పంచాయతీ అధ్యక్షుడి హత్య | Panchayat president's murder | Sakshi
Sakshi News home page

పంచాయతీ అధ్యక్షుడి హత్య

Published Sat, Oct 15 2016 1:43 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

పాతకక్షలతో ఓ పంచాయతీ అధ్యక్షుడు నడి రోడ్డుపై హత్యకు గురయ్యాడు.

మరొకరికి బెదిరింపు
•  నిందితులను అరెస్టు చేయాలని రాస్తారోకో
వాహనాలపై దాడికి యత్నం
 

తిరువళ్లూరు: పాతకక్షలతో ఓ పంచాయతీ అధ్యక్షుడు నడి రోడ్డుపై హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన తిరువళ్లూరు సమీపంలోని వెళ్లవేడు వద్ద చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా మేల్‌మణంబేడు గ్రామానికి చెందిన తంగరాజ్ రియల్టర్. ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహించే తంగరాజ్ పదేళ్ల నుంచి అదే గ్రామానికి పంచాయతీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం యథావిధిగా వాకింగ్ వెళుతున్న తంగరాజ్‌ను మూడు ద్విచక్ర వాహనాలతో వచ్చిన ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా నరికి హత్య చేశారు.

విషయం తెలుసుకున్న ఎస్పీ శ్యామ్‌సన్, డీఎస్పీ ఈశ్వరన్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టడంతో పాటు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం  రూబి అనే పోలీసు జాగిలాన్ని రప్పించి విచారణ చేపట్టారు. పంచాయతీ అధ్యక్షుడి హత్యతో మేల్‌మణంబేడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చే యడంతో పాటు భారీగా పోలీసులను మోహరించారు.

రాస్తారోకో-వాహనాలపై దాడికి యత్నం
తంగరాజ్ హత్య నేపథ్యంలో పోలీసులు అదే గ్రామానికి చెందిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడానికి ప్రయత్నించారు. అయితే హత్య చేసినట్టు అనుమానం ఉన్న వారిని కాకుండా మృతుని బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపించిన గ్రామస్తులు రాస్తారోకో చేయడానికి ప్రయత్నించారు. అటు వైపు వస్తున్న వాహనాలపై దాడికి దిగారు. దీంతో వాహనంలో ఉన్న డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు వాహనాన్ని నడిరోడ్డులో వదిలిపెట్టి పరుగులు పెట్టారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు జరిపారు. హత్య కేసులో సంబంధం ఉన్న వ్యక్తులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

పాతకక్షలే కారణం
 తంగరాజ్ హత్యకు పాతకక్ష్యలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 1998వ సంవత్సరంలో తంగరాజ్ అనుచరులు అదే గ్రామానికి చెందిన మనోహరన్‌ను హత్య చేశారని, వారి బంధువులే హత్య చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇది ఇలా వుండగా పది సంవత్సరాల నుంచి పంచాయతీ అధ్యక్షుడిగా ఉన్న తంగరాజ్, ప్రస్తుతం తన భార్య పేరిట నామినేషన్‌ను దాఖలు చేశాడు. దీంతో ఎన్నికల నుంచి తప్పుకోవాలని కొందరు బెదిరించారన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. ఇది ఇలా వుండగా మేల్‌మణంబేడు పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన మణివేలు అనే వ్యక్తిపై సైతం దుండగులు దాడి చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసుపై సైతం పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement