ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. గురువారం రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు అయింది. అయితే బెయిల్ పొందిన కేజ్రీవాల్ రూ. 1 లక్ష రూపాయల పూచీకత్తను సమర్పించాలని ప్రత్యేక న్యాయమూర్తి న్యాయ బిందు ఆదేశాలను జారీ చేశారు.
దర్యాప్తును అడ్డుకోవడానికి, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని ఆదేవించారు. అంతేగాక అవసరం ఉన్నప్పుడు కోర్టుకు హాజరు కావాలని, విచారణకు సహకరించాలని పేర్కొన్నారు. అయితే48 గంటల పాటు బెయిల్ ఆర్డరును నిలిపివేయాలని ఈడీ తరపున న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈడీ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.
ఎట్టకేలకు బెయిల్ లభించడంతో కేజ్రీవాల్ నేడు(శుక్రవారం) తిహార్ జైలు నుంచి బయటకు రానున్నారు. సీఎం విడుదల నేపథ్యంలో ఆప్ నేతలు నేడు ఆయన్ను కలవనున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో మంత్రి అతిషి, భార్య సునీతా, ఇతర ఆప్ నేతలు తీహార్ జైలుకు వెళ్లనున్నారు.
మరోవైపు దేశ రాజధానిలో నెలకొన్ని నీటి సంక్షోభంపై అధికార ఆప్ ప్రభుత్వం ఆందోళనలకు సిద్ధమవుతోంది. నేటి సాయంత్రం కేజ్రీవాల్ విడుదలకు ముందేనీటి కొరతపై నిరసన వ్యక్తం చేయనున్నారు. ఈ ఆందోళనల్లో మంత్రి అతిషి, కేజ్రీవాల్ సతీమణి సునీతా రాజ్ ఘాట్‌ను సందర్శించనున్నారు, అక్కడ నిరవధిక నిరాహారదీక్ష చేశారు. కాగా దేశ రాజధానికి నీటిని రాకుండా పొరుగున ఉన్న హర్యానా అడ్డుకుంటోందని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
హర్యానా యమునా నదికి నీటిని విడుదల చేయనంత వరకు ఢిల్లీలో నీటి కొరత కొనసాగుతుందని అతిషి పేర్కొన్నారు. మునక్ కెనాల్‌కు చాలా తక్కువ నీరు వస్తోందని, వజీరాబాద్ బ్యారేజీకి నీరు రావడం లేదని అన్నారు. యమునా నుంచి నీరు నీటి శుద్ధికి వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ ప్రజలకు సరాఫరా అవుతోందన్నారు. అయితే యమునాలో నీటి శాతం తక్కువ ఉందని పేర్కొన్నారు. అందుకే ఢిల్లీ ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ తాను హర్యానా ప్రభుత్వం ముందు చేతులు కట్టుకుని నిలబడి అర్థిస్తున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా నీటి సమస్యతో పాటు హస్తీనాను ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఢిల్లీలో 50 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులు, వడదెబ్బలతో అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. గత నాలుగు రోజుల్లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 20 మందికి పైగా ప్రాణాలు విడిచారు.
Comments
Please login to add a commentAdd a comment