హత్యకు గురైన పొట్ల నాగమణి(ఫైల్)
చింతలపూడి(ఏలూరు జిల్లా): చింతలపూడిలో మహిళ మిస్సింగ్ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. మహిళను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ కేసు వివరాలు వెల్లడించారు. చింతలపూడి ఎస్‌బీఐ నగర్‌కు చెందిన పొట్ల నాగమణి(37) భర్త చనిపోవడంతో ఇద్దరు కుమార్తెలతో పాటు అత్త , మామలతో కలిసి ఉంటుంది. ఖమ్మం జిల్లా గంగారం గ్రామంలో స్థలం విషయంలో వైరాకు చెందిన నంబూరి శ్రీనివాసరావుతో ఆమెకు పాత గొడవలు ఉన్నాయి.
మృతురాలు 2016లో ఇదే స్థల వివాదంలో సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. మూడు సంవత్సరాల క్రితం చింతలపూడి మండలం, ఎండపల్లి గ్రామానికి చెందిన బర్రె రాంబాబు నాగమణికి పరిచయమయ్యాడు. తనకు తెలిసిన పెద్దలతో మాట్లాడి స్థలం వివాదం పరిష్కరిస్తానని నమ్మబలికాడు. అనంతరం నాగమణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. స్థల వివాదం పరిష్కరించాలని నాగమణి పట్టుబట్టడంతో రాంబాబు శ్రీనివాసరావును కలిశాడు.
నాగమణిని అడ్డు తప్పిస్తే ఉన్న స్థలంలో 6 కుంట్లతో పాటు రెండు లక్షల నగదు ఇస్తానని శ్రీనివాసరావు చెప్పడంతో రాంబాబు అంగీకరించాడు. దీంతో ఇద్దరూ పథకం ప్రకారం నాగమణిని అడ్డు తప్పించాలనుకున్నారు. గత నెల 19న రాంబాబు కారులో కాకినాడ సర్పవరం జంక్షన్‌లో ఉన్న శ్రీనివాస లాడ్జికి నాగమణిని తీసుకెళ్ళాడు. అదే రోజు రాత్రి కారు జాకీ రాడ్‌తో తలపై కొట్టి చీర చెంగుతో మెడకి గట్టిగా బిగించి హత్య చేశాడు.
చదవండి: షాకింగ్.. ప్రియుడి మోజులో పడి.. భార్య ఎంతపని చేసిందంటే..
అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలు చేతికి ఉన్న బ్రాస్‌లెట్లు తీసుకున్నాడు. లాడ్జికి దగ్గరలో ఉన్న ఎరువుల దుకాణంలో పెట్రోలు డబ్బా, ఎరువుల సంచి కొని మృతదేహాన్ని మూటకట్టి కారులో వేసి 21వ తేదీ తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం దమ్మపేట మండలం ఆర్లపెంట గ్రామ శివారులోని డంపింగ్ యార్డు వద్ద పెట్రోల్ పోసి నాగమణి మృతదేహాన్ని తగలబెట్టాడు.
అనంతరం మృతురాలి సోదరుడితో కలిసి చింతలపూడి పోలీసులకు నాగమణి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. రాంబాబుపై అనుమానం వచ్చి విచారించగా పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారు. సీఐ ఎంవీఎస్ మల్లేశ్వరరావు తన సిబ్బందితో రాంబాబుతో పాటు నంబూరి శ్రీనివాసరావును పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment