Kanchikacharla
-
కాటేసిన బాబాయ్.. టాటా చెబుతూ నవ్వుతూ వెళ్లిన చిన్నారి.. అంతలోనే..
కంచికచర్ల(నందిగామ)\కృష్ణా జిల్లా: అండగా ఉండాల్సిన సొంత బాబాయి చిన్నారిని కిరాతకంగా కడతేర్చాడు. ఈ దారుణ ఘటన కంచికచర్ల మండలంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన సమాచారం ప్రకారం.. కంచికచర్ల మండల పరిధిలోని కీసర గ్రామంలో ఉన్న ఖాళీ స్థలంలో గత కొద్ది రోజులుగా సంచార జాతులకు చెందిన పలు కుటుంబాలు నివసిస్తున్నాయి. వారు నిత్యం చిత్తు కాగితాలు సేకరించటంతో పాటు సమీప గ్రామాల్లో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఆ కుటుంబాల్లో పెదాల శ్రీను, వెంకటమ్మ దంపతులకు ద్రాక్షావలి (8), ఏసమ్మ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. చదువుకోవాల్సిన వయస్సులో వీరిద్దరూ తల్లిదండ్రుల సహాయకులుగా నిలుస్తున్నారు. వీరి కుటుంబంలో ఎవ్వరికి కూడా ఆధార్ కార్డులు లేవు. చదవండి: బాలికను ప్రేమించి.. ఆపై వంచించి.. ఆ తర్వాత తాళిని తెంచేసి.. ఊరికి తీసుకు వెళ్తానని చెప్పి.. మైలవరంలో నివాసముంటున్న శ్రీను తమ్ముడు, మృతురాలి బాబాయి అయిన సైదులు తన ప్లాట్ ఫాం రిక్షాపై అన్నయ్య ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత తల్లిదండ్రులకు పెద్ద పాప ద్రాక్షావలిని తన ఊరికి తీసుకెళ్లతానని చెప్పి రిక్షాపై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. బాలిక మృతదేహం కలకలం.. బుధవారం గ్రామ సమీపంలోని ఓ కర్మాగారంలో పని చేస్తున్న కార్మికుడు పక్కనే ఉన్న సుబాబుల్ తోటలోకి బహిర్బూమికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ నిర్జీవంగా పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని గమనించి, తోటి కార్మికుల ద్వారా పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న చిన్నారి చెప్పులు, గౌనుతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధారాలను సేకరించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా.. టోల్ ప్లాజాలోని సీసీ కెమెరాల ద్వారా ఆధారాలను సేకరించారు. సోమవారం సాయంత్రం.4.10 గంటల సమయంలో సైదులు ద్రాక్షావలిని రిక్షాపై తీసుకెళ్తున్నట్లు రికార్డుల్లో గుర్తించారు. పోలీసులు ప్రాథమిక విచారణ ప్రకారం ద్రాక్షావలిని వెంట తీసుకెళ్లి లైంగికదాడి చేయటంతో పాటు బాబాయే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. అదే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా మైలవరంలో నివాసముండే నిందితుడిగా భావిస్తున్న సైదులు కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఐవీ నాగేంద్రకుమార్ తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ.. సమాచారం అందుకున్న నందిగామ డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి, రూరల్ సర్కిల్ సీఐ ఐవీ నాగేంద్రకుమార్, కంచికచర్ల, వీరులపాడు ఎస్ఐలు జి.జయలక్ష్మీ, సోమేశ్వరరావు, ఏఎస్ఐ రమేష్‌బాబులు పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. టాటా చెబుతూ వెళ్లిన చిన్నారి.. బాబాయి వెంట ఊరికి వెళ్తున్నాను అంటూ తల్లిదండ్రులకు టాటా చెప్పి నవ్వుతూ వెళ్లిన చిన్నారి ద్రాక్షావలి హత్యకు గురవడంతో వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
టీడీపీ కార్యకర్తల బరితెగింపు !
కంచికచర్ల(కృష్ణా జిల్లా): వైఎస్సార్ సీపీ నాయకుల ఫ్లెక్సీను చింపేసిన సంఘటన సోమవారం గొట్టుముక్కల గ్రామంలో వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ సర్పంచ్ గుదే రంగారావు, ఎంపీటీసీ సభ్యురాలు గుదే సరస్వతి వైఎస్సార్ సీపీ నేతల ఫొటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇది జీర్ణించుకోలేని ఆకతాయిలు రాత్రి వేళ ఫ్లెక్సీని చింపివేశారు. చదవండి: AP: బండారుపై తిరగబడ్డ జనం.. వెళ్లవయ్యా.. వెళ్లు! 2014లో గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు ఆలోకం కృష్ణారావును చిన్నపాటి వివాదానికి టీడీపీ కార్యకర్తలు హత్య చేశారు. గతంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావుపై టీడీపీ నాయకులు హత్య ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీని టీడీపీ నాయకులే ధ్వంసం చేసి ఉంటారని వైఎస్సార్ సీపీ నాయకులు భావిస్తున్నారు. -
కంచికచర్ల వద్ద పట్టుబడ్డ డబ్బు ఎవరిది?
సాక్షి, అమరావతి: ఈ నెల 20వ తేదీన ఉదయం 5.30 గంటలకు విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గరుడ బస్సును కంచికచర్ల వద్ద పోలీసులు తనిఖీ చేసినప్పుడు పట్టుబడిన రూ.50 లక్షలు ఎవరివనే ప్రశ్న పోలీసుల బుర్రను తొలుస్తోంది. ఆ డబ్బులు తీసుకెళ్తున్న మహా న్యూస్ రిపోర్టర్ ఏఎన్వీ సూర్యనారాయణను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ మొత్తానికి సరైన ఆధారాలు చూపించక పోవడంతో పూచీకత్తు రాయించుకుని అతడిని విడిచి పెట్టారు. అయితే అదే బస్సులో హైదరాబాద్‌లో రూ.3 కోట్లు నగదు దొరికినట్టు ప్రచారం జరుగుతోంది. బస్సులో ఇంత పెద్ద మొత్తాన్ని ఎవరికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నారు? అనే కోణంలో పోలీసులు దృష్టి సారించే దశలో టీడీపీ నేతలు రంగంలోకి దిగినట్టు విశ్వసనీయ సమాచారం. టీడీపీకి చెందిన రాష్ట్ర మాజీ మంత్రి ఒకరు, గతంలో టీడీపీలో కొనసాగిన కేంద్ర మాజీ మంత్రి ఒకరు ఈ విషయంలో పోలీసులు లోతుగా వెళ్లకుండా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు స్థానిక పోలీసుల తీరుపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ డబ్బును హైదరాబాద్‌లో ఉండే ఆ చానల్ కీలక ప్రతినిధికి అందజేసేందుకు వెళ్తున్నట్లు తెలిసింది. టీడీపీ హయాం నుంచి ఒక వెలుగు వెలుగుతున్న ఆ సీనియర్ జర్నలిస్టు విశాఖలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్‌ను బెదిరించి ఈ డబ్బు రాబట్టినట్లు సమాచారం. కాగా, పట్టుబడిన రూ.50 లక్షలను విశాఖ మహా న్యూస్ రిపోర్టర్ క్రాంతికుమార్ తనకు ఇచ్చినట్లు ఏఎన్వీ సూర్యనారాయణ చెప్పాడని, అతన్ని కూడా పిలిచి ఆరా తీస్తామని రూరల్ సీఐ సతీష్ తెలిపారు. -
ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, కృష్ణా : మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా కంచికచర్లలో చోటుచేసుకుంది. వివరాలు.. నీలవేణి అనే మహిళ కంచికచర్ల ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. అదే డిపార్ట్మెంట్లో నీలవేణి భర్త కూడా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా నీలవేణి శనివారం తన నివాసంలో అనుమానాస్పద స్థతిలో ఉరివేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా నీలవేణి భర్త పోలీసుల అదుపులో ఉన్నాడు. -
కంచికచర్ల: దొనబండ చెక్‌పోస్టు వద్ద గందరగోళం
సాక్షి, కృష్ణా: కంచికచర్ల మండలం దొనబండ చెక్‌పోస్టు వద్ద గందరగోళం నెలకొంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలకు అనుమతి లేదంటూ పోలీసులు వాహనాలను నిలిపివేశారు. తెలంగాణలో అనేక చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయని వెళ్ళటం కుదరదని వాహనదారులకు పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాము వెళ్లి తీరాల్సిందే అంటూ పోలీసులతో వాగ్విదానికి దిగారు. దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా కొన్ని వాహనాలను అనుమతించారు. ఈ నేపథ్యంలో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కాగా మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్చి 31 వరకు లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.(తెలంగాణ సరిహద్దులో నిలిచిపోయిన వాహనాలు) -
ఆకాశంలో వింత.. సూర్యుడి చుట్టూ వలయాలు!
సాక్షి, కృష్ణాజిల్లా: ఆకాశంలో వింత చోటుచేసుకుంది. తీక్షణంగా ఎండ కాస్తున్న సమయంలో సూర్యుని చుట్టూ నల్లని విశాలమైన వలయాలు ఏర్పడ్డాయి. ఎన్నడూ చూడనిరీతిలో సుర్యుడి చుట్టు నల్లని వలయాలు ఉండటం చూపరులను ఆకట్టకుంది. దీంతో అదేపనిగా ఆకాశం వైపు చూస్తూ ప్రజలు ఈ వింత గురించి చర్చించుకోవడం కనిపించింది. కృష్ణా జిల్లా కంచికచర్ల పట్టణంలో శనివారం ఉదయం సమయంలో ఇది చోటుచేసుకుంది. ఎండ కాస్తూ.. భగభగలాడే సూర్యుడి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడ్డాయి. దీంతో ఆకాశం వైపు చూస్తూ.. ఈ వింతను ఆసక్తిగా గమనిస్తూ.. దీనిని తమ ఫోన్లలో చిత్రీకరించేందుకు పలువురు ఉత్సాహం కనబర్చారు. ఆకాశంలో వింత అంటూ ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. -
వాళ్లు తాగితే.. బస్సులు తూలుతున్నాయ్
సాక్షి, అమరావతి బ్యూరో : ‘ఆ.. అవునండీ.. మధ్యాహ్నం తాగా. అదీ 90 ఎంఎల్.. తప్పేంటి. నేనేమీ నైటు పూట తాగలేదుగా. ఏనాడూ పొరపాటు జరగలేదు. నా ఖర్మ కాలి ఈరోజు దొరికాను. బస్సు యాజమాన్యం నన్నేమీ చెక్ చేయలేదు. ఎవరైనా తాగిన డ్రైవర్లకు బస్సులు ఇచ్చి పంపుతారా? వారి వ్యాపారాన్ని నష్టపరుచుకుంటారా?’ కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు, రవాణా శాఖ అధికారులు మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డాక అధికారుల వద్ద శ్రీ వెంకట పద్మావతి ట్రావెల్స్ డ్రైవర్ చెప్పిన సమాధానం. ప్రయాణికులను ఎంతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత గల ఓ డ్రైవర్ తాగి బస్సు నడపటమే కాకుండా.. అధికారుల ఎదుట నిర్లక్ష్యంగా చెప్పిన సమాధానాన్ని బట్టి ప్రైవేట్ ట్రావెల్స్ తీరు ఏమిటో తెలుస్తోంది. జిల్లాలోని కంచికచర్లలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో వివిధ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లు మద్యం తాగి పట్టుబడటం కలవరం కలిగించింది. అవనిగడ్డ నుంచి హైదరాబాద్ బయలుదేరిన శ్రీ వెంకట పద్మావతి ట్రావెల్స్ డ్రైవర్, ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కనకదుర్గ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌తోపాటు క్లీనర్ కూడా మద్యం మత్తులో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేశారు. ఇటీవల కాలంలో జగ్గయ్యపేట నుంచి కంచికచర్ల వరకు జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో అధికారులు మంగళవారం అర్ధరాత్రి డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. రెండు ట్రావెల్ సంస్థల డ్రైవర్లు మద్యం తాగి ఒకేసారి పట్టుబడటంతో పోలీసులతో పాటు ప్రయాణికులు సైతం ఆందోళనకు గురయ్యారు. పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు పంపించారు.నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ట్రావెల్స్ యాజమానులు, డ్రైవర్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బస్సులను నడిపే డ్రైవర్ల ఫిట్నెస్పైనా, బస్సులు నడిపే సమయంలో వారెలా ఉంటున్నారనే దానిపైనా కనీస దృష్టి పెట్టడం లేదు. యాజమాన్యానిదే బాధ్యత ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లు మద్యం తాగి బస్సులను నడిపితే యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. తాగి నడుపుతున్న డ్రైవర్లపైనా కఠినంగా వ్యవహరిస్తాం. కేసులు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టి శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం. శుక్రవారం కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు యజమానులు, డ్రైవర్లతో విజయవాడలోని డీటీసీ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నాం. యాజమాన్యాలు చేపట్టాల్సిన చర్యలు, డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తాం. – మీరా ప్రసాద్, డీటీసీ, కృష్ణాజిల్లా సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి: మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు -
తెలంగాణలో దొంగనోట్ల ముఠా గుట్టురట్టు
సాక్షి, కృష్ణాజిల్లా: తెలంగాణలో దొంగనోట్ల ముద్రిస్తున్న ముఠా గుట్టును కృష్ణాజిల్లా పోలీసులు రట్టు చేశారు. రెండు రోజుల కిందట ఆర్టీసీ బస్సులో కండక్టర్‌కు రవి అనే వ్యక్తి నకిలీ నోటు ఇచ్చి.. చెలామణి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, నకిలీ నోటును గుర్తించిన కండక్టర్.. ప్రయాణికుల సాయంతో నిందితుడిని పట్టుకొని.. స్థానికంగా ఉన్న కంచికచర్ల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైనశైలిలో విచారించడంతో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టయింది. సూర్యాపేట జిల్లాలోని కోదాడ సమీపంలోని మునగాలలో ఓ ఇంట్లో దొంగ నోట్లు ముద్రిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. గుట్టుచప్పుడు కాకుండా దొంగనోట్లను ముద్రిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి స్కానర్ , ప్రింటర్లు, రూపాయలు విలువచేసే 47వేల దొంగనోట్లను కంచికచర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
భవనం పైనుంచి పడి శ్రీచైతన్య విద్యార్థి మృతి
సాక్షి, విజయవాడ : జిల్లాలోని కంచికచర్ల శ్రీచైతన్య స్కూల్లో విషాదం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న శీలం నాగార్జున సాయిబాబారెడ్డి స్కూల్ భవనం పైనుంచిపడి ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరుగుతున్న 5కె రన్‌ను చూడడానికి పాఠశాల భవనంపైకి చేరిన సాయిబాబా ప్రమాదవశాత్తు కిందపడి మరణించినట్టు తెలుస్తోంది. అయితే, తల్లిదండ్రులకు చెప్పకుండా స్కూల్ యాజమాన్యం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కుమారున్ని స్కూల్ యాజమాన్యమే పొట్టనబెట్టుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 5కె రన్‌ను చూడడానికి సాయిబాబా స్కూల్ పైకి వెళ్లడం గమనించిన ప్రిన్సిపాల్ మందలించాడని, దాంతో భయపడి సాయిబాబా పైనుంచి దూకేశాడని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మృత దేహాన్ని స్కూల్ ఎదుట ఉంచి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. -
13మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
సాక్షి, కృష్ణా : కంచికచెర్ల మండలం మోగలూరు గ్రామంలో బుధవారం పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఒక ఇంట్లో రోజు పేకాట నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 13 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.44200 నగదు, 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
టోల్‌ప్లాజా వద్ద తెలుగు తమ్ముళ్లు వీరంగం
-
తెలుగు తమ్ముళ్ల వీరంగం
కంచికచర్ల(కృష్ణా జిల్లా) : కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. పోలవరం యాత్రకు వెళ్తున్న బస్సులను టోల్ ప్లాజా సిబ్బంది ఆపడంతో తెలుగు దేశం కార్యకర్తలకు కోపం వచ్చింది. అధికార పార్టీకి చెందిన బస్సులనే ఆపుతారా అంటూ టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేసి బండబూతులు తిట్టారు. టోల్‌బూతు అద్దాలు ధ్వంసం చేశారు. సిబ్బంది భయపడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఎలాంటి కేసూ లేకుండా సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
క్షుద్ర పూజల్లో కొత్తకోణం
సాక్షి, కృష్ణా : జిల్లాలోని కంచిక చర్ల మండలం చెవిటికల్లు గ్రామంలో జరిగిన క్షుద్ర పూజల్లో కొత్తకోణం వెలుగు చూసింది. గుప్తనిధుల కోసమే తవ్వకాలు జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు. నిధులు ఉన్నాయంటూ పాస్టరే క్షుద్ర పూజలకు పురిగొల్పినట్లు విచారణలో తేలింది. ప్రస్తుం పూజలు నిర్వహించటానికి కారకుడైన పాస్టర్ పరారిలో ఉన్నాడు. పోలీసులు అతన్ని పట్టుకోవటానికి గాలింపు చర్యలు వేగవంతం చేశారు -
చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్‌తో సాగునీరు
కంచికచర్ల : పశ్చిమ కృష్ణా మెట్ట రైతులను ఆదుకునేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకం చేపడుతున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. స్వర్గీయ దేవినేని వెంకటరమణ, ప్రణీతల ఘాట్ వద్ద బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు రూ.4900 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ కృష్ణాలోని నందిగామ, మైలవరం, తిరువూరు,నూజివీడు, గన్నవరం నియోజకవర్గంలోని 18 మండలాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందుతుందన్నారు. 410 గ్రామాల్లోని 21 లక్షల జనాభాకు తాగునీటి సౌకర్యం కలుగుతుందన్నారు. దశాబ్దకాలంలో జిల్లాలోని మూడో జోన్‌లోని నాగార్జున సాగర్ ఎడమ, కుడి కాల్వలకు సాగునీరు అందకపోవడంతో ఈ ప్రాంతంలో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నన్నపనేని నరసింహారావు, ఎంపీపీ వేల్పుల ప్రశాంతి, జెడ్పీటీసీ సభ్యుడు కోగంటి బాబు, ఏఎంసీ చైర్మన్ నన్నపనేని లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థి ఆత్మహత్య
-
ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థి ఆత్మహత్య
కంచికచర్ల: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంచికచెర్లలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వినయ్ కుమార్ అనే విద్యార్థి స్కూల్లోనే ఉరేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువు ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. -
వివాహిత ఆత్మహత్య
కృష్ణా: ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో మరియమ్మ అనే మహిళ శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఓ యువకుడు లైంగికంగా తనను వేధిస్తున్నాడని మరియమ్మ మూడు రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులు పట్టించుకోలేదనే వాదన వినిపిస్తోంది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్య చేసుకుందంటూ మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
తెల్లవారుజాము నుంచి రోడ్డుపైనే పడిగాపులు
విజయవాడ : ప్రయాణిలకు పట్ల ప్రయివేట్ ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దాంతో ప్రయివేట్ ట్రావెల్స్ ఆగడాల కారణంగా ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్ నుంచి నర్సాపురం వెళుతున్న విజయ మేఘన ట్రావెల్స్ బస్సు గతరాత్రి కృష్ణాజిల్లా కంచికచర్ల వద్ద బ్రేక్ డౌన్ అయింది. దాంతో బస్సులో ప్రయాణిస్తున్న 30మంది ప్రయాణికులు తెల్లవారుజాము నుంచి రోడ్డుపైనే పడిగాపులు కాశారు. మరో బస్సులో తమను తరలించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేసినా డ్రైవర్కానీ, ట్రావెల్స్ యాజమాన్యం కానీ స్పందించకపోవటంతో విసిగిపోయిన ప్రయాణికులు కంచికచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెద్ద మొత్తంలో ఛార్జీలు వసూలు చేసి, తమను గాలికి వదిలేసిన ట్రావెల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలోనూ దీపక్ ట్రావెల్స్ అనే మరో సంస్థ విజయవాడలో ప్రయాణికులకు నరకం చూపించిన విషయం తెలిసిందే. బస్సును అర్థరాత్రి కొన్నిగంటలపాటు నిలిపివేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
కృష్ణా జిల్లాలో భూప్రకంపనలు
విజయవాడ: కృష్ణా జిల్లాలో కలకలం రేగింది. నందిగామ, కంచికచర్ల ప్రాంతంలో భూ ప్రకంపనలు జనాలను పరుగులు పెట్టించాయి. గురువారం తెల్లవారుజామున దాదాపు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. అయితే రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత స్వల్పంగా నమోదు కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో భూప్రకంపనలు ఒకసారి 4 సెకన్లు, మరోసారి 3 సెకన్లు నమోదయ్యాయి. ఉదయం వాకింగ్, పాల కోసం వెళ్లేవారు ఈ ప్రకంపనల్ని గుర్తించారు. తరచుగా వస్తున్న భూప్రకంపనలతో మున్ముందు పెను ప్రమాదం వాటిల్లే అవకాశముందని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. -
అరకొర వైద్యసేవలే!
కంచికచర్ల పీహెచ్సీలో వసతుల లేమి భర్తీకాని వైద్యసిబ్బంది పోస్టులు..పరుపుల్లేని మంచాలు వైద్యశాలలో మంచినీటికి కటకటే రోగుల అవస్థలు పట్టించుకోని పాలకులు కంచికచర్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఉండీ ఉపయోగం లేనట్లుగా తయూరైంది. రూ.30లక్షలతో పీహెచ్‌సీకి నూతన భవనం నిర్మించిన పాలకులు..వైద్యశాలలో వసతుల కల్పన, వైద్యసిబ్బంది పోస్టుల భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పూర్తిస్థారుులో వైద్య సేవలు అందక మండల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. నూతనంగా నిర్మించిన కంచికచర్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలోనూ మెరుగైన వైద్యసేవలు అందక రోగులు అవస్థలుపడుతున్నారు. ఈ వైద్యశాలలో కనీస వసతులు లేకపోవడంతో అరకొర వైద్యసేవలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతంలో పీహెచ్సీ పట్టణ నడిబొడ్డుగా ఉన్న మండల పరిషత్ కార్యాలయంలోని ఓ క్వార్టర్లో ఉండగా, వైద్యాధికారులు ఆరోగ్యపరీక్షలు నిర్వహించి అందుబాటులో ఉన్న మందులిచ్చి పంపించేవారు. అరుుతే వర్షాకాల సమయంలో నీరంతా గదుల్లోకి వచ్చి మందుల తడిచిపోతుండేవి. భవనం శిథిలావస్థకు చేరడంతో వైద్యం చేసేందుకు వైద్యులు ఇబ్బందిపడుతున్న తరుణంలో గ్రామానికి కిలోమీటరు దూరంలో పంటపొలాల మధ్య దాతలు స్థలాన్ని కేటారుుంచడంతో నూతన పీహెచ్సీ నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.30లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో పీహెచ్‌సీకి నూతన భవనాలను నిర్మించిన పాలకులు, కనీసవ సతులు కల్పించడాన్ని మాత్రం విస్మరించారు. పీహెచ్సీ పనులు పూర్తికావడంతో సెప్టెంబర్ నెలాఖరులో పీహెచ్‌సీని నూతన భవనంలోని మార్పు చేయగా..పట్టణానికి కిలోమీటరు దూరంలో అరకొర వసతులు ఉన్న ఈ వైద్యశాలకు వచ్చేందుకు రోగులకు అవస్థలు తప్పడం లేదు. అధ్వానంగా ఉన్నరోడ్డు... జాతీయ రహదారికి అర కిలోమీటర్ దూరంలో ఈ ఆస్పత్రి భనవం ఉంది. అక్కడికి వెళ్లేందుకు ఉన్న రోడ్డు సైతం అధ్వానంగా ఉండటంతో ఉంది. గ్రావెల్ రోడ్డంతా గుంతలమయం కావడంతో వర్షాలు పడినపుడు నడిచేందుకు సైతం వీలులేని పరిస్థితి నెలకొంది. దీంతో వైద్యశాలకు చేరుకునేందుకు రోగులు, వారి బంధువులు ఇబ్బందిపడుతున్నారు. చుట్టూ పంటపొలాల కారణంగా విషజంతువులు సంచరిస్తుండటంతో వైద్యశాల సిబ్బంది సైతం భయంభయంగానే విధులు నిర్వరిస్తున్నారు మంచినీరు కరువు.. వైద్యశాలలో మంచినీటి వసతి లేదు. తగిన వసతులు లేకపోవడంతో పీహెచ్సీలో కాన్పులు చేయలేని దుస్థితి నెలకొంది.దీంతో మండలానికి చెందిన గర్భిణులు కాన్పుల కోసం ఇతర మండలాల్లోని పీహెచ్‌సీలకు వెళ్లాల్సి వస్తోంది. మరుగుదొడ్లు, అన్ని గదులకు విద్యుత్ సదుపాయం, స్టెరిలైజేషన్ వసతి లేకపోవడంతో ఈ వైద్యశాల నామమాత్రపు సేవలకే పరిమితమైంది. ఆరోగ్య సిబ్బంది కొరత..... పీహెచ్సీలో ముగ్గురు స్టాఫ్‌నర్సులు ఉండగా, ఆరోగ్యశాఖ జిల్లా అధికారులు ఇద్దరిని ఇతర ప్రాంతాలకు డిప్యుటేషన్‌పై పంపించారు. దీంతో ప్రస్తుతం ఒక్క స్టాఫ్‌నర్సు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన విభాగాల సిబ్బంది కొరత కూడా ఉంది. ఐదు పడకలే ఏర్పాటు.. పీహెచ్సీలో 25 పడకల ఆస్పత్రిగా ఏర్పాటు చేసినట్లు ఆరోగ్యశాఖ జిల్లా అధికారులు చెబుతుండగా, వైద్యశాలలో కేవలం ఐదు బెడ్లుమాత్రమే దర్శనమిస్తున్నారుు. వీటిపై పరుపులు కూడా లే కపోగా..ఆ మంచాలు సైతం తుప్పుపట్టి ఉన్నారుు. ఇలా నూతనంగా నిర్మించిన కంచికచర్ల పీహెచ్సీలో తగిన వసతులు లేకపోవడంతో సరైన వైద్యసేవలు అంద క రోగులు అవస్థలుపడుతున్నారు ఇకనైనా ఆరోగ్యశాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పీహెచ్సీలో మౌలికవసతులు కల్పించడంతోపాటు పూర్తిస్థారుులో సిబ్బందిని నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
ఏ ప్రాంతం అనువైనదైతే అక్కడే రాజధాని:సుజనా చౌదరి
విజయవాడ: రాజధానికి ఏది అనువైన ప్రాంతం అని భావిస్తే అక్కడే రాజధాని ఏర్పడుతుందని టిడిపి ఎంపి సుజనా చౌదరి చెప్పారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కరసరత్తు జరుగుతోంది. రాజధానిని సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాజధానికి సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ తనకు బందరులోనూ, కంచికచర్లలోనూ భూములు ఉన్నాయని తెలిపారు. తన భూములు ఉన్న చోట రాజధాని ఏర్పాటు అయితే అవవచ్చునని అన్నారు. శాస్త్రీయంగా రాజధానికి ఏది అనువైన ప్రదేశం అని తేలుతుందో అక్కడే రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పారు. రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. **