇒రుణమాఫీ రెండో జాబితా ఉంటుందని చెప్పాలి. ⇒మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ తప్పనిసరిగా పాల్గొనాలి. ⇒ పింఛన్ల పంపిణీపై, ఇసుక సరఫరా, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. సదస్సులను జయప్రదం చేయాలి : మంత్రి ఉమా విజయవాడ : రైతు సాధికారత సదస్సులను జయప్రదం చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని అధికారులతో మాట్లాడి సూచనలిచ్చారు. అన్ని శాఖల అధికారులు గ్రామాల్లోకెళ్లి పెద్ద ఎత్తున సదస్సులను జయప్రదం చేయాలన్నారు. కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు మాట్లాడుతూ అన్ని మండల కేంద్రాల్లో సదస్సులు నిర్వహించాలని చెప్పారు. జేసీ మురళీ పాల్గొన్నారు.