దుర్గాఘాట్‌పై దృష్టి పెట్టండి
అధికారులకు మంత్రి ఉమా ఆదేశాలు
వసతుల కల్పనలో అలసత్వంపై కమిషనర్ ఆగ్రహం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
దుర్గాఘాట్‌లో పుష్కర పనులపై మంత్రులు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ శుక్రవారం దుర్గాఘాట్‌ను పరిశీలించి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించగా, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఘాట్ పనులపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. దుర్గాఘాట్ పరిస్థితిపై ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురించిన ‘అదిగో పుష్కరం... ఎప్పటికీ పరిష్కారం?’ కథనానికి స్పందించిన మంత్రి దేవినేని ఉమా, మేయర్ కోనేరు శ్రీధర్ ఘాట్‌కు చేరుకుని పనుల తీరుపై అధికారులను ప్రశ్నించారు. రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మోడల్ గెస్ట్‌హౌస్ వద్ద పనులు, దుర్గాఘాట్‌లో రావిచెట్టు వద్ద మట్టికుప్పలను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తామన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ పనులు సాగుతున్నాయన్నారు.
దుర్గాఘాట్‌లో మౌలిక వసతులు కల్పించాలి
దుర్గాఘాట్, మోడల్ గెస్ట్‌హౌస్‌లో మౌలిక వసతులు కల్పించడంలో ఎందుకు ఆలస్యం అవుతోందని మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గాఘాట్‌ను శుక్రవారం ఆయన సందర్శించి పలు సూచనలు చేశారు.