Jaggaiah pet
-
రియాక్టర్ పేలుడు.. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట మండలం బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెనుక వైపు గేట్ నుంచి కంపెనీలోకి చొచ్చుకెళ్లేందుకు స్థానికులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.వెనుకవైపు గేట్‌కు వేసిన తాళాన్ని స్థానికులు రాళ్లతో పగలగొట్టారు. ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలు కావస్తున్నా కంపెనీ యాజమాన్యం స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అల్ట్రాటెక్ ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే కంపెనీ వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు.కాగా ఎన్టీఆర్ జిల్లా బూదవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఆదివారం ఉదయం లైమ్‌స్టోన్ ఐరన్ రెడ్‌సాయిల్ రియాక్టర్లో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.కర్మాగారంలోని మూడో ఫ్లోర్లో లైమ్‌స్టోన్ ఐరన్ రెడ్‌సాయిల్ రా మెటీరియల్ మిక్స్ చేయటానికి 1,300 డిగ్రీల ఉష్ణోగ్రతతో హీట్‌చేసే రియాక్టర్ వద్దకు ఉదయం షిఫ్టులో 16 మంది కార్మికులు విధులకు వచ్చారు. వారు విధుల్లో ఉండగా ఒక్కసారిగా రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలింది. అందులోని సిమెంట్ కార్మికులందరిపై పడింది. దీంతో వారి శరీర భాగాలు కాలిపోయాయి.ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరవింద్ యాదవ్, సుభం సోని, గుడ్డు కుమార్, దినేష్‌కుమార్, నాగేంద్ర, బిహార్‌కు చెందిన బి. సింగ్, పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన బొంతా శ్రీనివాసరావు, బూదవాడ గ్రామానికి చెందిన ధారావతు వెంకటేశ్వరరావు, వేముల సైదులు, గుగులోతు గోపినాయక్, గుగులోతు బాలాజీ, బాణావతు సైదా, బాణావతు స్వామి, పరిటాల అర్జునరావు, బాణావతు సైదా, అవుల వెంకటేష్ గాయపడ్డారు.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. వీరిలో ఆవుల వెంకటేష్ (35)కు 80 శాతం కాలిన గాయాలవడంతో మృతిచెందాడు. గాయపడిన వారిలో మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.ఫర్నిచర్ ధ్వంసం చేసిన గ్రామస్తులు..యాజమాన్యం నిర్లక్ష్యంవల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులతో పాటు క్షతగాత్రుల కుటుంబ సభ్యులు కర్మాగారం వద్ద ఆందోళన చేశారు. ప్రమాదం జరిగినా కనీస స్పందనలేదని ఆరోపించారు. సమాధానం చెప్పడానికి కర్మాగారం తర ఫున ఎవరూ లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామ స్తులు, క్షతగాత్రుల బంధువులు కర్మాగారంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సీఐ జానకీరాం, చిల్లకల్లు ఎస్ఐ సతీష్ పరిస్థితిని చక్కదిద్దారు. ఘటనా స్థలాన్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఏసీపీ కె. శ్రీనివాసరావు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు పరిశీలించారు. -
బ్రదర్ అనిల్ కుమార్‌కు తప్పిన ప్రమాదం
సాక్షి, కృష్ణాజిల్లా : బ్రదర్ అనిల్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో బ్రదర్ అనిల్ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో బ్రదర్ అనిల్‌కుమార్‌తో పాటు గన్మెన్లు, డ్రైవర్ ఉన్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నది. ప్రమాదం గురించి తెలియగానే ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సంఘటనా స్థలానికి వెళ్లారు. తన కారులో బ్రదర్ అనిల్, గన్మెన్లను విజయవాడలోని ఎంజే నాయుడు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనిల్ కుమార్ తన పర్యటనకు వెళ్లిపోయారు. -
గోవా బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటుం వైద్యురాలు మృతి
-
గోవా బీచ్‌లో జగ్గయ్యపేట వైద్యురాలు మృతి
జగ్గయ్యపేట: గోవా బీచ్‌కి వెళ్లిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఓ వైద్యురాలు మంగళవారం మృత్యువాత పడింది. అలల తాకిడికి యువతి సముద్రంలోకి కొట్టుకుపోయింది. జగ్గయ్యపేటలోని మార్కండేయ బజార్‌కు చెందిన ఊటుకూరి ఆంజనేయులు స్థానిక కోర్టులో గుమాస్తాగా పనిచేస్తూ కొంత కాలం క్రితం మృతి చెందారు. అతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. చిన్న కుమార్తె రమ్యకృష్ణ (25) ఎంబీబీఎస్ పూర్తి చేసి జగ్గయ్యపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొంత కాలం పని చేసింది. మూడేళ్ల క్రితం గోవాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యురాలిగా చేరింది. మంగళవారం ఆరుగురు స్నేహితులతో కలసి ఆమె గోవా బీచ్‌కు వెళ్లింది. బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అయితే సముద్రంలో ఒక్కసారిగా వచ్చిన అలలకు రమ్యకృష్ణతోపాటు మరో స్నేహితురాలు కూడా గల్లంతయ్యారు. గమనించిన చుట్టుపక్కల వారు ఆమె స్నేహితురాలిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాగా రమ్యకృష్ణ మాత్రం దొరకలేదు. కొద్దిసేపటికి ఆమె మృతదేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : గోవా బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటుం వైద్యురాలు మృతి -
వాళ్లు తాగితే.. బస్సులు తూలుతున్నాయ్
సాక్షి, అమరావతి బ్యూరో : ‘ఆ.. అవునండీ.. మధ్యాహ్నం తాగా. అదీ 90 ఎంఎల్.. తప్పేంటి. నేనేమీ నైటు పూట తాగలేదుగా. ఏనాడూ పొరపాటు జరగలేదు. నా ఖర్మ కాలి ఈరోజు దొరికాను. బస్సు యాజమాన్యం నన్నేమీ చెక్ చేయలేదు. ఎవరైనా తాగిన డ్రైవర్లకు బస్సులు ఇచ్చి పంపుతారా? వారి వ్యాపారాన్ని నష్టపరుచుకుంటారా?’ కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు, రవాణా శాఖ అధికారులు మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డాక అధికారుల వద్ద శ్రీ వెంకట పద్మావతి ట్రావెల్స్ డ్రైవర్ చెప్పిన సమాధానం. ప్రయాణికులను ఎంతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత గల ఓ డ్రైవర్ తాగి బస్సు నడపటమే కాకుండా.. అధికారుల ఎదుట నిర్లక్ష్యంగా చెప్పిన సమాధానాన్ని బట్టి ప్రైవేట్ ట్రావెల్స్ తీరు ఏమిటో తెలుస్తోంది. జిల్లాలోని కంచికచర్లలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో వివిధ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లు మద్యం తాగి పట్టుబడటం కలవరం కలిగించింది. అవనిగడ్డ నుంచి హైదరాబాద్ బయలుదేరిన శ్రీ వెంకట పద్మావతి ట్రావెల్స్ డ్రైవర్, ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కనకదుర్గ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌తోపాటు క్లీనర్ కూడా మద్యం మత్తులో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేశారు. ఇటీవల కాలంలో జగ్గయ్యపేట నుంచి కంచికచర్ల వరకు జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో అధికారులు మంగళవారం అర్ధరాత్రి డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. రెండు ట్రావెల్ సంస్థల డ్రైవర్లు మద్యం తాగి ఒకేసారి పట్టుబడటంతో పోలీసులతో పాటు ప్రయాణికులు సైతం ఆందోళనకు గురయ్యారు. పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు పంపించారు.నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ట్రావెల్స్ యాజమానులు, డ్రైవర్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బస్సులను నడిపే డ్రైవర్ల ఫిట్నెస్పైనా, బస్సులు నడిపే సమయంలో వారెలా ఉంటున్నారనే దానిపైనా కనీస దృష్టి పెట్టడం లేదు. యాజమాన్యానిదే బాధ్యత ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లు మద్యం తాగి బస్సులను నడిపితే యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. తాగి నడుపుతున్న డ్రైవర్లపైనా కఠినంగా వ్యవహరిస్తాం. కేసులు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టి శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం. శుక్రవారం కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు యజమానులు, డ్రైవర్లతో విజయవాడలోని డీటీసీ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నాం. యాజమాన్యాలు చేపట్టాల్సిన చర్యలు, డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తాం. – మీరా ప్రసాద్, డీటీసీ, కృష్ణాజిల్లా సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి: మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు -
భార్యను కడతేర్చిన భర్త
కృష్ణాజిల్లా, రావిరాల (జగ్గయ్యపేట) : వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను మందలించినా వినకపోవటంతో విసుగు చెందిన భర్త ఇనుప రాడ్డుతో తలపై కొట్టి హత్య చేసిన ఘటన మండలంలోని జయంతిపురం గ్రామ పంచాయతీ రావిరాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఇనుపనుర్తి సుందర్రావు గ్రామంలోని సిమెంట్ కర్మాగారం మైనింగ్‌లో రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. అతనికి 30 ఏళ్ల క్రితం వీరులపాడు మండలం వెల్లంకి గ్రామానికి చెందిన కమలమ్మ (47) తో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారికి వివాహాలు కూడా అయ్యాయి. అయితే కొన్ని నెలలుగా కమలమ్మ ఫోన్లో తరచూ మాట్లాడటం, కూలీ పని ఉందని బయటకు వెళ్తుండటంతో భర్త సుందర్రావుకు అనుమానం వచ్చి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు గమనించి వారం రోజుల క్రితం భార్యను హెచ్చరించాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరగటంతో కమలమ్మ పుట్టింటికి వెళ్లింది. రెండు రోజుల క్రితం భర్త, కుమారుడు తీసుకువచ్చారు. సోమవారం సాయంత్రం పని నుంచి వచ్చిన సుందర్రావు ఇంట్లో భార్య లేకపోవటంతో పాటు కోడలు పుట్టింటికి వెళ్లటంతో డ్యూటీలో ఉన్న కుమారుడికి ఫోన్ చేశాడు. ‘మీ అమ్మ ఎక్కడకెళ్లింది’ అని అడిగాడు. కుమారుడు కూడా తెలియదని చెప్పాడు. రాత్రి 8 గంటల సమయంలో కమలమ్మ ఇంటికి వచ్చింది. ఇప్పటి వరకు ఎక్కడికెళ్లావని అడగటంతో రాత్రి ఒంటి గంట వరకు ఘర్షణ పడుతూనే ఉన్నారు. ఆగ్రహించిన సుందర్రావు మంచంపై పడుకుని ఉన్న కమలమ్మను అక్కడే ఉన్న ఇనుప రాడ్డుతో కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఇనుప రాడ్డును అటకపై పడేసి తన ద్విచక్ర వాహనంపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్యను హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. ఎస్ఐ దుర్గాప్రసాద్, సీఐ జయకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. భర్త నేరం అంగీకరించటంతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
డ్రైవర్‌కు గుండెపోటు: బస్సు బోల్తా
జగ్గయ్యపేట: కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. 21 మంది ప్రయాణికులతో సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి విజయవాడకు బస్సు బయలుదేరగా చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్దకు చేరుకునేసరికి డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో పదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్ సహా గాయపడిన వారందరినీ జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. -
అమెరికన్ పార్సిలులో చెత్త కాగితాలు...
జగ్గయ్యపేట : అమెరికా నుంచి వచ్చిన ఓ రిజిస్ట్రర్ ఎయిర్ పార్సిలు చూసిన ఓ వ్యక్తి అవాక్కయిన ఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక నివాసం ఉంటున్న ఇంటూరి రాజగోపాల్ బంధువులు అమెరికాలో ఉంటున్నారు. గత నెల 23న బంధువు ...రూ.60వేలు విలువ చేసే ఐ ఫోన్‌ను అమెరికా నుంచి జగ్గయ్యపేటకు రిజిస్టర్ ఎయిర్‌మెయిల్ ద్వారా రాజగోపాల్‌కు పంపాడు. పార్సిల్ తెరిచి చూసిన రాజగోపాల్ ...ఫోన్‌కు బదులు చెత్త కాగితాలు ఉండటంతో షాక్ తిన్నాడు. వెంటనే ఈ విషయాన్ని ఫోన్ చేసి బంధువుకు తెలిపాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా ఫోన్ పోస్టాఫీసులో మిస్ అయ్యిందా లేక కస్టమ్స్ అధికారుల వైఫల్యమా అనేది తేలాల్సి ఉంది.