న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా మంత్రి అతిషి మర్లేనాను ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ప్రస్తుత సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆమె పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో.. కేజ్రీవాల్ సాయంత్రంలోపు తన పదవికి రాజీనామా చేయనున్నారు.
ఈ క్రమంలో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసేందుకు అరవింద్ కేజ్రీవాల్ నేడు అపాయింట్‌మెంట్ కోరారు. సాయంత్రం 4 గంటలకు ఎల్జీతో భేటీ కానున్నారు. గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. అయితే ఎల్జీ ఎంతవేగంగా కేజ్రీవాల్ రాజీనామాపై నిర్ణయం తీసుకుంటే.. అతిషి సీఎంగా ఎప్పుడు ప్రమాణం చేస్తారనేదానిపై స్పష్టత వస్తుంది.
ఇక.. ఆప్ నుంచి కొత్త ముఖ్యమంత్రి రేసులో కేజ్రీవాల్ సతీమణి సునీత సహా పలువురి పేర్లు వినిపించాయి. చివరకు అతిషి మర్లెనకు అవకాశం దక్కింది. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ జైలుకు వెళ్లాక.. పాలన కుంటుపడకుండా అతిషీనే చూసుకున్నారు. వివాదాలకు దూరంగా ఉంటారని ఆమెకు పేరుంది. ప్రస్తుతం ఆమె విద్యాశాఖతో పాటు పలు మంత్రిత్వ శాఖలు చూసుకుంటున్నారు.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. తిహార్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మళ్లీ విజయం సాధించిన తర్వాతే సీఎం పదవిని చేపడతానని కేజ్రీవాల్ ప్రకటించారు. ‘ప్రజలు తమ తీర్పును ప్రకటించే వరకు తాను సీఎం కుర్చీలో కూర్చోనని స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ముందస్తుగా ఈ నవంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ కోరుతున్నారు. నవంబర్ నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ ఇప్పటికే డిమాండ్ చేశారు. దీంతో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్న వాదన వినిపిస్తోంది.
ఇదీ చదవండి: రాజీనామా వ్యూహమిదే!
Comments
Please login to add a commentAdd a comment