ఈ బామ్మ అదుర్స్‌..లేటు వయసులో ఇలా.. | Karnataka: Panchayat President Ajji Shows The Way | Sakshi
Sakshi News home page

లేటు వయసులో గ్రేట్‌!  ఈ బామ్మ అదుర్స్‌!!

Published Sun, Feb 21 2021 2:11 PM | Last Updated on Sun, Feb 21 2021 2:11 PM

Karnataka: Panchayat President Ajji Shows The Way - Sakshi

కాస్త పొద్దుపొడవక ముందే నిద్రలేవమంటే నేటితరం యువత వామ్మో అంటారు. ఎంతో యాక్టివ్‌గా ఉండాల్సిన వాళ్లు డీలా పడిపోతుంటే..వయసుపైబడిన బామ్మ మాత్రం లేడిపిల్లలా తిరుగుతూ, ఎన్నో సమస్యలను చక్కబెడుతున్నారు. కేరళలోని 88 ఏళ్ల దాక్షాయణమ్మ ఇప్పటికీ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ...ఉదయం ఐదు గంటల నుంచే తన విధుల్లో మునిగిపోతారు. లేటు వయసు బామ్మ.. ఉదయం ఐదుగంటలకే లేచి పనులు చేయడం ఏంటీ? అనుకుంటున్నారా.. అవును మీరు చదివింది నిజమే.  

కర్ణాటకలోని చిక్క ఎమ్మిగ్నూరు గ్రామపంచాయితీ సర్పంచ్‌గా దాక్షాయణమ్మ ఎంతో చక్కగా సేవలందిస్తున్నారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరించడంతోపాటు..గ్రామాన్నీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. దీంతో గ్రామస్థులు దాక్షాయణమ్మని అజ్జీ అని ప్రేమగా పిలుచుకుంటారు. కన్నడ భాషలో అజ్జీ అంటే బామ్మ అని అర్థం. ఉదయం ఐదుగంటల నుంచే ఆమె గ్రామంలో పర్యటిస్తూ.. గ్రామంలో జరిగే పనులను పర్యవేక్షించడం, స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకోని పరిష్కరిస్తుంటారు. ఈ వయసులోనూ గ్రామసర్పంచిగా రాణిస్తున్న అజ్జీ.. చిక్కఎమ్మిగ్నూరు, చిక్కనకట్టే, కొడగవల్లీ, కొడగవల్లి హట్టీ, కొటేహలు, హోసాహల్లీ, అయ్యన హల్లీ గ్రామాల్లోని 7,500 మందికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నారు.

గ్రామాభివృద్ధిని కోరుకునే ఆమె.. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, విద్యుత్‌ వంటి అనేక అంశాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారు. రోజూ ఎన్నో పనులతో తీరికలేకుండా ఉండే ఆమె .. వయసును అస్సలు లెక్క చేయరు. ‘‘నాకేమీ వయసు అయిపోలేదు. నేను ఎంతో జీవితాన్ని చూసాను, నా అనుభవంతో గ్రామాన్నీ అభివృద్ధి పథంలో నడిపిస్తానని ధీమాగా చెబుతున్నారు. 

1940ల్లోనే అజ్జీ ఏడోతరగతి పూర్తిచేశారు. ఆ తరువాత ఆమెకు పెళ్లి అవడంతో పై చదువులు చదవలేకపోయారు. వివాహనంతరం  ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు కొడుకులను తీర్చిదిద్దడంలో మునిగిపోయారు. ఎడ్యుకేషన్‌ విలువ బాగా తెలిసిన అజ్జీ తన ముగ్గురు కొడుకులని మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. ఆమె కొడుకులలో ఒకరైన బీఎస్‌ శివమూర్తి కర్ణాటక గ్రామీణ బ్యాంక్‌లో రీజనల్‌ మేనేజర్‌గా రిటైర్డ్‌ అయ్యారు. మరో కొడుకు వీరభద్రప్ప బెంగళూరులోని బీఈఎమ్‌ఎల్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. మూడో కొడుకు చిత్రదుర్గ జిల్లా కోర్టులో అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. ముగ్గురు అమ్మాయిలు మాత్రం గృహిణులుగా స్థిరపడ్డారు. 

ఆడపడుచులు గౌరవంగా బతకాలి
గ్రామంలోని స్త్రీలందరూ ఎటువంటి భయం, సిగ్గు వంటి వాటికి లోను కాకుండా ఉండేందుకు టాయిలెట్స్‌ను ఏర్పాటు చేయడం నాకున్న లక్ష్యాల్లో ఒకటని అజ్జీ చెప్పారు. ‘‘గ్రామీణప్రాంతాల్లో ఎదురయ్యే మరో ముఖ్యమైన అంశం నిరక్షరాస్యత. ఈ తరం పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడం ద్వారా ఎవరి కాళ్ల మీద వాళ్లు ఆర్థిక స్వాతంత్య్రంతో నిలబడడమేగాక, దేశంలో బాధ్యతగల పౌరులుగా మెలుగుతారని అజ్జీ చెప్పారు. ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఏ గ్రామాల్లోని ప్రజలకు ప్రేరణ కలిగిస్తూ మరింత సమర్థవంతంగా పనిచేస్తే చిక్కఎమ్మిగ్నూరు మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆమె పేర్కొన్నారు. 

ఆమెకు పెద్దపోస్టులు ఏమీ అవసరంలేదు..
దాక్షాయణమ్మకు పెద్ద పోస్టులు ఏవీ అవసరం లేదని చిక్కఎమ్మిగ్నూరు గ్రామ ప్రజలు చెప్పారు. 2016లో గ్రామం తీవ్ర నీటి కొరత ను ఎదుర్కొంది. ఆ çసమయంలో అజ్జీ తన సొంత పొలంలో బోరు వేయించి.. అక్కడినుంచి ఒక పైప్‌ లైన్‌ ద్వారా గ్రామస్థులందరికీ రోజూ నీళ్లు అందేలా చేశారు. బోర్‌ వేయడానికి, ౖపైప్‌లైన్‌ ఏర్పాటుకయ్యే ఖర్చుమొత్తాన్ని అజ్జీయే భరించారని వారు చెప్పారు. ఇంతటి ఔదార్యం ఉన్న ఆమె.. వృత్తిరీత్యా పిల్లలు వేరు వేరు నగరాల్లో ఉండడంతో గ్రామంలో ఒంటరిగానే ఉంటున్నారు. అయినా ఆమె ఎప్పుడూ ఒంటరిగా ఫీల్‌ కాలేదు. రోజూ తన పొలం పనులు చూడడానికి వెళ్లే అజ్జీ పనిచేయడానికి వచ్చే కూలీలకు స్వయంగా వంటచేసి వడ్డిస్తారు. 

పంచాయితీని పాలించేంత బలంగా ఉన్నారు
మా బామ్మ గ్రామపంచాయతినీ పరిపాలించేంత బలంగా ఉన్నారని అజ్జీ మనవడు అరుణ్‌ చెప్పాడు.‘‘ఈ వయసులో కూడా గ్రామ సమస్యలు పరిష్కరించడం, గ్రామంలోని తమ పొలాలను ఒంటరిగానే చూసుకోగలుగుతున్నారు. అమె ఆరోగ్యంగా ఉండడమేగాక.. 88 ఏళ్ల వయసులోనూ అజ్జీ కంటిచూపు ఎంతో చురుకుగా ఉంది. అందుకే ఆమె కళ్లజోడు లేకుండా న్యూస్‌పేపర్లు, డాక్యుమెంట్లను అవలీలగా చదివేస్తారు. బామ్మ దగ్గర స్మార్ట్‌ ఫోన్‌ లేదు కానీ బేసిక్‌ హ్యాండ్‌ సెట్‌ ఉంది. దానిలో కాల్స్‌ను రిసీవ్‌ చేసుకుని మాట్లాడతారు. ఆమెకు తన సంతకాన్నీ ఇంగ్లీషులో ఎలా చేయాలో కూడా తెలుసునని’’ అరుణ్‌కుమార్‌ చెప్పాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement