చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్‌తో సాగునీరు
కంచికచర్ల : పశ్చిమ కృష్ణా మెట్ట రైతులను ఆదుకునేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకం చేపడుతున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. స్వర్గీయ దేవినేని వెంకటరమణ, ప్రణీతల ఘాట్ వద్ద బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు రూ.4900 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ కృష్ణాలోని నందిగామ, మైలవరం, తిరువూరు,నూజివీడు, గన్నవరం నియోజకవర్గంలోని 18 మండలాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందుతుందన్నారు. 410 గ్రామాల్లోని 21 లక్షల జనాభాకు తాగునీటి సౌకర్యం కలుగుతుందన్నారు. దశాబ్దకాలంలో జిల్లాలోని మూడో జోన్‌లోని నాగార్జున సాగర్ ఎడమ, కుడి కాల్వలకు సాగునీరు అందకపోవడంతో ఈ ప్రాంతంలో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నన్నపనేని నరసింహారావు, ఎంపీపీ వేల్పుల ప్రశాంతి, జెడ్పీటీసీ సభ్యుడు కోగంటి బాబు, ఏఎంసీ చైర్మన్ నన్నపనేని లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.