panchayat president
-
89 ఏళ్ల పంచాయతీ ప్రెసిడెంట్!ఆమె ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే!
కొందరూ వయసులో వృద్ధులుగా ఉన్నప్పటికీ పనులు మాత్రం యువకుల కంటే మిన్నగా ఉంటాయి. వృద్ధులమన్నా భావనే లేశమంత లేకుండా భలే చాకచక్యంగా అసాధ్యమైన పనులు చేసి ఔరా! అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందిన వారే తమిళనాడుకు చెందిన 89 ఏళ్ల బామ్మ. రెస్ట్ తీసుకునే వయసులో పంచాయతీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ..అధికారుల చేత శభాష్! అనిపించుకుంటున్నారు. వివరాల్లోకెళ్తే..తమిళనాడుకి చెందిన 89 ఏళ్ల వీరమ్మాళ్ స్ఫూర్తిదాయకమైన మహిళ. ఆమె స్థైర్యం, దృఢ సంకల్పం ప్రజలనే కాదు అధికారులను విస్మయానికి గురిచేసింది. అత్యంత వృద్ధురాలైన పంచాయతీ ప్రెసిడెంట్ తనదైన ముద్ర వేసింది. పెదాలపై చెరగని చిరునవ్వు, హద్దుల్లేని ఉత్సాహం అందర్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఏం చేయలేనంటూ వణుకుతూ మూలన కూర్చొనే వయసులో.. ఎంతో ఉత్సహాంగా అరిట్టపట్టి పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేసి ప్రెసిడెంట్‌గా గెలవడమే కాగా అందరూ మెచ్చుకునేలా బాధ్యతలను నిర్వర్తించి శభాష్ అనిపించుకుంటోంది. మిల్లెట్స్ వంటి సంప్రదాయ భోజనం, వ్యవసాయ క్షేత్రంలో రోజంతా పనిచేయడం అదే తన ఫిట్నెస్ రహస్యం అని చెబుతోంది వీరమ్మాళ్. వీరమ్మాళ్ నాయకత్వంలో అరిట్టపట్టి మధురై జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందడం విశేషం. ఈ విషయాన్ని ఇండియన్ అడ్మిన్‌స్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ సుప్రియా సాహు ఆన్లైన్ వేదికగా పంచుకుంటూ నెట్టింట ఆమె ఫోటోని, వీడియోని షేర్ చేసింది. దీంతో నెటిజన్లు 'సాధారణ జీవన విధానం ఎల్లప్పుడూ ఉత్తమమైందే'! అని ఒకరు, ఆ ఏజ్‌లో కూడా లీడర్‌గా ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నందుకు ఆమెకు అవార్డు ఇవ్వాలి అని మరోకరూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. Veerammal Amma, popularly known as "Arittapatti Paati' the 89 years old Panchayat President of Arittapatti Panchayat is truly an inspiring woman. Fit as a fiddle she is the oldest Panchayat President in TN. Her infectious smile & unbridled enthusiasm is so heatwarming. When I… pic.twitter.com/ol7M2tpqIr — Supriya Sahu IAS (@supriyasahuias) August 30, 2023 (చదవండి: ఇండియన్ బ్యాలెరినా! బ్యాలె డ్యాన్స్‌లో రాణిస్తున్న హైదరాబాదీ!) -
యంగెస్ట్ ప్రెసిడెంట్..నీళ్ల కోసం గెలిచింది
‘ఇంటి ముందుకు నీళ్లు రావాలి. అది నా లక్ష్యం’ అంది షారుకళ. 22 ఏళ్ల ఈ పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్టూడెంట్ తమిళనాడులో జరిగిన స్థానిక ఎన్నికల్లో యంగెస్ట్ పంచాయతీ ప్రెసిడెంట్‌గా గెలుపొందింది. తెన్‌కాశీ సమీపంలోని తన ఊరి చుట్టుపక్కల ఎప్పుడూ నీళ్ల కోసం అవస్థలే. ఆ నీటి కోసం ఆమె నిలబడింది. ‘రాజకీయాల్లో యువత రావాలి. పనులు ఇంకా బాగా జరుగుతాయి’ అంటోంది. తమిళనాడులో ‘కరువు’ ఆధార్ కార్డ్ తీసుకుంటే దాని మీద అడ్రస్ ‘తెన్‌కాశీ’ అని ఉంటుంది. నీటి కటకట ఎక్కువ ఆ ప్రాంతంలో. హటాత్ వానలు కురిస్తే కొన్ని పల్లెలు దీవులు అవుతాయి. తెన్కాశీకి సమీపంలో ఉండే లక్ష్మీయూర్‌లో పుట్టిన షారుకళ చిన్నప్పటి నుంచి ఇదంతా చూస్తోంది. వాళ్ల నాన్న రవి సుబ్రహ్మణ్యం రైతు. తల్లి స్కూల్ టీచర్. వాళ్లిద్దరూ ఒక్కోసారి చుట్టుపక్కల ఊళ్లలో నీటి బాధలు చూళ్లేక సొంత డబ్బులతో ట్యాంకర్లు తిప్పారు. కాని అది ఒకరిద్దరి వల్ల జరిగే పని కాదు. ఏం చేయాలి? అవును.. ఏం చేయాలి అనుకుంటుంది షారుకళ. ఎన్నికలొచ్చాయి తమిళనాడులో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటీవల ఆ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం 9 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. తెన్‌కాశీ కూడా జిల్లా అయ్యింది. అన్ని చోట్ల స్థానిక ఎన్నికలు ఊపు మీద జరిగాయి. ‘ఇది మంచి చాన్స్ అనుకుంది’ షారుకళ. కోయంబత్తూరులోని హిందూస్తాన్ యూనివర్సిటీలో పి.జి చేస్తున్న షారుకళ సెలవలకు ఇంటికి వచ్చి ఈ తతంగం మొదలైనప్పటి నుంచి నేను కూడా ఎలక్షన్స్‌లో నిలబడతా అని చెప్పసాగింది. సరదాకి చెబుతోంది అనుకున్నారు తల్లిదండ్రులు. నామినేషన్స్ సమయానికి ఆమెకు స్థానిక నాయకుల మద్దతు దొరకడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యంగానే సరేనన్నారు. షారుకళ నామినేషన్ వేసింది. ఆమె ఊరు వెంకటపట్టి పంచాయతీ కిందకు వస్తుంది. ఆ పంచాయితీకి గత 15 ఏళ్లుగా గణేశన్ అనే వ్యక్తి ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. అతడు మరణించడం వల్లా, ఆ స్థానం ఈసారి స్త్రీలకు రిజర్వ్ కావడం వల్ల అతని భార్య ప్రధాన పోటీదారు అయ్యింది. ఆమెతో పాటు మరో ముగ్గురు మహిళలు కూడా నామినేషన్స్ వేశారు. గట్టి అభ్యర్థి షారుకళ కాని షారుకళ వెరవలేదు. ఢీ అంటే ఢీ అంది. ప్రత్యర్థులు ఊరికే ఉండలేదు. ఆమె మీద బాగా ప్రతికూల ప్రచారం చేశారు. ‘ఆ అమ్మాయి చదువుకోడానికి పట్నం వెళ్లిపోతుంది. లేదంటే రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. అప్పుడేం చేస్తారు’ అని ప్రచారం చేశారు. ‘ఆ అమ్మాయికి పొగరు. వాళ్ల ఇంటికి వెళితే కుక్కను వదులుతుంది’ అనీ ప్రచారం చేశారు. కాని షారుకళ అందరినీ కలిసింది. ‘మన పంచాయితీలోని ప్రతి ఊళ్లో ప్రతి గడప దగ్గరకు నీళ్లు వచ్చేలా చేయడం కోసం ఎన్నికల్లో నిలబడ్డాను’ అని చెప్పింది. ‘మన ఊళ్లల్లో పిల్లలు బాగా ఆటలాడతారు. వారి కోసం గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలి. విద్యార్థుల కోసం లైబ్రరీలు ఏర్పాటు చేయాలి. పార్కులు కూడా కావాలి. ఇవన్నీ నేను గెలిస్తే ఏర్పాటు చేస్తాను’ అని షారుకళ చెప్పింది. ‘యువతకు అవకాశం ఇవ్వండి. చేసి చూపిస్తారు’ అని చెప్పింది. మహిళలు చాలామంది షారుకళను అభిమానించారు. ‘మా ఇంటి ఆడపిల్లలా ఉన్నావు. నీకే ఓటేస్తాం’ అన్నారు. గెలుపు వెంకటపట్టి పంచాయతీలో మొత్తం 6,362 ఓట్లు ఉన్నాయి. ప్రత్యర్థి మహిళకు 2,540 ఓట్లు వచ్చాయి. ఆమె మీద 796 ఓట్ల మెజారిటీతో షారుకళ గెలిచింది. మరో ముగ్గురు మహిళలకు డిపాజిట్లు లేవు. గ్రామస్తులు ఆమెకు రంగులు జల్లి దండలు వేసి సత్కరించుకున్నారు. ‘అమ్మా.. మాతో ఉండు. మా సమస్యలు నెరవేర్చు’ అని చెప్పుకున్నారు. ‘ఆ... ఆ అమ్మాయికి ఏం తెలుసు... రేపటి నుంచి వాళ్ల నాన్న ఆట ఆడిస్తారు’ అనే మాటలు షారుకళ చెవిన పడ్డాయి. వెంటనే షారుకళ ‘మన పంచాయతీకి నేను మాత్రమే ప్రెసిడెంట్. మా నాన్నో, లేదా మా ఇంటి మగవాళ్లో నా మీద గాని నా పదవి మీద గాని పెత్తనం చేయరు. నిర్ణయాలు నావే. ప్రజలు నాతోనే మాట్లాడాలి’ అని స్పష్టం చేసింది. ఆ అమ్మాయి స్పష్టత, ఆత్మవిశ్వాసం, సంకల్పం చూస్తుంటే భవిష్యత్తులో క్రియాశీల రాజకీయాల్లో పెద్ద పేరు అవుతుందని అనిపిస్తోంది. -
ఈ బామ్మ అదుర్స్..లేటు వయసులో ఇలా..
కాస్త పొద్దుపొడవక ముందే నిద్రలేవమంటే నేటితరం యువత వామ్మో అంటారు. ఎంతో యాక్టివ్‌గా ఉండాల్సిన వాళ్లు డీలా పడిపోతుంటే..వయసుపైబడిన బామ్మ మాత్రం లేడిపిల్లలా తిరుగుతూ, ఎన్నో సమస్యలను చక్కబెడుతున్నారు. కేరళలోని 88 ఏళ్ల దాక్షాయణమ్మ ఇప్పటికీ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ...ఉదయం ఐదు గంటల నుంచే తన విధుల్లో మునిగిపోతారు. లేటు వయసు బామ్మ.. ఉదయం ఐదుగంటలకే లేచి పనులు చేయడం ఏంటీ? అనుకుంటున్నారా.. అవును మీరు చదివింది నిజమే. కర్ణాటకలోని చిక్క ఎమ్మిగ్నూరు గ్రామపంచాయితీ సర్పంచ్‌గా దాక్షాయణమ్మ ఎంతో చక్కగా సేవలందిస్తున్నారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరించడంతోపాటు..గ్రామాన్నీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. దీంతో గ్రామస్థులు దాక్షాయణమ్మని అజ్జీ అని ప్రేమగా పిలుచుకుంటారు. కన్నడ భాషలో అజ్జీ అంటే బామ్మ అని అర్థం. ఉదయం ఐదుగంటల నుంచే ఆమె గ్రామంలో పర్యటిస్తూ.. గ్రామంలో జరిగే పనులను పర్యవేక్షించడం, స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకోని పరిష్కరిస్తుంటారు. ఈ వయసులోనూ గ్రామసర్పంచిగా రాణిస్తున్న అజ్జీ.. చిక్కఎమ్మిగ్నూరు, చిక్కనకట్టే, కొడగవల్లీ, కొడగవల్లి హట్టీ, కొటేహలు, హోసాహల్లీ, అయ్యన హల్లీ గ్రామాల్లోని 7,500 మందికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నారు. గ్రామాభివృద్ధిని కోరుకునే ఆమె.. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, విద్యుత్ వంటి అనేక అంశాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారు. రోజూ ఎన్నో పనులతో తీరికలేకుండా ఉండే ఆమె .. వయసును అస్సలు లెక్క చేయరు. ‘‘నాకేమీ వయసు అయిపోలేదు. నేను ఎంతో జీవితాన్ని చూసాను, నా అనుభవంతో గ్రామాన్నీ అభివృద్ధి పథంలో నడిపిస్తానని ధీమాగా చెబుతున్నారు. 1940ల్లోనే అజ్జీ ఏడోతరగతి పూర్తిచేశారు. ఆ తరువాత ఆమెకు పెళ్లి అవడంతో పై చదువులు చదవలేకపోయారు. వివాహనంతరం ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు కొడుకులను తీర్చిదిద్దడంలో మునిగిపోయారు. ఎడ్యుకేషన్ విలువ బాగా తెలిసిన అజ్జీ తన ముగ్గురు కొడుకులని మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. ఆమె కొడుకులలో ఒకరైన బీఎస్ శివమూర్తి కర్ణాటక గ్రామీణ బ్యాంక్‌లో రీజనల్ మేనేజర్‌గా రిటైర్డ్ అయ్యారు. మరో కొడుకు వీరభద్రప్ప బెంగళూరులోని బీఈఎమ్‌ఎల్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. మూడో కొడుకు చిత్రదుర్గ జిల్లా కోర్టులో అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. ముగ్గురు అమ్మాయిలు మాత్రం గృహిణులుగా స్థిరపడ్డారు. ఆడపడుచులు గౌరవంగా బతకాలి గ్రామంలోని స్త్రీలందరూ ఎటువంటి భయం, సిగ్గు వంటి వాటికి లోను కాకుండా ఉండేందుకు టాయిలెట్స్‌ను ఏర్పాటు చేయడం నాకున్న లక్ష్యాల్లో ఒకటని అజ్జీ చెప్పారు. ‘‘గ్రామీణప్రాంతాల్లో ఎదురయ్యే మరో ముఖ్యమైన అంశం నిరక్షరాస్యత. ఈ తరం పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడం ద్వారా ఎవరి కాళ్ల మీద వాళ్లు ఆర్థిక స్వాతంత్య్రంతో నిలబడడమేగాక, దేశంలో బాధ్యతగల పౌరులుగా మెలుగుతారని అజ్జీ చెప్పారు. ఎమ్జీఎన్ఆర్ఈజీఏ గ్రామాల్లోని ప్రజలకు ప్రేరణ కలిగిస్తూ మరింత సమర్థవంతంగా పనిచేస్తే చిక్కఎమ్మిగ్నూరు మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆమెకు పెద్దపోస్టులు ఏమీ అవసరంలేదు.. దాక్షాయణమ్మకు పెద్ద పోస్టులు ఏవీ అవసరం లేదని చిక్కఎమ్మిగ్నూరు గ్రామ ప్రజలు చెప్పారు. 2016లో గ్రామం తీవ్ర నీటి కొరత ను ఎదుర్కొంది. ఆ çసమయంలో అజ్జీ తన సొంత పొలంలో బోరు వేయించి.. అక్కడినుంచి ఒక పైప్ లైన్ ద్వారా గ్రామస్థులందరికీ రోజూ నీళ్లు అందేలా చేశారు. బోర్ వేయడానికి, ౖపైప్‌లైన్ ఏర్పాటుకయ్యే ఖర్చుమొత్తాన్ని అజ్జీయే భరించారని వారు చెప్పారు. ఇంతటి ఔదార్యం ఉన్న ఆమె.. వృత్తిరీత్యా పిల్లలు వేరు వేరు నగరాల్లో ఉండడంతో గ్రామంలో ఒంటరిగానే ఉంటున్నారు. అయినా ఆమె ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ కాలేదు. రోజూ తన పొలం పనులు చూడడానికి వెళ్లే అజ్జీ పనిచేయడానికి వచ్చే కూలీలకు స్వయంగా వంటచేసి వడ్డిస్తారు. పంచాయితీని పాలించేంత బలంగా ఉన్నారు మా బామ్మ గ్రామపంచాయతినీ పరిపాలించేంత బలంగా ఉన్నారని అజ్జీ మనవడు అరుణ్ చెప్పాడు.‘‘ఈ వయసులో కూడా గ్రామ సమస్యలు పరిష్కరించడం, గ్రామంలోని తమ పొలాలను ఒంటరిగానే చూసుకోగలుగుతున్నారు. అమె ఆరోగ్యంగా ఉండడమేగాక.. 88 ఏళ్ల వయసులోనూ అజ్జీ కంటిచూపు ఎంతో చురుకుగా ఉంది. అందుకే ఆమె కళ్లజోడు లేకుండా న్యూస్‌పేపర్లు, డాక్యుమెంట్లను అవలీలగా చదివేస్తారు. బామ్మ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు కానీ బేసిక్ హ్యాండ్ సెట్ ఉంది. దానిలో కాల్స్‌ను రిసీవ్ చేసుకుని మాట్లాడతారు. ఆమెకు తన సంతకాన్నీ ఇంగ్లీషులో ఎలా చేయాలో కూడా తెలుసునని’’ అరుణ్‌కుమార్ చెప్పాడు. -
అధ్యక్షుడు– ఉపాధ్యక్షురాలి ప్రేమపెళ్లి
సాక్షి, బెంగళూరు : తాలూకా పంచాయతి అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ అపురూప వివాహం కలబురిగి జిల్లా అఫ్జలపుర తాలూకాలో చోటు చేసుకొంది. టీపీ అధ్యక్షుడు భీమాశంకర హొన్నికేరి (బీజేపీ), ఉపాధ్యక్షురాలు రుక్మిణీ జమేదార్ (కాంగ్రెస్)లు కలిసి పనిచేస్తూ ప్రేమలో పడిపోయారు. అవివాహితులే కాబట్టి పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. పార్టీలు వేరువేరు అయినా ఆ సంగతిని పక్కనపెట్టి ఇరుకుటుంబాలను ప్రేమపెళ్లికి ఒప్పించారు. దీంతో మంగళవారం లాక్డౌన్ నిబంధనల మధ్య సరళంగా మూడుముళ్ల వేడుక జరిగింది. పలు పార్టీల నాయకులు హాజరై దీవించారు. కర్ణాటక మంత్రికి కరోనా పాజిటివ్ -
దళిత మహిళకు సీటు.. ఎన్నికల బహిష్కరణ
చెన్నై: కుల వివక్ష నేటికీ కొనసాగుతోందనడానికి ఉదాహరణగా నిలిచారు తమిళనాడుకు చెందిన తూత్తుకుడి గ్రామస్తులు. అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ కోసం శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో దళిత మహిళకు సీటు కేటాయించడంతో నాడార్ కులానికి చెందిన వారు ఏకంగా ఆ ఎన్నికలనే బహిష్కరించారు. పిచ్చావిళై గ్రామంలో 785 ఓటర్లలో ఆరుగురు దళితులు పంచాయతీ ప్రెసిడెంట్ కోసం నిర్వహించిన ఎన్నికల్లో ఓటు వేశారు. నాడార్ కులానికి చెందిన మిగతా 779 మంది ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేయకుండా వారి ఇళ్ల ముందు నల్లటి జెండాలను ఉంచి నిరసనలను తెలిపారు. తాలూకా అధికారి వారిని ఓటు వేయాలని కోరినప్పటికీ వారు దాన్ని పెడచెవిన పెట్టి బహిష్కరించారు. ‘సీట్ల కేటాయింపు న్యాయంగా లేదు. మేం ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మాకు నచ్చిన అభ్యర్థిని ఉంచడానికి అనుమతించలేదు. అందుకే మేం ఎన్నికలను బహిష్కరించాం’అని మడిసుదు అనే స్థానికుడు తెలిపారు. -
పంచాయతీ అధ్యక్షుడి హత్య
• మరొకరికి బెదిరింపు • నిందితులను అరెస్టు చేయాలని రాస్తారోకో • వాహనాలపై దాడికి యత్నం తిరువళ్లూరు: పాతకక్షలతో ఓ పంచాయతీ అధ్యక్షుడు నడి రోడ్డుపై హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన తిరువళ్లూరు సమీపంలోని వెళ్లవేడు వద్ద చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా మేల్‌మణంబేడు గ్రామానికి చెందిన తంగరాజ్ రియల్టర్. ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహించే తంగరాజ్ పదేళ్ల నుంచి అదే గ్రామానికి పంచాయతీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం యథావిధిగా వాకింగ్ వెళుతున్న తంగరాజ్‌ను మూడు ద్విచక్ర వాహనాలతో వచ్చిన ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా నరికి హత్య చేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ శ్యామ్సన్, డీఎస్పీ ఈశ్వరన్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టడంతో పాటు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం రూబి అనే పోలీసు జాగిలాన్ని రప్పించి విచారణ చేపట్టారు. పంచాయతీ అధ్యక్షుడి హత్యతో మేల్‌మణంబేడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చే యడంతో పాటు భారీగా పోలీసులను మోహరించారు. రాస్తారోకో-వాహనాలపై దాడికి యత్నం తంగరాజ్ హత్య నేపథ్యంలో పోలీసులు అదే గ్రామానికి చెందిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడానికి ప్రయత్నించారు. అయితే హత్య చేసినట్టు అనుమానం ఉన్న వారిని కాకుండా మృతుని బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపించిన గ్రామస్తులు రాస్తారోకో చేయడానికి ప్రయత్నించారు. అటు వైపు వస్తున్న వాహనాలపై దాడికి దిగారు. దీంతో వాహనంలో ఉన్న డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు వాహనాన్ని నడిరోడ్డులో వదిలిపెట్టి పరుగులు పెట్టారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు జరిపారు. హత్య కేసులో సంబంధం ఉన్న వ్యక్తులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. పాతకక్షలే కారణం తంగరాజ్ హత్యకు పాతకక్ష్యలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 1998వ సంవత్సరంలో తంగరాజ్ అనుచరులు అదే గ్రామానికి చెందిన మనోహరన్‌ను హత్య చేశారని, వారి బంధువులే హత్య చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇది ఇలా వుండగా పది సంవత్సరాల నుంచి పంచాయతీ అధ్యక్షుడిగా ఉన్న తంగరాజ్, ప్రస్తుతం తన భార్య పేరిట నామినేషన్‌ను దాఖలు చేశాడు. దీంతో ఎన్నికల నుంచి తప్పుకోవాలని కొందరు బెదిరించారన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. ఇది ఇలా వుండగా మేల్‌మణంబేడు పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన మణివేలు అనే వ్యక్తిపై సైతం దుండగులు దాడి చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసుపై సైతం పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.