
సాక్షి, విజయవాడ : జిల్లాలోని కంచికచర్ల శ్రీచైతన్య స్కూల్‌లో విషాదం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న శీలం నాగార్జున సాయిబాబారెడ్డి స్కూల్ భవనం పైనుంచిపడి ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరుగుతున్న 5కె రన్‌ను చూడడానికి పాఠశాల భవనంపైకి చేరిన సాయిబాబా ప్రమాదవశాత్తు కిందపడి మరణించినట్టు తెలుస్తోంది. అయితే, తల్లిదండ్రులకు చెప్పకుండా స్కూల్ యాజమాన్యం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కుమారున్ని స్కూల్ యాజమాన్యమే పొట్టనబెట్టుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 5కె రన్‌ను చూడడానికి సాయిబాబా స్కూల్ పైకి వెళ్లడం గమనించిన ప్రిన్సిపాల్ మందలించాడని, దాంతో భయపడి సాయిబాబా పైనుంచి దూకేశాడని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మృత దేహాన్ని స్కూల్ ఎదుట ఉంచి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు.