అలమటిస్తున్నా పట్టించుకోరా..
అలమటిస్తున్నా పట్టించుకోరా..
Published Tue, Aug 16 2016 9:20 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
మంత్రి ఉమా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి
కృత్తివెన్ను :
ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా ఓ చేతకాని దద్దమ్మని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి అన్నారు. శివారు ప్రాంతాలలో ప్రజలు తాగునీటి కోసం అలమటిస్తున్నా పట్టించుకోని ఉమా లాంటి వారికోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని ఎద్దేవా చేశారు. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో తాగు, సాగునీటి కోసం వైఎస్సార్‌సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం మహాధర్నా నిర్వహించారు. తొలుత పార్టీ కార్యకర్తలు రంగాబొమ్మ సెంటరు నుంచి లక్ష్మీపురం లాకుల వరకు ర్యాలీగా వచ్చారు. లాకుల వద్ద జాతీయ రహదారిపై పార్టీ నేతలతో కలసి బైఠాయించారు. రాష్ట్రంలో కరువు తాండవించడంలో చిత్రమేమి లేదని కరువు, చంద్రబాబు ఇద్దరూ అన్నదమ్ములని ఎద్దేవా చేశారు. రూ.వందల కోట్ల పట్టిసీమ పేరుతో దోపిడీ చేసి ఇప్పుడు గండికొట్టారంటూ చెప్పడం విడ్డూరమన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు కాలువకు గండి కొడితే పట్టుకోలేని చేతకాని తనంలో ప్రభుత్వం ఉందంటూ దుయ్యబట్టారు. పుష్కరాల పేరుతో చంద్రబాబునాయుడు పాలన గాలికి వదిలేశారని విమర్శించారు. తీర ప్రాంతాలలో ఇన్ని నెలలుగా ప్రజలు తాగునీటి కోసం కష్టాలు పడుతుంటే జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు కోటరీలో ఎమ్మెల్యేలు నిమిత్త మాత్రులేనని వీరికి ఎలాంటి ప్రాధాన్యం లేదంటూ సానుభూతి వ్యక్తం చేశారు. పుష్కరాలు ముగిసే లోపు కృత్తివెన్ను మండలంలోని శివారు ప్రాంతానికి నీరివ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామంటూ హెచ్చరించారు. 18 నెలలుగా తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా టీడీపీ నాయకులు పట్టించుకోకపోవడం దారుణమని ఉప్పాల రాంప్రసాద్ అన్నారు. త్వరలో నీరవ్వకపోతే పార్టీ నేతృత్వంలో ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించారు. తరువాత పార్టీ నేతలంతా పల్లెపాలెం, లక్ష్మీపురం, పెదచందాలలో అడుగంటిన తాగునీటి చెరువులను పరిశీలించారు. ధర్నాలో పార్టీ యువజన రాష్ట్ర కార్యదర్శి ఉప్పాల రాము, ఎంపీటీసీల సంఘ జిల్లా కార్యదర్శి పిన్నెంటి మహేష్, పార్టీ మండల కన్వీనర్ జల్లా భూపతిరాజు, సంయుక్త కార్యదర్శి వైధాని వెంకట్రాజు, యువజన మండలాధ్యక్షుడు పులగం రాము, పార్టీ జిల్లా యువజన కార్యదర్శి వెలివెల చినబాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు తిరుమాని శ్రీనివాస్, మండల కార్యదర్శి ముత్యాల రాధాకృష్ణ, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ గూట్ల జయేశ్వరరావు, పార్టీ మండల కార్యదర్శులు కూనసాని రాంబాబు, కొల్లాటి కృష్ణ, నాయకులు గంధం నాగరాజు, దానియేలు, రాయపురెడ్డి శ్రీను పాల్గొన్నారు.
Advertisement
Advertisement