యంగెస్ట్‌ ప్రెసిడెంట్‌..నీళ్ల కోసం గెలిచింది | 22 Year Old Sharukala Elected Panchayat President In Tamil Nadu | Sakshi
Sakshi News home page

యంగెస్ట్‌ ప్రెసిడెంట్‌..నీళ్ల కోసం గెలిచింది

Published Tue, Oct 19 2021 12:20 AM | Last Updated on Tue, Oct 19 2021 5:28 AM

22 Year Old Sharukala Elected Panchayat President In Tamil Nadu - Sakshi

‘ఇంటి ముందుకు నీళ్లు రావాలి. అది నా లక్ష్యం’ అంది షారుకళ. 22 ఏళ్ల ఈ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్‌   తమిళనాడులో జరిగిన స్థానిక ఎన్నికల్లో   యంగెస్ట్‌ పంచాయతీ ప్రెసిడెంట్‌గా గెలుపొందింది. తెన్‌కాశీ సమీపంలోని తన ఊరి చుట్టుపక్కల ఎప్పుడూ నీళ్ల కోసం అవస్థలే. ఆ నీటి కోసం ఆమె నిలబడింది. ‘రాజకీయాల్లో యువత రావాలి. పనులు ఇంకా బాగా జరుగుతాయి’ అంటోంది.

తమిళనాడులో ‘కరువు’ ఆధార్‌ కార్డ్‌ తీసుకుంటే దాని మీద అడ్రస్‌ ‘తెన్‌కాశీ’ అని ఉంటుంది. నీటి కటకట ఎక్కువ ఆ ప్రాంతంలో. హటాత్‌ వానలు కురిస్తే కొన్ని పల్లెలు దీవులు అవుతాయి. తెన్‌కాశీకి సమీపంలో ఉండే లక్ష్మీయూర్‌లో పుట్టిన షారుకళ చిన్నప్పటి నుంచి ఇదంతా చూస్తోంది. వాళ్ల నాన్న రవి సుబ్రహ్మణ్యం రైతు. తల్లి స్కూల్‌ టీచర్‌. వాళ్లిద్దరూ ఒక్కోసారి చుట్టుపక్కల ఊళ్లలో నీటి బాధలు చూళ్లేక సొంత డబ్బులతో ట్యాంకర్లు తిప్పారు. కాని అది ఒకరిద్దరి వల్ల జరిగే పని కాదు. ఏం చేయాలి? అవును.. ఏం చేయాలి అనుకుంటుంది షారుకళ.

ఎన్నికలొచ్చాయి
తమిళనాడులో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటీవల ఆ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం 9 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. తెన్‌కాశీ కూడా జిల్లా అయ్యింది. అన్ని చోట్ల స్థానిక ఎన్నికలు ఊపు మీద జరిగాయి. ‘ఇది మంచి చాన్స్‌ అనుకుంది’ షారుకళ. కోయంబత్తూరులోని హిందూస్తాన్‌ యూనివర్సిటీలో పి.జి చేస్తున్న షారుకళ సెలవలకు ఇంటికి వచ్చి ఈ తతంగం మొదలైనప్పటి నుంచి నేను కూడా ఎలక్షన్స్‌లో నిలబడతా అని చెప్పసాగింది.

సరదాకి చెబుతోంది అనుకున్నారు తల్లిదండ్రులు. నామినేషన్స్‌ సమయానికి ఆమెకు స్థానిక నాయకుల మద్దతు దొరకడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యంగానే సరేనన్నారు. షారుకళ నామినేషన్‌ వేసింది. ఆమె ఊరు వెంకటపట్టి పంచాయతీ కిందకు వస్తుంది. ఆ పంచాయితీకి గత 15 ఏళ్లుగా గణేశన్‌ అనే వ్యక్తి ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. అతడు మరణించడం వల్లా, ఆ స్థానం ఈసారి స్త్రీలకు రిజర్వ్‌ కావడం వల్ల అతని భార్య ప్రధాన పోటీదారు అయ్యింది. ఆమెతో పాటు మరో ముగ్గురు మహిళలు కూడా నామినేషన్స్‌ వేశారు.  

గట్టి అభ్యర్థి షారుకళ
కాని షారుకళ వెరవలేదు. ఢీ అంటే ఢీ అంది. ప్రత్యర్థులు ఊరికే ఉండలేదు.  ఆమె మీద బాగా ప్రతికూల ప్రచారం చేశారు. ‘ఆ అమ్మాయి చదువుకోడానికి పట్నం వెళ్లిపోతుంది. లేదంటే రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. అప్పుడేం చేస్తారు’ అని ప్రచారం చేశారు. ‘ఆ అమ్మాయికి పొగరు. వాళ్ల ఇంటికి వెళితే కుక్కను వదులుతుంది’ అనీ ప్రచారం చేశారు. కాని షారుకళ అందరినీ కలిసింది. ‘మన పంచాయితీలోని ప్రతి ఊళ్లో ప్రతి గడప దగ్గరకు నీళ్లు వచ్చేలా చేయడం కోసం ఎన్నికల్లో నిలబడ్డాను’ అని చెప్పింది.

‘మన ఊళ్లల్లో పిల్లలు బాగా ఆటలాడతారు. వారి కోసం గ్రౌండ్స్‌ ఏర్పాటు చేయాలి. విద్యార్థుల కోసం లైబ్రరీలు ఏర్పాటు చేయాలి. పార్కులు కూడా కావాలి. ఇవన్నీ నేను గెలిస్తే ఏర్పాటు చేస్తాను’ అని షారుకళ చెప్పింది. ‘యువతకు అవకాశం ఇవ్వండి. చేసి చూపిస్తారు’ అని చెప్పింది. మహిళలు చాలామంది షారుకళను అభిమానించారు. ‘మా ఇంటి ఆడపిల్లలా ఉన్నావు. నీకే ఓటేస్తాం’ అన్నారు.

గెలుపు
వెంకటపట్టి పంచాయతీలో మొత్తం 6,362 ఓట్లు ఉన్నాయి. ప్రత్యర్థి మహిళకు 2,540 ఓట్లు వచ్చాయి. ఆమె మీద 796 ఓట్ల మెజారిటీతో షారుకళ గెలిచింది. మరో ముగ్గురు మహిళలకు డిపాజిట్లు లేవు. గ్రామస్తులు ఆమెకు రంగులు జల్లి దండలు వేసి సత్కరించుకున్నారు. ‘అమ్మా.. మాతో ఉండు. మా సమస్యలు నెరవేర్చు’ అని చెప్పుకున్నారు. ‘ఆ... ఆ అమ్మాయికి ఏం తెలుసు... రేపటి నుంచి వాళ్ల నాన్న ఆట ఆడిస్తారు’ అనే మాటలు షారుకళ చెవిన పడ్డాయి. వెంటనే షారుకళ ‘మన పంచాయతీకి నేను మాత్రమే ప్రెసిడెంట్‌. మా నాన్నో, లేదా మా ఇంటి మగవాళ్లో నా మీద గాని నా పదవి మీద గాని పెత్తనం చేయరు. నిర్ణయాలు నావే. ప్రజలు నాతోనే మాట్లాడాలి’ అని స్పష్టం చేసింది.

 ఆ అమ్మాయి స్పష్టత, ఆత్మవిశ్వాసం, సంకల్పం చూస్తుంటే భవిష్యత్తులో క్రియాశీల రాజకీయాల్లో పెద్ద పేరు అవుతుందని అనిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement