ఈ మధ్యకాలంలో పత్రికల్లో హెడ్డింగులు చూస్తూనే ఉన్నారు.. మేము తీసుకున్న చర్యలన్నీ సదుద్దేశంతో, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవే. రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం కావాల్సి ఉంది. అనవసర వ్యయాలను తగ్గిస్తున్నాం. ప్రాధాన్యతల ప్రకారం ముందుకు వెళ్తున్నాం.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కింద చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలన్నీ పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచేవేనని, ఆక్సిజన్ లాంటి వీటికి బ్యాంకర్లు సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. రైతులు, ఆటోలు.. ట్యాక్సీలు నడుపుకుంటున్న వారికి, మత్స్యకారులకు, చేనేతలకు, అగ్రిగోల్డ్ బాధితులకు, కొత్తగా లా పూర్తి చేసిన వారికి.. ఇలా వివిధ వర్గాల వారికి ఇప్పటిదాకా రూ.15 వేల కోట్లకు పైగా నగదు సాయం చేశామని స్పష్టం చేశారు. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి కింద ఈ నెలలో సుమారు రూ.6,500 కోట్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఆర్థిక మందగమనం ఉన్నప్పుడు దాని ప్రభావం సమాజంలోని అట్టడుగు వర్గాలపైనే ఉంటుందని, ఈ పథకాల ద్వారా ఆ వర్గాల వారికి ఆక్సిజన్ అందించగలిగామన్నారు. మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగదు బదిలీ రూపంలో ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాల వారికి చేరవేయడానికి ఉద్దేశించిన అన్ ఇంకంబర్డ్ ఖాతాలు అందించడంలో బ్యాంకులు చక్కటి సహకారాన్ని అందించాయన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వివిధ పథకాల కింద నగదును బదిలీ చేయగలిగామని చెప్పారు. ఈ ఏడాది మంచి వర్షాలు పడ్డాయని, రైతు భరోసాతో రైతులను ఆదుకున్నామని, వ్యవసాయ రంగం బాగుండడం ద్వారా ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.
కౌలు రైతులకూ రుణాలు ఇవ్వండి
కౌలు రైతుల విషయంలో లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు ఇవ్వడం లేదని ఎస్‌ఎల్‌బీసీ లెక్కలు చెబుతున్నాయని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. బ్యాంకర్లు, ప్రభుత్వం కలిసి కౌలు రైతులకు మరింత ఎక్కువగా రుణాలు అందించేలా ముందడుగు వేద్దామని కోరారు. కౌలు రైతుల కోసం ఒక చట్టాన్ని తీసుకు వచ్చామని, ఈ చట్టం పూర్తి పారదర్శకంగా ఉందని చెప్పారు. ఈ చట్టం ద్వారా రైతుల హక్కులను పరిరక్షిస్తూనే 11 నెలలకు సాగు ఒప్పందానికి వీలు కల్పిస్తోందన్నారు. రైతులు హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని అవగాహన కల్పించాల్సిందిగా సీఎం సూచించారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ చైతన్యం, అవగాహన కలిగించేలా కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు. ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఉందని, 10 నుంచి 12 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నారని, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉన్నారని సీఎం గుర్తు చేశారు. ప్రతి పథకాన్ని పారదర్శక విధానంలో వివక్ష, అవినీతికి తావు లేకుండా అందిస్తున్నామని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్లు కూడా ఉన్నారని, వీరిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు.
సచివాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఏప్రిల్ నాటికి 11 వేల రైతు భరోసా కేంద్రాలు
ఏప్రిల్ నాటికి గ్రామ సచివాలయాల పక్కనే దాదాపు 11 వేల రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. శిక్షణ కేంద్రంలా, రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందించేలా ఈ కేంద్రాలు పని చేస్తాయని, వీటికి ప్రభుత్వం గ్యారెంటీ కూడా ఇస్తుందని స్పష్టం చేశారు. సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులపై ఇక్కడ శిక్షణ ఇస్తారని, రైతుల ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలుగా కూడా భవిష్యత్తులో పని చేస్తాయని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఇంటర్నెట్ సౌకర్యంతో అనుసంధానిస్తామని, తద్వారా డిజిటలైజేషన్ పెరుగుతుందని చెప్పారు.
చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు
చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు చాలా మంది ఉన్నారని, వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. వీరందరికీ గుర్తింపు కార్డులతో రూ.10 వేల చొప్పున వడ్డీలేని రుణాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. తద్వారా దాదాపు 12 లక్షల మంది లబ్ధి పొందుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ నవోదయం కింద ఖాతాల పునర్ వ్యవస్థీకరణపై కూడా దృష్టి పెట్టాలని, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలని ఆయన బ్యాంకర్లకు సూచించారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన వినియోగంలో రాష్ట్రం 12వ ర్యాంకులో ఉందని చెబుతున్నారని, ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలని సీఎం సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీనిపై దృష్టి పెడతామన్నారు.
రైతులు, మహిళా సంఘాల రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదే
రైతులకు, మహిళా సంఘాలకు సకాలంలో రుణాలివ్వాలని సీఎం బ్యాంకర్లను కోరారు. వడ్డీ చెల్లింపు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. మహిళలు, రైతుల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో రుణాలు ఇవ్వాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల రుణాలపై వివిధ జిల్లాల్లో వేసే వడ్డీల్లో వ్యత్యాసం ఉందని, 6 జిల్లాల్లో 7 శాతం, 7 జిల్లాల్లో 12 శాతం ఉందని, ఈ వ్యత్యాసాన్ని తొలగించడానికి కృషి చేయాలని సూచించారు. గత ప్రభుత్వం వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ కింద పెట్టిన బకాయిలు రూ.648.62 కోట్లు ఉన్నాయని బ్యాంకర్లు చెబుతున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విషయాన్ని బ్యాంకులు పదే పదే తన దృష్టికి తీసుకు రావడంతో సానుకూలంగా స్పందిస్తున్నానని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా బ్యాంకర్లు దృష్టి పెట్టాలని సీఎం కోరారు.
మాకూ కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయి..
మాకూ కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా కరవు ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) డేటా ప్రకారం శ్రీశైలం వద్ద కృష్ణాలో వచ్చిన నీళ్లు 47 సంవత్సరాల సగటు 1,200 టీఎంసీలుండగా గత 10 ఏళ్లలో అది 600 టీఎంసీలకు పడిపోయిందని చెప్పారు. గత 5 ఏళ్లలో అయితే ఏకంగా 400 టీఎంసీలకు పడిపోయిందని వివరించారు. మరో వైపు గోదావరి నుంచి 3 వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయన్నారు. గోదావరి మిగులు జలాలను వాడుకోవాల్సి ఉందని, 62 శాతం ప్రజలు ఇంకా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారని, రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసి కరువు ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేవేనని, వీటికి బ్యాంకర్లందరూ సహాయం అందించాలని సీఎం కోరారు.
స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పునరుద్ధరణ
నాడు – నేడు కింద ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రుల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతున్నామని, మొత్తం 45 వేల స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలను బాగు చేస్తున్నామని సీఎం చెప్పారు. ఇందు కోసం దాదాపు రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. అమ్మ ఒడి అనే గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నామని, తద్వారా సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా అడుగు వేస్తున్నామన్నారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతున్నామని, మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచుతున్నామని సీఎం వివరించారు. వచ్చే నాలుగైదేళ్లలో విద్యాపరంగా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రం అగ్రస్థానంలో ఉండే విధంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో 62 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. వారిని ఆదుకోకపోతే ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాదు. అందుకే ప్రభుత్వం, బ్యాంకులు ఒకతాటిపైకి వచ్చి మరిన్ని కార్యక్రమాలు చేయగలగాలి.
ఉగాది నాటికి సంతృప్తికర స్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ.. మొత్తంగా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఆ తర్వాత ప్రతి ఏటా 6 లక్షల చొప్పున ఇళ్లు కడతాం. తద్వారా సిమెంట్, ఐరన్, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లు పెరుగుతాయి. పారిశ్రామిక వృద్ధి సాధ్యమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment