సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట మండలం బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెనుక వైపు గేట్ నుంచి కంపెనీలోకి చొచ్చుకెళ్లేందుకు స్థానికులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
వెనుకవైపు గేట్‌కు వేసిన తాళాన్ని స్థానికులు రాళ్లతో పగలగొట్టారు. ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలు కావస్తున్నా కంపెనీ యాజమాన్యం స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అల్ట్రాటెక్ ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే కంపెనీ వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు.
కాగా ఎన్టీఆర్ జిల్లా బూదవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఆదివారం ఉదయం లైమ్‌స్టోన్ ఐరన్ రెడ్‌సాయిల్ రియాక్టర్‌లో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
కర్మాగారంలోని మూడో ఫ్లోర్‌లో లైమ్‌స్టోన్ ఐరన్ రెడ్‌సాయిల్ రా మెటీరియల్ మిక్స్ చేయటానికి 1,300 డిగ్రీల ఉష్ణోగ్రతతో హీట్‌చేసే రియాక్టర్ వద్దకు ఉదయం షిఫ్టులో 16 మంది కార్మికులు విధులకు వచ్చారు. వారు విధుల్లో ఉండగా ఒక్కసారిగా రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలింది. అందులోని సిమెంట్ కార్మికులందరిపై పడింది. దీంతో వారి శరీర భాగాలు కాలిపోయాయి.
ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరవింద్ యాదవ్, సుభం సోని, గుడ్డు కుమార్, దినేష్‌కుమార్, నాగేంద్ర, బిహార్‌కు చెందిన బి. సింగ్, పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన బొంతా శ్రీనివాసరావు, బూదవాడ గ్రామానికి చెందిన ధారావతు వెంకటేశ్వరరావు, వేముల సైదులు, గుగులోతు గోపినాయక్, గుగులోతు బాలాజీ, బాణావతు సైదా, బాణావతు స్వామి, పరిటాల అర్జునరావు, బాణావతు సైదా, అవుల వెంకటేష్ గాయపడ్డారు.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. వీరిలో ఆవుల వెంకటేష్ (35)కు 80 శాతం కాలిన గాయాలవడంతో మృతిచెందాడు. గాయపడిన వారిలో మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.
ఫర్నిచర్ ధ్వంసం చేసిన గ్రామస్తులు..
యాజమాన్యం నిర్లక్ష్యంవల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులతో పాటు క్షతగాత్రుల కుటుంబ సభ్యులు కర్మాగారం వద్ద ఆందోళన చేశారు. ప్రమాదం జరిగినా కనీస స్పందనలేదని ఆరోపించారు. సమాధానం చెప్పడానికి కర్మాగారం తర ఫున ఎవరూ లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామ స్తులు, క్షతగాత్రుల బంధువులు కర్మాగారంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సీఐ జానకీరాం, చిల్లకల్లు ఎస్‌ఐ సతీష్ పరిస్థితిని చక్కదిద్దారు. ఘటనా స్థలాన్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఏసీపీ కె. శ్రీనివాసరావు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment