వాళ్లు తాగితే.. బస్సులు తూలుతున్నాయ్‌ | travels Bus drivers caught red handed by police for drunk driving | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల ప్రాణాలతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ చెలగాటం

Published Wed, May 15 2019 9:20 AM | Last Updated on Thu, May 16 2019 9:00 AM

travels Bus drivers caught red handed by police for drunk driving - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో : ‘ఆ.. అవునండీ.. మధ్యాహ్నం తాగా. అదీ 90 ఎంఎల్‌.. తప్పేంటి. నేనేమీ నైటు పూట తాగలేదుగా. ఏనాడూ పొరపాటు జరగలేదు. నా ఖర్మ కాలి ఈరోజు దొరికాను. బస్సు యాజమాన్యం నన్నేమీ చెక్‌ చేయలేదు. ఎవరైనా తాగిన డ్రైవర్లకు బస్సులు ఇచ్చి పంపుతారా? వారి వ్యాపారాన్ని నష్టపరుచుకుంటారా?’ కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు, రవాణా శాఖ అధికారులు మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డాక అధికారుల వద్ద శ్రీ వెంకట పద్మావతి ట్రావెల్స్‌ డ్రైవర్‌ చెప్పిన సమాధానం. ప్రయాణికులను ఎంతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత గల ఓ డ్రైవర్‌ తాగి బస్సు నడపటమే కాకుండా.. అధికారుల ఎదుట నిర్లక్ష్యంగా చెప్పిన సమాధానాన్ని బట్టి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ తీరు ఏమిటో తెలుస్తోంది.

జిల్లాలోని కంచికచర్లలో నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షల్లో వివిధ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లు మద్యం తాగి పట్టుబడటం కలవరం కలిగించింది. అవనిగడ్డ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన శ్రీ వెంకట పద్మావతి ట్రావెల్స్‌ డ్రైవర్, ఏలూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కనకదుర్గ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌తోపాటు క్లీనర్‌ కూడా మద్యం మత్తులో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేశారు. ఇటీవల కాలంలో జగ్గయ్యపేట నుంచి కంచికచర్ల వరకు జాతీయ రహదారిపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో అధికారులు మంగళవారం అర్ధరాత్రి డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. రెండు ట్రావెల్‌ సంస్థల డ్రైవర్లు మద్యం తాగి ఒకేసారి పట్టుబడటంతో పోలీసులతో పాటు ప్రయాణికులు సైతం ఆందోళనకు గురయ్యారు. పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు పంపించారు.నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ట్రావెల్స్‌ యాజమానులు, డ్రైవర్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బస్సులను నడిపే డ్రైవర్ల ఫిట్‌నెస్‌పైనా, బస్సులు నడిపే సమయంలో వారెలా ఉంటున్నారనే దానిపైనా కనీస దృష్టి పెట్టడం లేదు. 

యాజమాన్యానిదే బాధ్యత 
ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లు మద్యం తాగి బస్సులను నడిపితే యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. తాగి నడుపుతున్న డ్రైవర్లపైనా కఠినంగా వ్యవహరిస్తాం. కేసులు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టి శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం. శుక్రవారం కాంట్రాక్ట్‌ క్యారేజ్‌ బస్సు యజమానులు, డ్రైవర్లతో విజయవాడలోని డీటీసీ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నాం. యాజమాన్యాలు చేపట్టాల్సిన చర్యలు, డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తాం. – మీరా ప్రసాద్, డీటీసీ, కృష్ణాజిల్లా 

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి:
మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement